హైదరాబాద్ : 'అభయ' కేసు నిందితులను పోలీసులు బుధవారం మియాపూర్ లోని తొమ్మిదవ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అలాగే రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చారు. కాగా నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది.
ఢిల్లీ నిర్భయ కేసును తలపించేలా హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగినిపై ఇద్దరు కారు డ్రైవర్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సతీష్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా బాధితురాలికి సంబంధించిన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆమెకు పోలీసులు‘అభయ’ అనే పేరు పెట్టారు. మరోవైపు అభయ కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
నిందితులు ఇద్దరూ కారు డ్రైవర్లే: పీయూష్ అనే వ్యక్తి ఈ కారును 24X7 ట్రాన్స్‌లైన్ ట్రావెల్స్‌కు అద్దెకిచ్చాడు. అలెగ్జాండర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్న సీపీ అగర్వాల్ దానిని వాడుతున్నారు. వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్ (30) డ్రైవర్. ఈ కారు డ్రైవర్ సతీషే నిందితుడిగా రూఢీ చేసుకున్న పోలీసులు అతడికి అదుపులోకి తీసుకుని విచారించారు.
తనతో పాటు కారులో ఉన్నది నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన తన స్నేహితుడు, కారు డ్రైవర్ నెమ్మడి వెంకటేశ్వర్లు (28)గా సతీష్ వెల్లడించాడు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. వీరిద్దరూ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్నారు. నిందితులపై ఐపీసీ 363, 364, 365, 366, (కిడ్నాప్) 376 (డి) (గ్యాంగ్‌రేప్) సెక్షన్లు, 2013 నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.