అమ్మగా ఉండటమే ఇష్టం! | Actress Annapoorna Exclusive Interview | Sakshi
Sakshi News home page

అమ్మగా ఉండటమే ఇష్టం!

Published Sun, Oct 7 2018 7:18 AM | Last Updated on Sun, Oct 7 2018 7:18 AM

Actress Annapoorna Exclusive Interview - Sakshi

అరసవల్లి: ‘అందరికీ అమ్మ పాత్రలు రావు. అలా వచ్చిన అవకాశాలను ఇష్టంగా స్వీకరించి పాత్రలో లీనమైతేనే.. ఆ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది..’ అని ప్రముఖ సీనియర్‌ నటి, అలనాటి తార అన్నపూర్ణ అన్నారు. శనివారం ఆమె అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ  గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆదిత్యుని ఆశీర్వచనాన్ని ప్రసాదాలను అందజేశారు.  అనంతరం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  

సాక్షి: ఇంటస్ట్రీలో తొలి అడుగులు..
అన్నపూర్ణ: మాది విజయవాడ. మురళీమోహన్‌ వంటి నటులతో అప్పట్లో పలు నాటకాల్లో నటించాను. సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నా అసలు పేరు ఉమ..అయితే అన్నపూర్ణగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నన్ను స్వర్గం–నరకం సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు.  

సాక్షి: తెలుగు సినీ రంగానికి ‘అమ్మ’ గుర్తింపుపై మీ స్పందన ?
అన్నపూర్ణ: నిజంగా ఒక పాత్రలో అంతటి గుర్తింపు రావడం అదృష్టమే. అదేదో ఓవర్‌ నైట్‌లో సాధించేది కాదు. ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించడంతో వచ్చిన అనుభవమే. నటి నిర్మలమ్మ తర్వాత నన్ను అంతటి స్థానంలో ప్రేక్షకులు గుర్తించారంటే అదే పెద్ద అవార్డులా భావిస్తాను.

సాక్షి: ముందు హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశారా?
అన్నపూర్ణ: నిజమే..తొలిసారిగా 1975లో స్వర్గం–నరకం సినిమాలో మోహన్‌బాబుతో హీరోయిన్‌గా చేశాను. ఆ తర్వాత భార్య పాత్రలు తర్వాత ఏకంగా అమ్మ పాత్రలు చేయాల్సి వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి చిత్రాల్లో ఎక్కువగా అవకాశాలొచ్చాయి. ఏ పాత్ర వచ్చినా ఇష ్టం గా నటించి  400 దాటి సినిమాల్లో కన్పి ంచాను. అందులో అమ్మ పాత్రలు మంచి గుర్తింపు తెచ్చాయి. అమ్మతనం అందరికీ రాదు గదా..!

సాక్షి: మీ ఇంట్లో ఇటీవల జరిగిన ఘటన గురించి.?
అన్నపూర్ణ: నిజంగా దురదృష్టకరం. జూలైలో మా అమ్మాయి కీర్తి అనారోగ్య కారణంతో ఆత్మహత్య చేసుకుంది. ఇది నాకు తీరని లోటు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. ‘అమ్మ’ అనే పిలుపు నా ఇంట్లో నుంచి దూరమయ్యింది.

 సాక్షి: ప్రస్తుతం సిని ఇండస్ట్రీ ఎలా ఉంది..?
అన్నపూర్ణ: సిని ఇండస్ట్రీ అంటే ఎప్పటికీ మాయాలోకమే. ఇక్కడ అన్ని పాత్రల్లోనూ ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. ఆర్టిస్ట్‌గా మనకు కోపమొచ్చినా మనమే పోతాం. అవకాశాలిచ్చిన పెద్దలకు కోపమొచ్చినా మనమే పోవాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అంతేగానీ ముందుగా తెలుసుకునేందుకు తొందరపడితే మనకే నష్టం.

సాక్షి: శ్రీకాకుళం సందర్శనకు ఏమైనా ప్రత్యేకత ఉందా..?
అన్నపూర్ణ: శ్రీకాకుళంతో నాకు అనుబంధముంది. ఇక్కడ చిన్నపాటి ఆస్తులు కూడా ఉన్నాయి. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వచ్చాను. ఇంకా చెప్పాలంటే నాకిష్టమైన విలక్షణ నటుడు రావు గోపాలరావు అరసవల్లి వస్తుండేవారు. ఆయన నన్ను ‘ అన్నమ్మా..’ అని పిలిచేవారు. ఇప్పుడు ఆయన తనయుడు రావు రమేష్‌ తన నటనతో తండ్రిని గుర్తుచేస్తున్నాడు.

 సాక్షి: మీలో ఏదో అంచనా శక్తి ఉందనే ప్రచారం ఉండేది..?
అన్నపూర్ణ: నిజమే..నేను సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరినైనా బాగా పరిశీలించి, వారు ఎంతకాలం ఇండస్ట్రీని ఏలుతారో ఇట్టే అంచనా వేయగలను. అప్పట్లో రాజబాబు, రంగనాథ్, మోహన్‌బాబు, మురళీ మోహన్‌ తదితరుల నటన, మేకప్‌ గెటప్‌లను చూసి ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారని చెప్పాను. అది నిజమైంది కూడా..

 సాక్షి: ఈ తరానికి మీరిచ్చే సందేశం..?
అన్నపూర్ణ: సందేశాలిచ్చినా వినే వాళ్లున్నారా...(నవ్వుతూ..) ఏదేమైనా సినిమాలో నటించడం ఓ ప్రైవేటు జాబ్‌ లాంటిది. దీనికి పెన్షన్‌ ఉండదు. కానీ బాగా నటించి పనిచేస్తే చరిత్రలో నిలిచిపోయేంత స్థానం దొరుకుతుంది. నేటి తరం గ్లామర్‌కే పెద్ద పీట వేస్తున్నారు. కొందరు మాత్రమే అద్భుతంగా రాణిస్తున్నారు. ఎవ్వరైనా ఈరంగంలో క్రమశిక్షణగా ఉంటేనా విజయం సాధిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement