Abhaya case
-
కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు
కోల్‌కతా: బెంగాల్లో అభయ ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేపట్టారు. దాదాపు 41 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా జూనియర్ డాక్టర్లు తామ ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి(శనివారం) అత్యవసర వైద్య సేవల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన రెండు సమావేశాల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య రెండు రోజుల క్రితమే కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు. అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తమ ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ఎత్తేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, దానికి ముందు నగరంలో మధ్యాహ్నం మూడు గంటలకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కేసును త్వరగా విచారించేందుకు సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే, తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు బెంగాల్ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని, అప్పటికీ అమలుకాకపోతే తిరిగి విధులను బహిష్కస్తామని హెచ్చరించారు.మరోవైపు.. జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో భాగంగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు.మాజీ ప్రిన్సిపల్ రిజిస్ట్రేషన్ రద్దుఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను బంగాల్ వైద్య మండలి (డబ్ల్యూబీఎంసీ) రద్దు చేసింది. అలాగే, 1914 బెంగాల్ వైద్య చట్టం కింద సందీప్ ఘోష్ మెడికల్ లైసెన్సును కూడా రద్దు చేసినట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఖర్గే లేఖ.. కౌంటర్ ఇచ్చిన నడ్డా -
‘సీఎం మమత చర్యలు తీసుకొని ఉంటే.. నా బిడ్డ బతికేది’
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితురాలికి న్యాయం చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. తన కూతురికి జరిగిన దారుణ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ల డాక్టర్లు తన బిడ్డలలాంటి వారని అన్నారు. సీఎం మమతా బెనర్జీ 2021లోనే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై చర్యలు తీసుకొని ఉంటే.. ఇవాళ తన కుమార్తె బతికే ఉండేదని అన్నారు.‘‘ సీబీఐ తన పని తాను చేస్తోంది. సీబీఐ విచారణ గురించి నేను ఏం మాట్లాడలేను. ఈ హత్యతో సంబంధం ఉన్నవాళ్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన వారందరూ విచారణలో ఉన్నారు. తీవ్రమైన బాధతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారంతా నా పిల్లలలాంటి వారు, వారిని చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. నిందితులకు శిక్ష పడిన రోజు మనం విజయం సాధించినట్టు. 2021లో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పుడే సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమత బెనర్జీ చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు నా కూతురు బతికే ఉండేది’’ అని అన్నారు."My daughter would have been alive...": RG Kar Medical College victim's father#RGKarMedicalCollege #victimfather #RGKarMedicalCollegecase #kolkataincident #newsupdate #CareForElders #StopInjustice #राष्ट्रीय_बेरोजगार_दिवस #Iran pic.twitter.com/XovHWLcdTU— The Savera Times (@thesavera) September 18, 2024credits: The Savera Timesమరోవైపు.. ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటు వేయాలన్న వైద్యుల డిమాండ్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అంగీకరించింది. అనంతరం కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డాక్టర్ల ప్రతినిధి బృందం మధ్య జరిగిన సమావేశం అనంతరం జూడాల డిమాండ్‌కు అనుకూలంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు ఇంకా తమ సమ్మెను విరమించకపోవటం గమనార్హం.చదవండి: జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం -
కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐకి ఎదురుదెబ్బ
కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీకార్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అభయ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడి విషయంలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి నార్కో అనాలసిస్ పరీక్ష చేయడానికి సీబీఐ సిద్ధమైంది ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా సీబీఐకి ధర్మాసనం షాకిచ్చింది. కోల్‌కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. నిందితుడికి నార్కో పరీక్షకు అనుమతివ్వాలన్న సీబీఐ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో, సీబీఐ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. RG Kar Medical College and Hospital rape-murder case | Arrested accused Sanjay Roy refuses to give consent for Narco analysis test. The Sealdah Court in Kolkata rejected the CBI's prayer for Sanjay Roy's narco-analysis test.— ANI (@ANI) September 13, 2024 అయితే, అభయ హత్యాచార ఘటన కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు సీబీఐ ఇప్పటికే పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను సీబీఐ బయటకు వెల్లడించలేదు. ఇక, పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుడులు చెప్పిన విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు. మరోవైపు.. పాలీగ్రాఫ్ టెస్టులో సంజయ్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని సీబీఐ అధికారులకు చెప్పాడనే లీకులు బయటకు రావడం గమనార్హం. తాను వెళ్లేసరికే ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, తాను భయంతో పారిపోయానని అతడు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అభయ కేసుకు సంబంధించి అసలు నిజాలను రాబట్టేందుకే నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ భావించింది. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case | West Bengal: Arrested accused Sanjay Roy being brought out of Sealdah Court in Kolkata.He was brought to the Court from Presidency Correctional Home for a hearing related to his Narco test. CBI filed a petition to… pic.twitter.com/XhReY58vdb— ANI (@ANI) September 13, 2024 నార్కో టెస్ట్ ఇలా.. ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు(సోడియం పెంటోథాల్, స్కోపలామైన్, సోడియం అమైథాల్) ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్‌కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్‌కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్ ద్వారా ధృవీకరించుకుంటారు. ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందం నుంచి తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్‌ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి.గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు.పాలీగ్రాఫ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే.. పాలీగ్రాఫ్ టెస్ట్.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. దీన్ని లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్‌తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి.. బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తుంటారు.శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష. కానీ, ఇదే ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష కచ్చితత్వంపై తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి.ఇది కూడా చదవండి: ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి -
సిస్టర్ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు
తిరువనంతపురం: కేరళలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ కేసులో సీబీఐ కోర్టు ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సీబీఐ కోర్టు వీరికి శిక్ష ఖరారు చేసింది. ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీకి సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. దాంతో పాటు చెరో ఐదు లక్షల రూపాలయ జరిమానా కూడా విధించింది. దాదాపు 28 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో చివరికి నేడు కోర్టు దోషులకు శిక్ష విధించింది. 1993లో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు ఓ సిస్టర్ను అరెస్ట్ చేసింది. ఇక నేడు సీబీఐ కోర్టు వారికి శిక్ష విధించింది. ఇక కుమార్తెకు న్యాయం జరగాలని పోరాడిన అభయ తలిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. కోర్టు తీర్పుతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని స్నేహితులు భావిస్తున్నారు. (చదవండి: ‘ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను’) ఇక సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ దోషులు థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్ధారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. -
28 ఏళ్ల తర్వాత సిస్టర్ అభయ హత్య కేసులో తీర్పు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో 1992లో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళశారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది. రేపు(డిసెంబర్23) దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. 1992, మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్, నన్ సెఫీ హత్య చేసినట్లు నికోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల తర్వాత అభయ హత్య కేసులో తీర్పు వెలువడింది. చదవండి: 9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు కేసు వివరాలు.. 1992లో సిస్టర్ అభయ(21) కేరళలోని బీఎంసీ కళాశౠలలో సైకాలజీ కోర్సు చేస్తోంది. ఆ సమయంలో థామస్ కొట్టూరు సైకాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్లో ఉన్న ఓ బావిలో అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్దారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం దీని విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది. అనంతరం సిస్టర్ అభయ హత్యకు గురైందని సీబీఐ తేల్చింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు ఓ సిస్టర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ థామస్ కొత్తూర్,జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో విసిరేశారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 28 ఏళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి థామస్. నన్ సెఫీని దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పిచ్చింది. -
అప్పుడు అభయ.. ఇప్పుడు !
సాక్షి, హైదరాబాద్ : వేళకాని వేళలో నడిరోడ్డుపై ఒంటరిగా మిగిలి దుండగుల బారినపడిన పశు వైద్యురాలు ప్రియాంకరెడ్డి ఘటన.. 2013 అక్టోబర్‌లో చోటుచేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అప్పట్లో ఆ అతివను అపహరించిన దుండగులు అత్యాచారం చేశారు. బెంగళూరుకు చెందిన అభయ (22) ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గౌలిదొడ్డిలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసేవారు. 2013 అక్టోబర్ 18న సాయంత్రం 5:30 గంటలకు విధులు ముగించుకొని షాపింగ్ నిమిత్తం సమీపంలోని ఇనార్బిట్‌మాల్‌కు వెళ్లారు. రాత్రి 7:30 గంటలకు బయటకు వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు సమీపంలోని బస్టాండ్‌లో నిల్చున్నారు. అర్ధగంట తర్వాత వచ్చిన ఓ బస్సు ఎక్కారు. చిన్న పొరపాటు... రాత్రి సమయంలో బస్సు ఎక్కేముందు అభయ అది వెళ్లే మార్గాన్ని బేరీజు వేయడంలో చేసిన చిన్న పొరపాటే నాటి ఘాతుకానికి నాందిగా మారింది. ఆ బస్సు ఆమె వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే రూట్లోకి మలుపు తిరగడంతో అప్రమత్తమై రహేజా మైండ్‌స్పేస్ చౌరస్తా వద్ద దిగిపోయారు. అక్కడి నుంచి గౌలిదొడ్డి వెళ్లేందుకు టీసీఎస్ బిల్డింగ్ వద్ద ఉన్న మరో బస్టాప్ వద్దకు వచ్చి వేచి ఉన్నారు. ఎంతకీ బస్సు రాకపోవడంతో షేరింగ్ కార్లు, ట్యాక్సీల్లో వెళ్లేందుకు తిరిగి నడుచుకుంటూ మైండ్‌స్పేస్ చౌరస్తాకు వచ్చారు. 8:40 గంటల ప్రాంతంలో ఓ తెల్లరంగు కారు వచ్చి ఆమె ముందు ఆగింది. డ్రైవర్ కిందికి దిగి ఎక్కడకు వెళ్లాలని అడగ్గా... గౌలిదొడ్డి వెళ్లాలని చెప్పింది. అతడు రూ.50 డిమాండ్ చేయడంతో బేరమాడి రూ.40 ఇచ్చేందుకు అంగీకరించి ఎక్కింది. అప్పటికే కారు వెనక సీట్లో మరో వ్యక్తి ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో షేరింగ్స్ సాధారణం కావడంతో అతడూ తన మాదిరి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయి ఉంటాడని భావించారు. చాటింగ్‌లో మునిగిపోగా ముప్పు... కారు ఎక్కిన అభయ చుట్టుపక్కల పరికించకుండా చాటింగ్‌లో మునిగిపోవడం దుండగులకు కలిసొచ్చి ఈమెకు ముప్పు ముంచుకొచ్చింది. ఆమె తన సెల్‌ఫోన్ నుంచి స్నేహితుడితో చాటింగ్ చేస్తుండగా, ఖాజాగూడ జంక్షన్‌కు చేరుకున్న కారు ఎడమ వైపు తిరిగింది. గౌలిదొడ్డి వెళ్లడానికి కుడివైపు తిరగాల్సి ఉండగా వ్యతిరేకంగా తిరగడాన్ని చాటింగ్‌లో ఉన్న ఆమె గమనించలేదు. చివరకు కారు ఔటర్ రింగ్ రోడ్డుపైకి ఎక్కుతుండగా గమనించిన ఆమె దారి తప్పామని చెప్పింది. దీంతో డ్రైవర్ చెక్‌పోస్టులో ఉన్న వాచ్‌మెన్‌ను ఈ దారి ఎక్కడికి వెళ్తుందంటూ అడిగి తనకు తెలియనట్లు నటించాడు. అప్పటికే పథకం సిద్ధం చేసుకున్న దుండగులు ఆమె కిందకు దిగే ఆస్కారం లేకుండా కారు డోర్లు, అద్దాలను సెంట్రల్ లాక్ చేశారు. ప్రాణాలు తీస్తామని బెదిరించి దారుణం.. ఆమెకు మాట్లాడే, అరిచే అవకాశమివ్వని దుండగులు కారును ముందుకు పోనిచ్చి అప్పా జంక్షన్ మీదుగా దాదాపు 22 కి.మీ దూరంలోని కొల్లూరు జంక్షన్ వరకు ఔటర్ రింగ్ రోడ్‌పైనే తీసుకెళ్లారు. అక్కడ కారును ఓఆర్ఆర్ పైనుంచి సర్వీస్ రోడ్డులోకి దించి, లింగంపల్లి వైపు పోనిచ్చారు. ఆ ప్రాంతంలోని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక ఉన్న దట్టమైన టేకు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి కారును ఆపారు. ‘మాకు సహకరించకుంటే నీ ప్రాణాలతో పాటు నీ తల్లిదండ్రుల ప్రాణాలు కూడా తీస్తాం’ అంటూ బెదిరించి ఇద్దరూ అత్యాచారం చేశారు. ఆపై ఆమెను హాస్టల్ వద్ద దింపి వెళ్లిపోయారు. దుండగులు తనను కారులో తీసుకెళ్తున్న సమయంలోనే అభయ కిడ్నాప్ చేశారని అనుమానించింది. దీంతో తన సెల్‌ఫోన్ ద్వారా బెంగళూరులోని తన స్నేహితుడికి విషయం తెలిపింది. అతడి సలహా మేరకు ఆర్తనాదాలు చేయగా... సెల్‌ఫోన్ లాక్కున్న దుండగులు స్విచ్ఛాఫ్ చేశారు. ఈ విషయం మరోసారి కాల్ చేసినప్పుడు గమనించిన స్నేహితుడు ఏదో జరిగిందని శంకించాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలని బాలానగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడు శ్రీనివాస్‌ను కోరాడు. అప్రమత్తమైన అతడు మాదాపూర్‌కు చేరుకొని గాలించినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో... అదే రోజు రాత్రి 10:50 గంటలకు మాదాపూర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. అధికారులు కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాల సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చేపట్టారు. 9 నెలల్లో తీర్పు... పోలీసులతో బాధితురాలు తాను ఎక్కింది తెల్లరంగు కారని, డ్రైవర్ పేరు సతీష్‌గా గుర్తించానని మాత్రమే వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సహకారంతో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ముందుకెళ్లారు. కారు డ్రైవర్‌గా వ్యవహరించిన వెడిచెర్ల సతీష్‌తో పాటు అతడి స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లును నాలుగు రోజుల్లోనే అరెస్టు చేశారు. వీరిపై నేరం నిరూపించడానికి అవసరమైన పక్కా ఆధారాలను సేకరించారు. నిర్ణీత కాలంలో నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో పాటు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయించారు. ఫలితంగా తొమ్మిది నెలల్లో విచారణ పూర్తై నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు నిందితులకు బెయిల్ లభించలేదు. చదవండి : ఆరు దాటితే ఆగమే ! భద్రతపై భయం సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్ ప్రియాంకరెడ్డి ఘటనపై పౌర సమాజం భగ్గుమంటోంది. మహానగరం సేఫ్ సిటీగా మారుతున్న వేళ ఊహించని ఉత్పాతం అందరినీ కలవరపరిచింది. ఒంటరి మహిళను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ సంఘటన మహిళల్లో గగుర్పాటుకు కారణమైంది. చీకటి పడగానే రహదారులపై తాగుతూ, తూలుతూ ఉండేవారితో పాటు అదను కోసం వేచి చూసే మృగాళ్ల చేతిలో ఒంటరి మహిళలు బలైపోతున్న దారుణం మరోసారి వెలుగుచూసింది. ఇలాంటి పరిస్థితులపై వివిధ రంగాల ప్రముఖుల స్పందన ఇదీ... ఉరి తీయాలి.. మన దేశంలో మహిళ అంటే గౌరవం బదులు.. ఆమెను ఒక విలాస వస్తువుగా చలామణి చేసేస్తున్నారు. ఇందులో ఏ ఒక్క రంగానికి మినహాయింపు లేదు. తొలుత మహిళను గౌరవించే సాంస్కృతిక విప్లవం ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇక శంషాబాద్ ఘటన అత్యంత దారుణం. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలి. పోలీసులు, కోర్టులు క్రియాశీలకంగా వ్యవహరించి నిందితులకు ఉరిశిక్ష వేయాలి. – జస్టిస్ చంద్రకుమార్ ఏదీ భద్రత? ప్రియాంకను అలా చంపడం పాశవికం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు, పోలీసుల హడావుడి సర్వసాధారణమైంది. మహిళా భద్రతకు సంబంధించి కఠినమైన చట్టాలు రావాలంటే.. చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా అనేక సంఘటనల్లో మహిళలపై జరుగుతున్న హింసను పోలీసులు నిరూపించలేకపోవడం దారుణం. – డాక్టర్ శ్వేతాశెట్టి, అధ్యక్షురాలు, నేషనల్ ఉమెన్స్ పార్టీ సేఫ్ సిటీయేనా? నేను ఇప్పటి వరకు 60 దేశాలు తిరిగాను. మెజారిటీ దేశాల్లో ఇండియా అంటే సేఫ్ కాదన్న భావన ఉంది. కానీ నేను మాత్రం ఇండియా అందులోనూ హైదరాబాద్ సేఫ్ సిటీగా మారిందని చెబుతూ వచ్చాను. కానీ ఈ దారుణం చూసిన తర్వాత.. నాకే డౌట్ వస్తోంది. ఏదో తెలియని భయం వెంటాడుతోంది. – నీలిమారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ అప్డేట్ అవ్వాలి ముంచుకొచ్చే ముప్పుపై మహిళలు అలర్ట్‌గా ఉండాలి. సేఫ్ జర్నీ కోసం అనేక యాప్స్ వచ్చాయి. అనేక మార్షల్ ఆర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మహిళలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ తమను తాము కాపాడుకోవడంతో పాటు తమ కుటుంబాన్ని కాపాడేందుకు సిద్ధం కావాలి. డాక్టర్ ప్రియాంకను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. – అనూప్రసాద్, ఫిట్నెస్ ట్రైనర్ -
అభయ కేసు 11కు వాయిదా
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అభయ కేసువిచారణను ఎల్బీనగర్లోని సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ కోర్టుకు బదిలీచేశారు. సెషన్స్ కేసు నెం-51/14లో నిందితులైన సతీష్, వెంకటేష్‌లను జైలు అధికారులు గురువారం న్యాయస్థానంలో హాజరు పరిచారు. విచారణలో భాగంగా బాధితురాలిని డిఫెన్స్ కౌన్సిల్ విచారణ చేపట్టారు. తదుపరి సాక్షుల విచారణ కోసం కేసును ఈ నెల 11వ తేదీకి న్యాయమూర్తి నాగార్జున్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అభయ కేసులో డ్రైవర్ తో సహా మరోవ్యక్తిపై ఛార్జిషీటు దాఖలు
హైదరాబాద్:రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన అభయ కేసులో ఛార్జిషీటు దాఖలైంది.ఈ కేసులో డ్రైవర్ వెంకటేష్ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. అక్టోబర్ 18న ఓ యువతి షాపింగ్‌మాల్ నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కగా ఆమెను కిడ్నాప్ చేసి కారు డ్రైవర్ సతీష్, సహచరుడు వెంకటేశ్వర్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే. ఈ ఘటనపై 48 పేజీల ఛార్జీషీటును మాదాపూర్ పోలీసులు మియాపూర్ కోర్టులో దాఖలు చేశారు. గ్యాంగ్‌రేప్ సంఘటనలో నిందితులకు త్వరగా శిక్షలు ఖరారు చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. -
కరీంనగర్ జిల్లాలో బాలికపై యువకుడి అత్యాచారం
కరీంనగర్: మహిళలపై, బాలికలపై ఆకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఓ వైపు అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ ఘటనలు ఆగడం లేదు. వీరి ఆగడాలను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకవచ్చిన నిర్భయ, అభయ వంటి చట్టాలు ఉన్నా మహిళలకు, బాలికలకు రక్షణ కరువైంది. తాజాగా కరీంనగర్ జిల్లాలోని కోరుట్లో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ బాధితురాలి బంధువులు అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘అభయ’కు ముందూ దారుణాలు?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో గత నెలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభయను కిడ్నాప్ చేసి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల దురాగతాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులైన వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్, అతడి స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లును సైబరాబాద్ పోలీసుల ఇటీవల న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు వెలుగు చూశా యని సమాచారం. అభయపై అత్యాచారానికి కొన్ని నెలల ముందు మరో నేరం చేసినట్లు నిందితులు బయటపెట్టారు. సతీష్, వెంకటేశ్వర్లు ఓ రోజు వింగర్ వాహనంలో వెళ్తుండగా అర్ధరాత్రి రోడ్లను శుభ్రం చేస్తున్న స్వీపర్‌ను అపహరించి అందులో తిరుగుతూనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇప్పుడు ఆమెను గుర్తించడం, సాక్ష్యాధారాలు సేకరించడం కష్టం కావడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిసింది. -
అభయ కేసులో బయటపడ్డ మరిన్ని నిజాలు
హైదరాబాద్: రాష్ట్ర వాప్తంగా సంచలనం సృష్టించిన అభయ కేసులో మరిన్ని దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. అభయపై అత్యాచారానికి ముందే మరో ఇద్దరు యువతులపై అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో నిందితుడు సతీష్ అంగీకరించాడు. మరో నిందితుడు వెంకటేష్‌తో కలిసి అత్యాచారాలు చేశానని దర్యాప్తులో అతడు వెల్లడించాడు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ దారుణాలు వెలుగుచూడలేదు. దీన్ని అలుసుగా తీసుకుని అభయపై అత్యాచారానికి తెగబడ్డారు. గత నెల 18న అభయపై డ్రైవర్లు సతీష్, వెంకటేష్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాదాపూర్ నుంచి కారులో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఈ దారుణాకి ఒడిగట్టారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
భావోద్వేగానికి లొంగనిదే న్యాయం
రాజ్యాంగంలోని అధికరణ 22(1) ప్రకారం - ఎవరినైనా అరెస్టు చేసిన వెంటనే, ఏ కారణాలతో అరెస్టు చేశారో అతనికి తెలియజేయాలి. ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశాన్ని కల్పించాలి. ‘నిర్భయ’, ‘అభయ’ కేసులు మానవతా వాదులందరినీ బాధిస్తాయి. భావోద్వేగానికి గురిచేస్తాయి. ఫలితంగా నేరగాళ్ల విషయంలో వారు రాజ్యాంగ వ్యతిరేక, చట్టవ్యతిరేక ప్రక టనలు చేస్తూ ఉంటారు. అభయ కేసు తరువాత నిందితులను కాల్చివేయాలని ఒక నాయకుడు, అంగచ్ఛేదనం చేయాలని ఓ నాయకురాలు ప్రకటించారు. వారి ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ బాధ్యతాయుత మైన పదవుల్లో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయకూడదు. కొన్నేళ్ల క్రితం యాసిడ్ దాడి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ‘ఎదు రు కాల్పుల్లో’ చనిపోయారు. దాని ప్రభావం తాత్కాలికమే. ఈ నాగరిక సమాజంలో న్యాయాధిక్యం (రూల్ ఆఫ్ లా) గెలవాలి. మనసుల్లో అనుకున్నట్టుగా శిక్షలు విధిస్తే మనది అనాగరిక సమాజం అయిపోతుంది. ‘నిర్భయ’, ‘అభయ’ కేసుల లాంటివి, ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు నాయకు లూ, సాధారణ ప్రజానీకంతో పాటు, న్యాయ వాదులూ విచిత్రంగా స్పందిస్తూ ఉంటారు. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తుల కేసులని వాదించబోమని న్యాయవాదుల సంఘాలు తీర్మానిస్తుంటాయి. దేశవ్యాప్తంగా ఇదే పరి స్థితి. రాజ్యాంగం చదువుకొని, రోజూ శాసనా లని చదువుతూ వ్యాజ్యాలలో వాదిస్తున్న వారు ఇలాంటి తీర్మానాలు చేయడం ఎంత వరకు సమంజసం? పోలీసుల ముందు ఒప్పుకున్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు కదా! నేరం రుజువయ్యే వరకు ముద్దా యిని అమాయకుడిగా పరిగణించాలని న్యాయశాస్త్రం చెబుతుంది. వాదించుకోవడా నికి, నడపడానికి న్యాయవాది సాయం లేక పోతే ఆ కేసుకి విలువ ఉండదు. శిక్ష పడినా పై కోర్టులలో నిలవదు. ఈ విషయం గురించి సుప్రీంకోర్టు, రాజ్యాంగం ఏమని నిర్దేశిస్తు న్నాయో చూద్దాం. రాజ్యాంగంలోని అధికరణ 22(1) ప్రకారం - ఎవరినైనా అరెస్టు చేసిన వెంటనే, ఏ కారణాలతో అరెస్టు చేశారో అతనికి తెలియ జేయాలి. ఇష్టమైన న్యాయవాదిని సంప్రదిం చుకునే అవకాశాన్ని కల్పించాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన అధ్యాయం -2లోని నియమాల ప్రకారం ఆ న్యాయవాది వచ్చిన కేసుని విధిగా స్వీకరించాలి. నిరాకరిం చడానికి వీల్లేదు. ఎ.ఎస్. మహమ్మద్ రఫీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (ఏ.ఐ.ఆర్. 2011 సుప్రీం కోర్టు 308- తీర్పు తేదీ, 6.12.2010) కేసు విషయాలని పరిశీలించి కోర్టు ఈ ఆదేశాలని జారీ చేసింది. ‘న్యాయవాదుల నీతి నియమాల సూత్రాల ప్రకారం, న్యాయవాది చట్ట ప్రకారం కోరిన ఫీజుని ముద్దాయి గానీ వాది గానీ చెల్లించడానికి ఇష్టపడినప్పుడు ఆ కేసు లని నిరాకరించడానికి వీల్లేదు. అందుకని న్యాయవాదుల సంఘం తీర్మానం చేసినంత మాత్రాన నేరం ఆరోపించిన పోలీసుల కేసు లని, అనుమానిత ఉగ్రవాదుల కేసులని, హత్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారి కేసులని, మానభంగం ఆరోపణలు ఉన్న వ్యక్తుల కేసులని వాదించడానికి నిరాక రించకూడదు. ఇలాంటి కేసులని స్వీకరించ కూడదన్న తీర్మానాలు రాజ్యాంగ వ్యతిరేకం, శాసన విరుద్ధం, వృత్తి నియమాలకి విఘా తం. అంతేకాదు భారత న్యాయవాదులకి ఉన్న సంస్కృతికి మాయని మచ్చ. అందుకని ఇలాంటి తీర్మానాలు చెల్లవని, శాసన వ్యతిరే కమని ప్రకటిస్తున్నాం. అలాంటి తీర్మానాలని న్యాయవాదులు ఉల్లంఘించాలి. ప్రజాస్వా మ్యాన్ని న్యాయాధిక్యాన్ని కాపాడాలి. ఎలాం టి పరిణామాలు ఎదురైనా న్యాయవాదులు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ఈ విధం గా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించని న్యాయ వాదులు గీతలోని సందేశాన్ని పాటించడం లేదని అనుకోవాల్సి ఉంటుంది’. న్యాయవాదులు ఈ విషయాలను గుర్తిం చుకోవాలి. 1792లో ‘మనుషుల హక్కులు’ అన్న కరపత్రం రాసిన ధామస్ ఫైన్ మీద బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహాన్ని ఆపాదిం చింది. ఆ కేసుని వాదించడానికి థామస్ ఎక్క న్ అన్న ప్రముఖ న్యాయవాది ముందుకొచ్చా డు. అప్పుడు ఆయన ఫ్రిన్స్ ఆఫ్ వేల్స్‌కి అటా ర్నీ జనరల్. కేసు వాదిస్తే ఆ పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు. అయినా వాదిం చాడు. పదవిని కోల్పోయాడు. ఆ సందర్భం లో అతను చెప్పిన మాటలు న్యాయవాదులు గుర్తించుకోవాలి. ‘రాజుకీ కోర్టుకీ మధ్య ఉండను అని ఎవ రైనా న్యాయవాది అనుకుంటే ఇంగ్లాండ్‌లో వ్యక్తి స్వేచ్ఛకి ముగింపు వచ్చినట్టే. కేసుని స్వీకరించకూడదని న్యాయవాది అనుకుంటే అతను తీర్పు కన్నా ముందే నిర్ణయానికి వచ్చి నట్టు. ముద్దాయికి వ్యతిరేకంగా త్రాసు మొగ్గి నట్టుగా భావించాల్సి ఉంటుంది.’ లక్షలాది మందిని హతమార్చిన నాజీల తరఫున కూడా న్యూరమ్బర్గ్ విచారణల్లో న్యాయవాదులు వాదించారు. చరిత్రలో ఇట్లా ఎన్నో. కోర్టుల్లో రుజువైతేనే నేరం చేసినట్టు. ఇప్పుడు కావాల్సింది సత్వర దర్యాప్తు. ఆ తరువాత సత్వర విచారణ. ఇవి రెండూ సత్వ రం జరిగితే న్యాయాధిక్యం నిలుస్తుంది. మరో విధంగా ఉంటే అది సత్ఫలితాలను ఇవ్వదు. సరికదా చెడు పరిణామాలకు దారితీస్తుంది. -మంగారి రాజేందర్ -
‘అభయ’ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో ఇటీవల చోటు చేసుకున్న అభయ ఘటనతోపాటు నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణ విషయంలో తక్షణ చర్యల సూచనల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని ఆదేశించారు. అభయ ఘటన నేపథ్యంలో మహిళలమీద జరుగుతున్న నేరాల నియంత్రణపై పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్షించారు. అభయ ఘటనల వంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, వీటిల్లో ఐటీ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. మహిళలపై నేరాల్లో సైబరాబాద్ మొదటి స్థానం రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 24.64 శాతం పెరిగింది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 12,731 కేసులు నమోదుకాగా... ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఆ సంఖ్య 15,868కు పెరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,285 కేసులు మొదటి ఆరు నెలల్లో నమోదయ్యాయి. విజయవాడ సిటీ (915), హైదరాబాద్ సిటీ (870 కేసులు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. -
‘అభయ’ నిందితులను శిక్షించాలి
సాక్షి, హైదరాబాద్: ‘అభయ’ అత్యాచార ఉదంతం కేసులో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని సచివాలయ మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. అత్యాచారాలకు తెగబడుతున్న మృగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు గురువారం సచివాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సచివాలయ మహిళా ఉద్యోగ సంఘం ప్రతినిధులు వరలక్ష్మి, సుభద్ర, లలిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని వారు ఆరోపించారు. చట్టాలు చేయడంతోనే సరిపోదని, ఆ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. అత్యాచార దోషులకు క్యాస్ట్రేషన్ చికిత్స చేయాలని డిమాండ్ చేశారు. నిర్భయ చట్టంపై విసృ్తత అవగాహన కల్పించి మహిళలపై వేధింపులను నివారించేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
గ్యాంగ్‌రేప్ నిందితులకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: సంచలనం కలిగించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అభయపై గ్యాంగ్‌రే ప్ కేసులో నిందితులను మాదాపూర్ పోలీసులు బుధవారం మియాపూర్‌లోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సత్యనారాయణ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిందితులైన కారు డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లును విచారించేందుకు రెండురోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నెల 27,28 తేదీల్లో వారిని పోలీసు కస్టడీకి అనుమతించింది. అనంతరం పోలీసులు వారిని మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలోని కంది జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను.. ముసుగులు వేసి కాళ్లు, చేతులకు సంకెళ్లతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జిల్లా జైలుకు తీసుకువచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా జైలు సూపరింటెండెంట్ పి.నాగేశ్వర్‌రెడ్డి నిందితులను ప్రత్యేక సెల్‌కు తరలించారు. తోటి ఖైదీలు దాడి చేసే అవకాశముందనే అనుమానంతో ప్రత్యేక సెల్లో ఉంచి భద్రత ఏర్పాటు చేశామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. నేడు లైంగిక సామర్థ్య పరీక్షలు: కోర్టు ఆదేశాల మేరకు గురువారం నిందితులకు లైంగిక సామర్థ్య పరీ క్షలు నిర్వహించనున్నారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాల నూ సేకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అభయ షాపింగ్ చేసిన ఇనార్బిట్ షాపింగ్ మాల్ మొదలు.. మైండ్‌స్పేస్ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్‌లోని టోల్గేట్, కొల్లూరు టోల్గేట్ వద్ద గల ప్రత్యక్ష సాక్షుల వివరాలను సేకరిస్తున్నారు. కారును డ్రైవర్ ఎలా ఉపయోగిస్తున్నాడో తెలుసుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించిన సీపీ అగర్వాల్ (ట్రావెల్స్ నుంచి అద్దెకు తీసుకున్న వ్యక్తి)పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిందితుల తరఫున వాదించం: న్యాయవాదులు ఈ కేసులో నిందితుల బెయిల్‌కు సహకరించరాదని రంగారెడ్డి జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ తీర్మానించింది. అభయపై లైంగిక దాడికి నిరసనగా కొత్తపేటలోని కోర్టు భవనం ముందు బార్ అసోసియేషన్ నాయకులు, పలువురు మహిళా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజి రెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి దేవరాజ్, మహిళా సంయుక్త కార్యదర్శి సునీత, జాట్ అధ్యక్షుడు నరేష్కుమార్ పాల్గొన్నారు. నిందితుల తరఫున ఎవరూ వాదించరాదని మియాపూర్ బార్ అసోసియేషన్ తీర్మానించినట్లు నాయకులు జి.శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలు తెలిపారు. -
'అభయ' నిందితులకు 5వరకూ రిమాండ్
హైదరాబాద్ : 'అభయ' కేసు నిందితులను పోలీసులు బుధవారం మియాపూర్ లోని తొమ్మిదవ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అలాగే రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చారు. కాగా నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది. ఢిల్లీ నిర్భయ కేసును తలపించేలా హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగినిపై ఇద్దరు కారు డ్రైవర్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సతీష్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా బాధితురాలికి సంబంధించిన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆమెకు పోలీసులు‘అభయ’ అనే పేరు పెట్టారు. మరోవైపు అభయ కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. నిందితులు ఇద్దరూ కారు డ్రైవర్లే: పీయూష్ అనే వ్యక్తి ఈ కారును 24X7 ట్రాన్స్‌లైన్ ట్రావెల్స్‌కు అద్దెకిచ్చాడు. అలెగ్జాండర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్న సీపీ అగర్వాల్ దానిని వాడుతున్నారు. వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్ (30) డ్రైవర్. ఈ కారు డ్రైవర్ సతీషే నిందితుడిగా రూఢీ చేసుకున్న పోలీసులు అతడికి అదుపులోకి తీసుకుని విచారించారు. తనతో పాటు కారులో ఉన్నది నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన తన స్నేహితుడు, కారు డ్రైవర్ నెమ్మడి వెంకటేశ్వర్లు (28)గా సతీష్ వెల్లడించాడు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. వీరిద్దరూ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్నారు. నిందితులపై ఐపీసీ 363, 364, 365, 366, (కిడ్నాప్) 376 (డి) (గ్యాంగ్‌రేప్) సెక్షన్లు, 2013 నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
'అభయ' నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయం
హైదరాబాద్: అభయ కేసు నిందుతుల తరఫున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. బెంగళూరుకు చెందిన అభయ అనే యువతిపై ఈ నెల 18న ఇద్దరు డ్రైవర్లు అతి దారుణంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులైన డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లు తరపున కోర్టులో వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, అభయ అత్యాచార ఘటనకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఈరోజు సచివాలయంను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.