నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : సమ్మె విరామం ప్రకటన తరువాత జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం మళ్లీ సందడి నెలకొంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సకల జనుల సమ్మెలో భాగంగా వివిధ శాఖల ఉద్యోగులు 66 రోజుల పాటు తమ విధులకు దూరమయిన విషయం తెలిసిందే. కనీసం కార్యాలయం వైపు కూడా వెళ్లకుండా సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గురువారం ఏన్‌జీఓలు సమ్మె విరమించడంతో శుక్రవారం అన్ని కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
కార్యాలయాలకు వెళ్లిన ఉద్యోగులకు తమ సీటు వద్ద దుమ్ము, ధూళి, బూజు దర్శనమిచ్చాయి. పలువురు ఉద్యోగులు ముందుగా తమ సీటు, టేబుల్‌ను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కార్యాలయాల అటెండర్, స్వీపర్లు సైతం సమ్మెలో కొనసాగడంతో ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం వినియోగించకపోవడంతో పలు కంప్యూటర్‌లో దుమ్మ, ధూళితో నిండి పోయాయి. కొన్ని కంప్యూటర్లు పనిచేయలేదు. సాంకేతిక నిపుణులు స్వల్ప పాటి మరమ్మతులు చేసిన వాటి బాగు చేశారు.
విద్యాశాఖాధికారి కార్యాలయం లో మినిస్టీరియల్ స్టాఫ్ వంద శాతం విధులకు హాజరయ్యారు. రవాణా శాఖ కార్యాలయంలో సుధీర్ఘ విరామం తర్వాత కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సిబ్బంది అధికారులు అందరూ విధులకు హాజరయ్యారు. అయితే సమ్మె ముగిసిన తర్వాత తొలిరోజు దరఖాస్తుదారుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. సాధారణ రోజుల్లో వందల సంఖ్యలో వచ్చే దరఖాస్తులు శుక్రవారం అన్ని పనులకు సంబంధించి కేవలం 70 లోపు రావడం సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. ఎల్‌ఎల్‌ఆర్, రిజిస్ట్రేషన్, లెసైన్స్, ఎఫ్‌సీ, వివిధ రకాల చలానాలు కలిపినా 70 కూడా రాలేదు.
కార్యాలయాలు కళకళ
Published Sat, Oct 19 2013 5:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement