మంగళవారం గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: అనధికార నిర్మాణాలకు అండదండలు.. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ.. అడుగడుగునా ఆమ్యామ్యాలు.. అడిగినంత ఇవ్వకపోతే వేధింపులు.. ఇవీ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లోని పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో కొనసాగుతున్న బాగోతాలు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది తీరుపై విసిగి వేసారిపోతున్న జనం ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. అవినీతి నిర్మూలన కోసం ప్రారంభించిన డయల్ 14400 టోల్ ఫ్రీ నెంబర్‌కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, ఉభయ తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో మంగళవారం సోదాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు అక్రమాలు, అవినీతి వ్యవహారాలు వెలుగు చూశాయి. పలు కీలక ఫైళ్లు, రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. రెండేళ్లుగా టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చిన దరఖాస్తులు, మంజూరు చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. భవనాల క్రమబద్ధీకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
ప్రైవేట్ వ్యక్తుల పాగా
సిటీ ప్లానింగ్ విభాగంలో సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా అనధికార నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో రూ.1,03,813, ఒంగోలులో రూ.8,940, తిరుపతిలో రూ.50,500, ప్రొద్దుటూరులో రూ.15,110, తాడేపల్లిగూడెంలో రూ.5,640, శ్రీకాకుళంలో రూ.14,690, నెల్లూరులో రూ.7,740, విజయవాడలో రూ.34,650, విశాఖపట్నంలో రూ.29,900... మొత్తం రూ.2,70,983 నగదు లభ్యమైంది. పలు టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పలువురు ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. అనుమతి లేకుండా పని చేస్తున్నారు. ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బుధవారం కూడా సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన అనంతరం అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు చెప్పారు.
సోదాల్లో ఏసీబీ గుర్తించిన అంశాలు..
చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా భారీ భవంతుల నిర్మాణానికి అనుమతులివ్వడం, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికి రోజుల తరబడి అనుమతులు మంజూరు చేయకపోవడం, లంచాలు డిమాండ్ చేయడం, దరఖాస్తుదారులను వేధించడం వంటి అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు.
- మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని మధురవాడ(జోన్–1), గాజువాక(జోన్–5) కార్యాలయాల్లో పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. వారివద్ద ఉన్న నగదును సైతం పరిశీలించి వివరాలు నమోదు చేశారు. అక్కడ అనధికారికంగా పని చేస్తున్న వ్యక్తుల గురించి ఆరా తీశారు.
- విజయనగరం టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
- నెల్లూరు నగరంలో గడిచిన ఏడు, ఎనిమిది నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సంబంధిత భవనాలకు ఏ ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేశారని టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిని ప్రశ్నించారు.
- తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పలు రికార్డులను పరిశీలించారు. అనధికార కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు తేలింది.
- ప్రకాశం జిల్లా ఒంగోలులో సోదాలు నిర్వహించే సమయంలో సల్మాన్ బాషా అనే ప్రైవేట్ వ్యక్తి ఆ విభాగంలోని కంప్యూటర్ వద్ద కూర్చోవడం, అతని వద్ద కవర్‌లో రూ.8,940 ఉండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
- చిత్తూరు జిల్లా తిరుపతిలో బీపీఎస్, ఆన్‌లైన్ భవన నిర్మాణ అనుమతుల రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. రికార్డులు సక్రమంగా నమోదు చేయలేదని, అందులో తప్పుడు వివరాలు ఉన్నట్లు గుర్తించారు.
- శ్రీకాకుళంలో కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
- గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో బిల్ కలెక్టర్ ఎస్.నాగేశ్వరరావు నుంచి రూ.69,620, టౌన్ ప్లానింగ్ ఔట్‌సోర్సింగ్ అటెండర్ అల్లంశెట్టి సుధాకర్ నుంచి రూ.29,093, డిప్యూటీ సిటీ ప్లానర్ బి.సత్యనారాయణ నుంచి రూ.5,100.. మొత్తం రూ.1,03,813 అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. బిల్డింగ్ ప్లాన్లు, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఇతర విషయాల్లో జరిగిన నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో భవనాల నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలను ఏసీబీ పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment