
సాక్షి, రాజమండ్రి : ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్వస్థలం ఏంటో తెలుసా తూర్పు గోదావరి జిల్లా. అంతేకాదండోయ్ ఆమె పేరు కూడా మార్చుకున్నారు... దీపికా పదుకొనెగా. కాజల్..ఊరు, పేరు మారటం ఏంటా అని అనుకుంటున్నారా?. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... రాజమండ్రి రూరల్ నియోజవర్గ ఓటర్ల జాబితాలో దీపికా పదుకొనె పేరుతో కాజల్ అగర్వాల్ ఫోటో ప్రత్యక్షమైంది. మరో విచిత్రం ఏంటంటే ఆమె తండ్రి పేరు రమేష్ కొండా, వయసు 22 అని ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఇది మన ఎన్నికల అధికారుల చిత్తశుద్ది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గతంలో ఉత్తర ప్రదేశ్‌లోని భల్లిలా నియోజకవర్గంలో 51 ఏళ్ల ‘దుర్గావతి సింగ్’ పేరుతో సన్నిలియోన్ ఫోటోతో వున్న ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎలక్షన్ కమిషన్ పరువు పోగోట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ జాబితాలో చాలామందికి వాళ్ల ఫోటోలకు బదులు ఏనుగు, పావురం, జింక బొమ్మలు వుండటం గమనార్హం.