సాక్షి, హైదరాబాద్: ‘అభయ’ అత్యాచార ఉదంతం కేసులో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని సచివాలయ మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. అత్యాచారాలకు తెగబడుతున్న మృగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు గురువారం సచివాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సచివాలయ మహిళా ఉద్యోగ సంఘం ప్రతినిధులు వరలక్ష్మి, సుభద్ర, లలిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని వారు ఆరోపించారు.
చట్టాలు చేయడంతోనే సరిపోదని, ఆ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. అత్యాచార దోషులకు క్యాస్ట్రేషన్ చికిత్స చేయాలని డిమాండ్ చేశారు. నిర్భయ చట్టంపై విసృ్తత అవగాహన కల్పించి మహిళలపై వేధింపులను నివారించేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని కోరారు.