పోలీసుల సజీవ దహనానికి యత్నం  | Persons Tried To Attack On Police With Kerosene In Chennai | Sakshi
Sakshi News home page

పోలీసుల సజీవ దహనానికి యత్నం 

Published Sat, May 2 2020 7:28 AM | Last Updated on Sat, May 2 2020 7:35 AM

Persons Tried To Attack On Police With Kerosene In Chennai - Sakshi

సాక్షి, చెన్నై : చెన్నైకి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు తమ మద్దతుదారులతో కలిసి ఓ ఎస్‌ఐ, మరో ముగ్గురు పోలీసుల్ని సజీవ దహనం చేయడానికి యత్నించారు. వివరాలు.. చెన్నై కొడంగయూరు చిత్తాడి మఠంకు చెందిన కృష్ణమూర్తి(28) శుక్రవారం ఉదయం మోటారు సైకిల్‌ మీద వెళ్తుండగా, ట్యాంకర్‌ లారీ ఢీకొంది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. తనను లారీ ఢీకొన్నట్టు తన సోదరుడు సురేష్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో మద్దతుదారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న సురేష్ ట్యాంకర్‌ డ్రైవర్‌ మురుగన్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతడ్ని వారి ప్రాంతానికి తీసుకెళ్లి కట్టి పడేశాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొడంగయూరు ఎస్‌ఐ పళని నేతృత్వంలో ముగ్గురు పోలీసులు, జీపు డ్రైవర్‌ మణికంఠన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ను విడిచి పెట్టాలని సూచించినా, అన్నదమ్ములు వినిపించుకోలేదు. దీంతో కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడ్ని పోలీసులు జీపులో ఎక్కించడంలో ఆగ్రహానికి లోనైన సురేష్‌ కిరోసిన్‌ క్యాన్‌ తీసుకొచ్చి పోలీసుల మీద పోశాడు. తన సోదరుడ్ని విడిచిపెట్టకుంటే తగల బెట్టేస్తానని, సజీవదహనం చేస్తానని బెదిరించాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన పోలీసులు అతడ్ని విడిచిపెట్టారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగి డ్రైవర్‌ను రక్షించారు. అదే సమయంలో అన్నదమ్ముళ్లతో పాటు వారి అనుచరులు అక్కడి నుంచి ఉడాయించారు. ఆ ఇద్దరి మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement