గ్యాంగ్‌రేప్ నిందితులకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: సంచలనం కలిగించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అభయపై గ్యాంగ్‌రే ప్ కేసులో నిందితులను మాదాపూర్ పోలీసులు బుధవారం మియాపూర్‌లోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సత్యనారాయణ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిందితులైన కారు డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లును విచారించేందుకు రెండురోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నెల 27,28 తేదీల్లో వారిని పోలీసు కస్టడీకి అనుమతించింది. అనంతరం పోలీసులు వారిని మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలోని కంది జిల్లా జైలుకు తరలించారు.
కోర్టు ఆదేశాల మేరకు నిందితులను.. ముసుగులు వేసి కాళ్లు, చేతులకు సంకెళ్లతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జిల్లా జైలుకు తీసుకువచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా జైలు సూపరింటెండెంట్ పి.నాగేశ్వర్‌రెడ్డి నిందితులను ప్రత్యేక సెల్‌కు తరలించారు. తోటి ఖైదీలు దాడి చేసే అవకాశముందనే అనుమానంతో ప్రత్యేక సెల్‌లో ఉంచి భద్రత ఏర్పాటు చేశామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.
నేడు లైంగిక సామర్థ్య పరీక్షలు: కోర్టు ఆదేశాల మేరకు గురువారం నిందితులకు లైంగిక సామర్థ్య పరీ క్షలు నిర్వహించనున్నారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాల నూ సేకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అభయ షాపింగ్ చేసిన ఇనార్బిట్ షాపింగ్ మాల్ మొదలు.. మైండ్‌స్పేస్ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్‌లోని టోల్‌గేట్, కొల్లూరు టోల్‌గేట్ వద్ద గల ప్రత్యక్ష సాక్షుల వివరాలను సేకరిస్తున్నారు. కారును డ్రైవర్ ఎలా ఉపయోగిస్తున్నాడో తెలుసుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించిన సీపీ అగర్వాల్ (ట్రావెల్స్ నుంచి అద్దెకు తీసుకున్న వ్యక్తి)పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
నిందితుల తరఫున వాదించం: న్యాయవాదులు
ఈ కేసులో నిందితుల బెయిల్‌కు సహకరించరాదని రంగారెడ్డి జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ తీర్మానించింది. అభయపై లైంగిక దాడికి నిరసనగా కొత్తపేటలోని కోర్టు భవనం ముందు బార్ అసోసియేషన్ నాయకులు, పలువురు మహిళా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజి రెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి దేవరాజ్, మహిళా సంయుక్త కార్యదర్శి సునీత, జాట్ అధ్యక్షుడు నరేష్‌కుమార్ పాల్గొన్నారు. నిందితుల తరఫున ఎవరూ వాదించరాదని మియాపూర్ బార్ అసోసియేషన్ తీర్మానించినట్లు నాయకులు జి.శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలు తెలిపారు.