
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నెరవేర్చాలనే డిమాండ్‌తో దేశ రాజధానిలో సోమవారం ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దీక్ష కోసం హాజరయ్యే వారి కోసం ఖరీదైన ఏసీ హోటళ్లలో 3,500 మందికి వసతి సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నిర్వహించే దీక్షకు రూ. 10 కోట్ల దాకా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు విలాసవంతమైన హోటళ్లలో వసతి కల్పిస్తోంది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన హోటల్ రాయల్ ప్లాజాలో 30 గదులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుక్ చేశారు. మంత్రులు, వీఐపీలు రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటున్నందున వారి కోసం వీటిని కేటాయించారు. హోటల్ సూర్యలో 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల చైర్మన్లకు వసతి కల్పిస్తున్నారు. రూ. 1.12 కోట్ల వ్యయంతో అనంతపురం, శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా వచ్చే వారికి పహార్‌గంజ్ ప్రాంతంలో ‘ఆన్ యువర్ ఓన్’ (ఓవైఓ) కింద వివిధ హోటళ్లలో 850 గదులను బుక్ చేశారు. కేరళ, మహారాష్ట్ర భవన్‌లు, టీటీడీ అతిథి గృహం, న్యూఢిల్లీ వైఎంసీఏ టూరిస్ట్ హోటళ్లలో కూడా వందల సంఖ్యలో గదులు బుక్ చేశారు. వీరందరినీ సీఎం చంద్రబాబు దీక్ష చేసే ఏపీ భవన్ వద్దకు తరలించేందుకు ప్రత్యేకంగా 32 బస్సులను ఏర్పాటు చేశారు.
155 మందికి విమాన టిక్కెట్లు..
ధర్నాలో పాల్గొనాలంటూ ప్రభుత్వ ఉద్యో గులపై ఒత్తిడి చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం వారిని ఢిల్లీకి తరలించి తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు విమాన టిక్కెట్ల కోసం భారీగా వెచ్చిస్తోంది. ఏపీ ఎన్జీవోల సంఘం నుంచి 29 మందికి, ఏపీ జేఏసీ అమరావతి నుంచి 20 మందికి, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఐదుగురికి, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ నుంచి 18 మందికి విమాన టిక్కెట్లు సిద్ధం చేసింది. లోక్‌సత్తా, ఆప్ తదితర రాజకీయ పార్టీల నేతలతోపాటు ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి సంఘాల నేతలతో కలిపి మొత్తం 155 మందికి విమాన టిక్కెట్లు సమకూర్చింది.
ప్రచారం కోసం మరుగుదొడ్లనూ వదల్లేదు..
ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేసే ఒక రోజు దీక్షకు ప్రచారం కల్పించేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయ్‌లెట్లను కూడా వదలకుండా భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫునే భారీ ఎత్తున బ్యానర్లు నెలకొల్పారు. వేదిక ఏర్పాటు, హోర్డింగులు ఇతరత్రా ఖర్చులకు రూ. 80 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు ఏపీ భవన్ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి, ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పించి అనంతరం దీక్ష ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.