* సీఎం చంద్రబాబు ఆదేశాలు
* అధికారుల టీఏ, డీఏలకే రూ.50 కోట్లు
* హైదరాబాద్‌లోని అధికారుల భోజనాలు, టిఫిన్లకు రూ.25 లక్షలు
* పోలీసులకోసం అదనంగా రూ.2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు తుపాను తాకిడికి ఉత్తరాంధ్ర ప్రజానీకం విలవిల్లాడుతుంటే మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్లిన ఐఏఎస్ అధికారులతోపాటు తుపాను విధుల్లో పాల్గొంటున్న అధికారులందరికీ అదనంగా 50 శాతం డీఏ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.
తుపాను కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఇంతవరకు అరకొరగా కూడా ప్రభుత్వం సాయం అందకపోయినప్పటికీ.. సహాయక చర్యలను పర్వవేక్షిస్తున్న అధికారులకు మాత్రం ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం చూస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తుపాను సహాయక చర్యలకోసం రాష్ట్రప్రభుత్వం ఏకంగా 40 మంది ఐఏఎస్‌లను ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు పంపింది. అదే సమయంలో హైదరాబాద్‌లోనే ఉండి సహాయక చర్యలను మరో 25 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్‌లోని అధికారులకు ఉదయం, సాయంత్రం టిఫిన్లతోపాటు మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలకోసం అడ్వాన్స్‌గా రూ.పాతిక లక్షలు విడుదల చేశారు. ఐఏఎస్‌లుగానీ, ఇతర అధికారులుగానీ వేరే జిల్లాలకు వెళితే సాధారణంగా వారికి డీఏ మంజూరు చేస్తారు. ఇప్పుడు సాధారణంగా ఇచ్చే డీఏకు అదనంగా మరో 50 శాతం ఇవ్వాలంటూ సీఎం ఆదేశాలిచ్చారు. తుపాను బాధితులకు ఆర్థికసాయం అందించడం మాట ఎలాగున్నా ఇప్పుడు అధికారుల టీఏ, డీఏలకే రూ.50 కోట్ల మేరకు వ్యయమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారులకు వసతి, భోజన సదుపాయం, ఇతర సౌకర్యాలు కల్పించే అదనపు బాధ్యతలు స్థానిక అధికారులపై పడుతున్నాయని, సహాయక చర్యల అమలుపైకన్నా ఎక్కువ దృష్టి వీరికి సౌకర్యాలు కల్పించడంపైనే ఉంటోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా తుపాను ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అదనంగా రూ.2 కోట్లు విడుదల చేయాల్సిందిగా డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
తుపాను విధుల్లోని అధికారులకు అదనంగా 50% డీఏ
Published Sat, Oct 18 2014 2:54 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement