నేటికీ బ్రిటీష్ కాలం నాటి సంఖ్యే...
ఒంగోలు కలెక్టరేట్ : ‘ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్య బ్రిటీష్ కాలం నాటిదే. ఒకవైపు జనాభా పెరుగుతున్నా అందుకు అనుగుణంగా కార్యాలయాలు పెంచడం లేదు. సిబ్బందిని పెంచడంలేదు. పైగా, ప్రస్తుతం ఉన్న వారిని దిగకోస్తూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వమైనా ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలి’ అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
1983 తరువాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 25 నుంచి 50 వేలలోపు జనాభా ఉంటే మండలాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం లక్షలాది జనాభా పెరిగినా అదే సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. 432 మంది సూపరింటెండెంట్లకు సంబంధించి 167 కోట్ల రూపాయల బడ్జెట్‌తో గత ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. నూతనంగా 20 డివిజన్లు ఏర్పాటు చేయాలని సీసీఎల్‌ఏ ప్రభుత్వానికి నివేదిస్తే కేవలం 10 డివిజన్లతో సరిపెట్టిందన్నారు. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో 78 భూసేకరణ యూనిట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధీనంలో ఉన్నాయని, అందులో 35 మంది సిబ్బంది ఉన్నారని, వాటిలో 28 యూనిట్ల ను రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు.
ఆక్రమణలు తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు అన్యాయం...
ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అన్యాయమని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించే సమయంలో ఒకవర్గం వారు రెచ్చగొట్టి మరో వర్గంచేత సంబంధిత తహసీల్దార్, ఆర్‌ఐపై కేసులు పెట్టిస్తున్నారని, చివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయిస్తున్నారని తెలిపారు. అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి దళారులు కేసులు పెట్టిస్తున్నారని, ఇలాంటి కేసులపై జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించాలని ఆయన కోరారు.
తూతూమంత్రంగా హెల్త్‌కార్డులు...
ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని నాలుగేళ్ల నుంచి కోరుతుంటే గత ప్రభుత్వం చివరి దశలో తూతూమంత్రంగా ఇచ్చిందని బొప్పరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 రకాల వ్యాధులకు ఓపీ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. రెగ్యులర్‌గా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు లక్షల రూపాయల రీయింబర్స్‌మెంట్ ఉన్నందున నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం హెల్త్‌కార్డుల విషయంలో మరింత ప్రయోజనకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులనుకొనసాగించాలి...
ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని బొప్పరాజు కోరారు. జూన్ నెలాఖరుకు కాంట్రాక్టు ముగిసి రోడ్డున పడతామన్న ఆందోళన ఎక్కువ మంది ఉద్యోగుల్లో ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకుండా పనిజరిగే పరిస్థితులు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విన్నవించడం జరిగిందన్నారు.
ఆయనతో పాటు ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. జిల్లాస్థాయిల్లో పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. విలేకరుల సమావేశంలో ఏపీఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్‌బాబు, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎల్ నరసింహారావు, ఆర్.వాసుదేవరావు, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు పాల్గొన్నారు.