కోల్‌కతా అభయ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీబీఐకి ఎదురుదెబ్బ | CBI Wants Narco Analysis Test To Sanjay Roy In Kolkata Case | Sakshi
Sakshi News home page

కోల్‌కతా అభయ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీబీఐకి ఎదురుదెబ్బ

Published Fri, Sep 13 2024 4:23 PM | Last Updated on Fri, Sep 13 2024 7:36 PM

CBI Wants Narco Analysis Test To Sanjay Roy In Kolkata Case

కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీకార్‌ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అభయ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడి విషయంలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కి నార్కో అనాలసిస్‌ పరీక్ష చేయడానికి సీబీఐ సిద్ధమైంది ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా సీబీఐకి ధర్మాసనం షాకిచ్చింది. 

కోల్‌కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్‌ రాయ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది.  నిందితుడికి నార్కో పరీక్షకు అనుమతివ్వాలన్న సీబీఐ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో, సీబీఐ ప్లాన్‌ ఫెయిల్‌ అయ్యింది. 

 

 

అయితే, అభయ హత్యాచార ఘటన కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌కు సీబీఐ ఇప్పటికే పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను సీబీఐ బయటకు వెల్లడించలేదు. ఇక, పాలీగ్రాఫ్‌ పరీక్షలో నిందితుడులు చెప్పిన విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు. మరోవైపు.. పాలీగ్రాఫ్‌ టెస్టులో సంజయ్‌ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని సీబీఐ అధికారులకు చెప్పాడనే లీకులు బయటకు రావడం గమనార్హం. తాను వెళ్లేసరికే ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, తాను భయంతో పారిపోయానని అతడు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అభయ కేసుకు సంబంధించి అసలు నిజాలను రాబట్టేందుకే నిందితుడు సంజయ్‌ రాయ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ భావించింది. 

 నార్కో టెస్ట్‌ ఇలా.. 
ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు(సోడియం పెంటోథాల్‌, స్కోపలామైన్‌, సోడియం అమైథాల్‌) ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్‌ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్‌కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్‌కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్‌ ద్వారా ధృవీకరించుకుంటారు.  

ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్‌ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందం నుంచి తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్‌, పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి.

గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్ల కేసు, అబ్దుల్‌ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్‌ మర్డర్స్‌, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో కసబ్‌ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు.

పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ ఎలా ఉంటుందంటే.. 
పాలీగ్రాఫ్‌ టెస్ట్‌.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. దీన్ని లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్‌తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్‌ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి.. బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్‌ నిర్వహిస్తుంటారు.

శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్‌ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష. కానీ, ఇదే ఫైనల్‌ రిజల్ట్‌ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్‌ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష కచ్చితత్వంపై తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి.

ఇది కూడా చదవండి: ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement