కడుపు కోత
- అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు చిన్నారుల దుర్మరణం
- ఇంటి నుంచి వెళ్లిన క్షణాల్లోనే దారుణం
- తల్లిదండ్రుల కన్నీరు మున్నీరు
వారిద్దరూ ఒకే రక్తం పంచుకుపుట్టిన అక్కా చెల్లెళ్లు..ఇద్దరికీ రెండేళ్లే తేడా కావటంతో ఎప్పుడూ కలిసిమెలిసి తిరిగేవారు. ఒకే స్కూల్లో ఆరు, నాలుగు తరగతులు చదువుకుంటూ, చెట ్టపట్టాలేసుకుని బడికి వెళ్లేవారు. చదువుల్లో చక్కగా రాణిస్తూ ఆ ఇంటికి, అమ్మా నాన్నల కంటికీ వెలుగయ్యారు. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారులు ఇద్దరు కన్నుమూయటంతో తల్లిదండ్రులు అంతులేని శోకంలో మునిగిపోయారు.
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నాక కలిగిన ఇద్దరు సంతానాన్ని మృత్యువు మినీబస్సు రూపంలో క బళించిం ది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. శని వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు జయశ్రీ (11), విజయశ్రీ (9) మృతి చెందారు.
మేనమామతో కలిసి బైక్‌పై స్కూలుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్ర యివేటు స్కూలు మినీ బస్సు ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది,పట్టాభిరెడ్డి తోట నివాసి పినిశెట్టి అప్పలనారాయణ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కార్మికుడైన అప్పలనారాయణ దంపతులు పిల్లలే లో కంగా జీవిస్తున్నారు. కుమార్తెల కోరికలను ఏనాడూ కాదనలేదు. శక్తికి మించిన చదువులు చదివిస్తున్నారు. పిల్లల మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ‘దేవుడా ఇలా చేశావేంటి‘ అంటూ తలలు బాదుకుని ఏడ్చారు. ‘మేము బతికేది పిల్లల కోసం ఇంకా మా బతుకులు ఎందుకు!’ అంటూ రోదించారు.
ఆఖరి పరీక్ష రోజే..: శనివారంతో పరీక్షలు పూర్తి కావడంతో చలాకీగా తయారయ్యారు. ఆఖరి పరీక్ష కావడంతో జయశ్రీ, విజయశ్రీ సంతోషంగా గడిపారు. చకచకా స్కూల్‌కి సిద్ధమయ్యారు. ఆఖరి పరీక్ష పూర్తితో ఇక సెలవుల్లో సరదాగా గడుపుదామని ఆశపడ్డారు. సినిమా, బీచ్ అంటూ కోరికలు కోరారు. పరీక్షలు పూర్తి అయితే అలాగే చేద్దామని తల్లిదండ్రులు అంగీకరించారు. వారికి టాటా చెప్పి స్కూల్‌కు బయలుదేరారు. ఇంటి నుంచి వెళ్లిన నిమిషం వ్యవధిలో ప్రమాదానికి గురయ్యారు.
అప్పటి వరకూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన పిల్లలకు ప్రమాదం జరిగిందని తెలిసి షాక్‌కు గురయ్యారు. ప్రమాద స్థలంలో జయశ్రీ తొలుత మృతి చెందినట్టు తల్లిదండ్రులకు తెలియగా గుండెలు బాదుకున్నారు. చిన్న కుమార్తె విజయశ్రీ గాయాలవడంతో బతికి ఉందని తెలిసి కంగారుపడ్డారు. కొంతసేపటికి విజయశ్రీ మరణించిందన్న సమాచారంతో తల్లి స్పృహ తప్పింది. ఆఖరి పరీక్ష రాయకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు.