అప్పుడు  అభయ.. ఇప్పుడు ! | Woman Molested Cases: People Fear About These Incidents | Sakshi
Sakshi News home page

అప్పుడు  అభయ.. ఇప్పుడు !

Published Fri, Nov 29 2019 8:35 AM | Last Updated on Fri, Nov 29 2019 8:39 AM

Woman Molested Cases: People Fear About These Incidents - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : వేళకాని వేళలో నడిరోడ్డుపై ఒంటరిగా మిగిలి దుండగుల బారినపడిన పశు వైద్యురాలు ప్రియాంకరెడ్డి ఘటన.. 2013 అక్టోబర్‌లో చోటుచేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అభయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అప్పట్లో ఆ అతివను అపహరించిన దుండగులు అత్యాచారం చేశారు. బెంగళూరుకు చెందిన అభయ (22) ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గౌలిదొడ్డిలోని ఓ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ హైటెక్‌ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేసేవారు. 2013 అక్టోబర్‌ 18న సాయంత్రం 5:30 గంటలకు విధులు ముగించుకొని షాపింగ్‌ నిమిత్తం సమీపంలోని ఇనార్బిట్‌మాల్‌కు వెళ్లారు. రాత్రి 7:30 గంటలకు బయటకు వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు సమీపంలోని బస్టాండ్‌లో నిల్చున్నారు. అర్ధగంట తర్వాత వచ్చిన ఓ బస్సు ఎక్కారు.   
 
చిన్న పొరపాటు... 
రాత్రి సమయంలో బస్సు ఎక్కేముందు అభయ అది వెళ్లే మార్గాన్ని బేరీజు వేయడంలో చేసిన చిన్న పొరపాటే నాటి ఘాతుకానికి నాందిగా మారింది. ఆ బస్సు ఆమె వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే రూట్‌లోకి మలుపు తిరగడంతో అప్రమత్తమై రహేజా మైండ్‌స్పేస్‌ చౌరస్తా వద్ద దిగిపోయారు. అక్కడి నుంచి గౌలిదొడ్డి వెళ్లేందుకు టీసీఎస్‌ బిల్డింగ్‌ వద్ద ఉన్న మరో బస్టాప్‌ వద్దకు వచ్చి వేచి ఉన్నారు. ఎంతకీ బస్సు రాకపోవడంతో షేరింగ్‌ కార్లు, ట్యాక్సీల్లో వెళ్లేందుకు తిరిగి నడుచుకుంటూ మైండ్‌స్పేస్‌ చౌరస్తాకు వచ్చారు. 8:40 గంటల ప్రాంతంలో ఓ తెల్లరంగు కారు వచ్చి ఆమె ముందు ఆగింది. డ్రైవర్‌ కిందికి దిగి ఎక్కడకు వెళ్లాలని అడగ్గా... గౌలిదొడ్డి వెళ్లాలని చెప్పింది. అతడు రూ.50 డిమాండ్‌ చేయడంతో బేరమాడి రూ.40 ఇచ్చేందుకు అంగీకరించి ఎక్కింది. అప్పటికే కారు వెనక సీట్లో మరో వ్యక్తి ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో షేరింగ్స్‌ సాధారణం కావడంతో అతడూ తన మాదిరి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయి ఉంటాడని భావించారు.  
  
చాటింగ్‌లో మునిగిపోగా ముప్పు... 
కారు ఎక్కిన అభయ చుట్టుపక్కల పరికించకుండా చాటింగ్‌లో మునిగిపోవడం దుండగులకు కలిసొచ్చి ఈమెకు ముప్పు ముంచుకొచ్చింది. ఆమె తన సెల్‌ఫోన్‌ నుంచి స్నేహితుడితో చాటింగ్‌ చేస్తుండగా, ఖాజాగూడ జంక్షన్‌కు చేరుకున్న కారు ఎడమ వైపు తిరిగింది. గౌలిదొడ్డి వెళ్లడానికి కుడివైపు తిరగాల్సి ఉండగా వ్యతిరేకంగా తిరగడాన్ని చాటింగ్‌లో ఉన్న ఆమె గమనించలేదు. చివరకు కారు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి ఎక్కుతుండగా గమనించిన ఆమె దారి తప్పామని చెప్పింది. దీంతో డ్రైవర్‌ చెక్‌పోస్టులో ఉన్న వాచ్‌మెన్‌ను ఈ దారి ఎక్కడికి వెళ్తుందంటూ అడిగి తనకు తెలియనట్లు నటించాడు. అప్పటికే పథకం సిద్ధం చేసుకున్న దుండగులు ఆమె కిందకు దిగే ఆస్కారం లేకుండా కారు డోర్లు, అద్దాలను సెంట్రల్‌ లాక్‌ చేశారు.  
 
ప్రాణాలు తీస్తామని బెదిరించి దారుణం.. 
ఆమెకు మాట్లాడే, అరిచే అవకాశమివ్వని దుండగులు కారును ముందుకు పోనిచ్చి అప్పా జంక్షన్‌ మీదుగా దాదాపు 22 కి.మీ దూరంలోని కొల్లూరు జంక్షన్‌ వరకు ఔటర్‌ రింగ్‌ రోడ్‌పైనే తీసుకెళ్లారు. అక్కడ కారును ఓఆర్‌ఆర్‌ పైనుంచి సర్వీస్‌ రోడ్డులోకి దించి, లింగంపల్లి వైపు పోనిచ్చారు. ఆ ప్రాంతంలోని బిర్లా ఓపెన్‌ మైండ్‌ స్కూల్‌ దాటాక ఉన్న దట్టమైన టేకు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి కారును ఆపారు. ‘మాకు సహకరించకుంటే నీ ప్రాణాలతో పాటు నీ తల్లిదండ్రుల ప్రాణాలు కూడా తీస్తాం’ అంటూ బెదిరించి ఇద్దరూ అత్యాచారం చేశారు. ఆపై ఆమెను హాస్టల్‌ వద్ద దింపి వెళ్లిపోయారు. దుండగులు తనను కారులో తీసుకెళ్తున్న సమయంలోనే అభయ కిడ్నాప్‌ చేశారని అనుమానించింది. 

దీంతో తన సెల్‌ఫోన్‌ ద్వారా బెంగళూరులోని తన స్నేహితుడికి విషయం తెలిపింది. అతడి సలహా మేరకు ఆర్తనాదాలు చేయగా... సెల్‌ఫోన్‌ లాక్కున్న దుండగులు స్విచ్ఛాఫ్‌ చేశారు. ఈ విషయం మరోసారి కాల్‌ చేసినప్పుడు గమనించిన స్నేహితుడు ఏదో జరిగిందని శంకించాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలని బాలానగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడు శ్రీనివాస్‌ను కోరాడు. అప్రమత్తమైన అతడు మాదాపూర్‌కు చేరుకొని గాలించినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో... అదే రోజు రాత్రి 10:50 గంటలకు మాదాపూర్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. అధికారులు కమిషనరేట్‌ పరిధిలోని అన్ని ఠాణాల సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చేపట్టారు.  

9 నెలల్లో తీర్పు...  
పోలీసులతో బాధితురాలు తాను ఎక్కింది తెల్లరంగు కారని, డ్రైవర్‌ పేరు సతీష్‌గా గుర్తించానని మాత్రమే వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సహకారంతో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ముందుకెళ్లారు. కారు డ్రైవర్‌గా వ్యవహరించిన వెడిచెర్ల సతీష్‌తో పాటు అతడి స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లును నాలుగు రోజుల్లోనే అరెస్టు చేశారు. వీరిపై నేరం నిరూపించడానికి అవసరమైన పక్కా ఆధారాలను సేకరించారు. నిర్ణీత కాలంలో నిందితులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో పాటు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్ట్‌ ఏర్పాటు చేయించారు. ఫలితంగా తొమ్మిది నెలల్లో విచారణ పూర్తై నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు నిందితులకు బెయిల్‌ లభించలేదు.

చదవండి : ఆరు దాటితే ఆగమే !  

భద్రతపై భయం
సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్‌ ప్రియాంకరెడ్డి ఘటనపై పౌర సమాజం భగ్గుమంటోంది. మహానగరం సేఫ్‌ సిటీగా మారుతున్న వేళ ఊహించని ఉత్పాతం అందరినీ కలవరపరిచింది. ఒంటరి మహిళను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ సంఘటన మహిళల్లో గగుర్పాటుకు కారణమైంది. చీకటి పడగానే రహదారులపై తాగుతూ, తూలుతూ ఉండేవారితో పాటు అదను కోసం వేచి చూసే మృగాళ్ల చేతిలో ఒంటరి మహిళలు బలైపోతున్న దారుణం మరోసారి వెలుగుచూసింది. ఇలాంటి పరిస్థితులపై వివిధ రంగాల ప్రముఖుల స్పందన ఇదీ...  
 
ఉరి తీయాలి..  
మన దేశంలో మహిళ అంటే గౌరవం బదులు.. ఆమెను ఒక విలాస వస్తువుగా చలామణి చేసేస్తున్నారు. ఇందులో ఏ ఒక్క రంగానికి మినహాయింపు లేదు. తొలుత మహిళను గౌరవించే సాంస్కృతిక విప్లవం ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇక శంషాబాద్‌ ఘటన అత్యంత దారుణం. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలి. పోలీసులు, కోర్టులు క్రియాశీలకంగా వ్యవహరించి నిందితులకు ఉరిశిక్ష వేయాలి.   
– జస్టిస్‌ చంద్రకుమార్‌
  
ఏదీ భద్రత?  
ప్రియాంకను అలా చంపడం పాశవికం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు, పోలీసుల హడావుడి సర్వసాధారణమైంది. మహిళా భద్రతకు సంబంధించి కఠినమైన చట్టాలు రావాలంటే.. చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా అనేక సంఘటనల్లో మహిళలపై జరుగుతున్న హింసను పోలీసులు నిరూపించలేకపోవడం దారుణం.  
– డాక్టర్‌ శ్వేతాశెట్టి, అధ్యక్షురాలు, నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ

సేఫ్‌ సిటీయేనా?   
నేను ఇప్పటి వరకు 60 దేశాలు తిరిగాను. మెజారిటీ దేశాల్లో ఇండియా అంటే సేఫ్‌ కాదన్న భావన ఉంది. కానీ నేను మాత్రం ఇండియా అందులోనూ హైదరాబాద్‌ సేఫ్‌ సిటీగా మారిందని చెబుతూ వచ్చాను. కానీ ఈ దారుణం చూసిన తర్వాత.. నాకే డౌట్‌ వస్తోంది. ఏదో తెలియని భయం వెంటాడుతోంది.   
– నీలిమారెడ్డి, ప్రాజెక్ట్‌ మేనేజర్‌

అప్‌డేట్‌ అవ్వాలి   
ముంచుకొచ్చే ముప్పుపై మహిళలు అలర్ట్‌గా ఉండాలి. సేఫ్‌ జర్నీ కోసం అనేక యాప్స్‌ వచ్చాయి. అనేక మార్షల్‌ ఆర్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. మహిళలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ తమను తాము కాపాడుకోవడంతో పాటు తమ కుటుంబాన్ని కాపాడేందుకు సిద్ధం కావాలి. డాక్టర్‌  ప్రియాంకను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.  
– అనూప్రసాద్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement