మహేశ్వరం, న్యూస్‌లైన్: తెలతెల్లవారుతోంది.. తీవ్రంగా మంచు కురుస్తోంది. మహారాష్ట్ర నుంచి తిరుపతి వెళ్తున్న ఓ వాహనం ఔటర్‌పైకి దూసుకొచ్చింది. అందులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా బంధువులు. గురువారమే బాంద్రా జిల్లా తిరోడా తాలుకా భూత్‌నాథ్ నుంచి బయల్దేరిన వీరు శుక్రవారం తెల్లవారు జామున ఔటర్‌పైకి చేరుకున్నారు. ముంబై జాతీయ రహదారిలో వచ్చిన వీరి వాహనం పటాన్‌చెరు వద్ద ఔటర్ రింగు రోడ్డు ఎక్కింది. శంషాబాద్‌లో ఔటర్ దిగి బెంగళూరు హైవే మీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా అలాగే ముందుకు దాదాపు 15కిలోమీటర్లు వచ్చేశారు. తుక్కుగూడ దగ్గర ఔటర్ దిగే వీలున్నా వీరు చూసుకోలేదు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న వీరి వాహనం తుక్కుగూడ - రావిర్యాల మధ్యలో ఆగిఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న విద్యా యోగేందర్ కట్రే(30), భరత్ బగులై(58), పైరన్‌బాయి పట్లే(60), వచ్చాల్లా బాయి సురుగురే(55), దీనూ బాయి(60) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో యోగేందర్, ప్రభాబాయి, సుఖ్‌దేవ్‌తోపాటు డ్రైవర్ మనోజ్ ఉన్నారు. వీరిలో యోగేందర్, విద్యా యోగేందర్ కట్రేలు దంపతులు. యోగేందర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీఎంసీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ ప్రమాదంలో వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను సాగర్ రింగు రోడ్డులోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసి శంషాబాద్ ఏసీపీ భద్రేశ్వర్, పహాడీషరీఫ్ పోలీసులు, తుక్కుగూడ, రావిర్యాల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పొగమంచే ప్రాణాలు తీసిందా?
శుక్రవారం తెల్లవారుజామున తీవ్రంగా పొగమంచు ఉంది. రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నా రు. టయోటా ఏరియా వాహనం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుపై సరైన సూచిక బోర్టులు లేవు. దీంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ఎక్కాల్సిన, దిగాల్సిన చోట బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు.
ఔటర్‌పై మృత్యుఘోష!
Published Fri, Dec 27 2013 11:02 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement