
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో రెండు గంటల్లో విజయవాడకు తీసుకురానున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ సెంట్రల్ ఆఫీసుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అక్కడ రికార్డు వర్క్ పూర్తైన తర్వాత ఇంకా సమయం మిగిలి ఉంటే ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుచనున్నారు.
ఒకవేళ కోర్టు సమయం ముగిసినట్లయితే ఏసీబీ న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకువెళ్లనున్నారు. ఇక అచ్చెన్నాయుడుతో పాటు ఈఎస్ఐ స్కాంలో పాత్రధారులుగా ఉన్న మరో ఐదుగురిని ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రదేశాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు)
ఇదిలా ఉండగా... అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ఏసీబీ ప్రకటన చేయడంతో పాటు మీడియా సమావేశం కూడా నిర్వహించినప్పటికీ.. ఆయనను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాకు తెర తీశారు. అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటే.. అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు లేఖ విడుదల చేశారు. ఎక్కడకు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆయన ఈ విధంగా లేఖ విడుదల చేశారంటూ పలువురు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment