చీరాల, న్యూస్‌లైన్ : చేతిలో ‘మంత్రి’దండం ఉంటే చాలు.. అనుకూలంగా నిర్ణయాలు మార్చుకోవచ్చు.. గడువులోపు పనులు చేయనందుకు అధికారులు విధించిన జరిమానాను రద్దు చేయించుకోవచ్చు. కొమ్మమూరు కాలువ ఆధునికీకరణలో అదే నిజమైంది. వివరాల్లోకి వెళితే... మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కృష్ణా, పశ్చిమ డెల్టాను ఆధునికీకరించి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని తలపోశారు. డెల్టాలో భాగమైన గుంటూరు జిల్లా నరసాయపాలెం వద్ద ఉన్న నల్లమడ కాలువ నుంచి పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువ ప్రవహిస్తుంది.
దీని ఆధునికీకరణకు రూ.196 కోట్లు కేటాయిం చారు. 2008లో టెండర్లు పూర్తయ్యాయి. పనులను కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన పీసీఎల్ (ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్) సంస్థ దక్కించుకుంది. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.19.6కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ డబ్బుతో ప్రకాశం, గుంటూరు జిల్లాలో చిన్నపాటి బ్రిడ్జిలు మినహా కాలువలో ఒక్క బుట్ట మట్టి కూడా తీయలేదు. మొత్తమ్మీద రూ.15 కోట్లు ఖర్చు చేశారు. అంటే అడ్వాన్స్ కింద తీసుకున్న వాటిల్లో ఇంకా రూ.4.6 కోట్లు సంస్థ వద్దే ఉండిపోయాయన్న మాట.
ఆధునికీకరణ ఇలా...
కొమ్మమూరు కాలువ 47 కిలోమీటర్ల మొత్తాన్ని ఆధునికీకరించాలి. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న మరో 50 చిన్న కాలువలకూ మరమ్మతులు చేపట్టాలి. ప్రధాన కాలువను 5 లక్షల క్యూబిక్ మీటర్ల లోతు చేయడంతో పాటు కాలువ పొడవునా నడిచి వెళ్లేందుకు వీలుగా 34 ర్యాంపులు, 35,500 క్యూబిక్ మీటర్లు సీసీ లైనింగ్, ఇసుక ప్రాంతంలో 4.92 లక్షల చదరపు మీటర్ల పొడవున రాతితో లైనింగ్ ఏర్పాటు, 11 రెండు లైన్ల బ్రిడ్జిలు, 26 ఒక లైన్ బ్రిడ్జిలు, 64 బాక్స్ కల్వర్టులు, 15 అండర్ టన్నెళ్లను హైడ్రాలిక్ పర్టిక్యులర్స్ సిస్టమ్ ప్రకారం ఆధునికీకరించాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితి ఇలా...
కొమ్మమూరు కాలువ కింద అధికార, అనధికారికంగా లక్ష ఎకరాలు సాగవుతుంది. ఓగ్ని, లైలా, జల్ వంటి తుఫాన్ల తాకిడికి కాలువ రూపురేఖలు మారిపోయాయి. కాలువ ఎక్కువభాగం పూడిపోయింది. నీరు వదిలినా అవి చివరి వరకు రావడం లేదు. కరకట్టలు బలహీనంగా ఉన్నచోట, గండ్లు పడిన చోట చుట్టు పక్కల పొలాలు మునిగిపోతున్నాయి. ఏటా పరిస్థితి ఇలానే ఉండడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వేటపాలెం, చినగంజాం మండలాలతో పాటు పలుచోట్ల రైతులు పంటలు కూడా వేయడం మానేశారు.
జరిమానా రూ.15 కోట్లు రద్దు చేయించుకున్న కాంట్రాక్టు సంస్థ: ఆధునికీకరణ 2012 ఆగస్టులోపు పూర్తి చేయాలి. గడువు ముగిసినా నామమాత్రపు పనులు కూడా చేపట్టలేదు. ఇరిగేషన్ అధికారులు రూ.15 కోట్లు జరిమానా విధించారు. ఆ తర్వాత కావూరి కేంద్రమంత్రి కావడంతో తన పలుకుబడి ఉపయోగించి జరిమానాను రద్దు చేయించుకున్నారు. అంతేగాక ఏడాది పాటు గడువు పెంచేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ గడువులోపూ పనులు పూర్తి చేయలేదు. 2015 వరకు సమయం కావాలని కోరడంతో ప్రభుత్వం మరోసారి అనుమతించడం గమనార్హం. మొదటిసారి గడువు పెంచిన సమయంలో రూ.196 కోట్ల పనుల్లో కేవలం రూ.15 కోట్లు మాత్రమే చేశారంటే ఆ సంస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈసారీ అనుమానమే?...
కొమ్మమూరు కాలువకు ఏటా మార్చి 31వ తేదీ నాటికి సాగు నీటిని పూర్తిగా నిలిపివేస్తారు. ఏప్రిల్ 15 నుంచి ఆధునికీకరణ పనులు మొదలు పెట్టి జూలై నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు మూడు నెలల పాటు పనులు జరగాలి. ఈ పనులను చేపట్టాలంటే ఇప్పటికే అందుకు సంబంధించిన సామగ్రి, ఇతర పరికరాలు వచ్చి ఉండాలి. అటువంటి ప్రక్రియ ఏమీ మొదలు కాలేదు. దీన్నిబట్టి చూస్తే ఆధునికీకరణ ఈ ఏడాదీ అనుమానమేనని, ఆయకట్టు రైతులకు ఈ ఏడాది క‘న్నీటి’ కష్టాలు తప్పేలా లేవ ని వాపోతున్నారు.
అడ్రస్ లేని ఆధునికీకరణ
Published Sun, May 25 2014 2:14 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement