ఏసీబీ వలలో ‘టీబీ’ చేప
Published Tue, Dec 10 2013 3:35 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నాడు ఓ లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈనెల 4న ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ లలిత్‌కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడగా, వారం రోజులు తిరక్కుండానే జిల్లా క్షయ నియంత్రణ శాఖ అధికారి ఆర్.సుధీర్‌బాబు ఏసీబీ వలలో చిక్కారు. అదే శాఖలో పనిచేస్తున్న సూపర్‌వైజర్‌ను బదిలీ చేసినందుకు నజరానాగా రూ.40 వేలు అడిగిన సదరు అధికారి.. జీపీఎఫ్ నుంచి రుణం తీసుకుని మరీ ఆ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే... పెరవలి మండలం కానూరు పీహెచ్‌సీ సబ్ సెంటర్‌లో మూడేళ్లుగా వక్కలంక వెంకట సూర్య త్రినాథకృష్ణారావు సీనియర్ టీబీ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.
తణుకు, జంగారెడ్డిగూడెంలో టీబీ ట్రీట్‌మెంట్ యూనిట్లను కొత్తగా ఏర్పాటు చేశారు. కానూరులో పనిచేస్తున్న కృష్ణారావును తణుకులోని ట్రీట్‌మెంట్ యూనిట్‌కు నవంబర్ 6న బదిలీ చేశారు. ఆయన నవంబర్ 7న విధుల్లో చేరారు. 9వ తేదీన తణుకు యూనిట్‌కు వెళ్లిన జిల్లా క్షయ నియంత్రణ అధికారి ఆర్.సుధీర్‌బాబు అతన్ని బదిలీ చేసినందుకు నజరానాగా రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టు కోసం చాలామంది వేచి చూస్తున్నారని, దీనికి మంచి డిమాండ్ ఉందని చెప్పాడు. ‘డబ్బులిస్తేనే ఇక్కడ పనిచేస్తావ్.. లేదంటే కానూరు పంపించేస్తా’నంటూ సుధీర్‌బాబు బెదిరించారు. తన వద్ద అంత సొమ్ము లేదని, కొంత తగ్గిస్తే ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని కృష్ణారావు చెప్పారు.
చివరకు రూ.35 వేలకు బేరం కుదిరింది. తొలుత రూ.20 వేలు ఇవ్వాలని, అనంతరం జీపీఎఫ్ రుణం నుంచి కొంత డబ్బు ఇవ్వాలని కోరారు. దీంతో కృష్ణారావు సోమవారం ఉదయం ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు రంగంలోకి దిగారు. కృష్ణారావుకు సొమ్ములు ఇచ్చి జిల్లా క్షయ నివారణ కార్యాల యానికి పంపించారు. సుధీర్‌బాబు అక్కడ లేకపోవడంతో స్థానిక ఇజ్రారుుల్‌పేటలోని ఆయన నివాసానికి పంపించారు. ఇంటివద్ద ఉన్న సుధీర్‌బాబు రూ.20వేలు తీసుకుం టుండగా, అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు సొమ్ముతో సహా సుధీర్‌బాబును పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో సీఐ యు.విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement