అజిత్‌సింగ్‌నగర్‌లో నిర్మించిన గృహాలు
సాక్షి, అమరావతి బ్యూరో : పేదలకు గూడు కల్పించాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తలచారు. నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌లో జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా 2008లో ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన అకాల మరణంతో ఇళ్ల నిర్మాణం అర్థంతరంగా ఆగిపోయింది. వైఎస్సార్ సీపీ ఒత్తిడితో టీడీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగించింది. ఈనెల 15వ తేదీలోపు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేదల గూడికి పునాదివేసి ప్రారంభించిన మహానేత వైఎస్సార్ పేరు మాత్రం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలివ్వడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్త మవుతుంది.
పేదలకు గూడు కోసం
విజయవాడలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. రూ.156 కోట్ల వ్యయంతో జీఫ్లస్–4 భవన నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమైన తర్వాత ఆయన ఆకాల మృతితో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం వచ్చిన పాలకులు వీటిని పట్టించుకోకపోవటంతో పదేళ్లుగా అపార్టుమెంట్ భవనాలు మొండి గోడలుగా మిగిలిపోయాయి. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ నాలుగేళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని గురించి పట్టించుకోకపోయేసరికి వైఎస్సార్ సీపీ అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావటంతో మూడు నెలల కిందట ఇళ్ల నిర్మాణాలను పునఃప్రారంభించారు. 32ప్లాట్లు ఒక బ్లాక్‌గా, మొ త్తం 34బ్లాకులు నిర్మాణాలు జరుగుతున్నా యి. ఇప్పటికి 24 బ్లాకుల్లో పనులు దాదాపు పూర్తికావచ్చాయి. 24 బ్లాకులకు 768 లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు సిద్ధమవుతుండగా మిగిలిన బ్లాకులకు మరో మూడు నెలల్లో పూర్తిస్థాయి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
హౌసింగ్‌కాలనీలో ఉండే వసతులు
275 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగిల్‌బెడ్‌రూం, హాలు, కిచెన్, టాయిలెట్లు ఉంటాయి. కిచెన్, టాయిలెట్లలో ప్లాస్టరింగ్ స్థానంలో టైల్స్ వేస్తున్నారు. బ్లాక్–బ్లాక్ మధ్యలో ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్‌తో పూర్తిచేసి, కాలనీలో యూజీడీ, తాగునీరు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేస్తున్నారు. ఓపె న్ డ్రైయిన్ లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
లబ్ధిదారులు నిర్వాసితులేనా..?.
కాల్వకట్టలపై, రోడ్లు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులను లబ్ధిదారులుగా గుర్తించి వారికి అలాట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంది. పుష్కరాల సమయంలో కృష్ణలంక, రాణిగారితోట, భవానీపురం తదితర ప్రాంతాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండేవారు గూడును కోల్పోయారు. అధికారులు పద్మావతి ఘాట్‌లోనే సుమారు 4000 కుటుంబాలను గుర్తించగా, భవానీపురం తదితర ప్రాంతాల్లో మరో 4000 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. పద్మావతిఘాట్ నిర్వాసితుల్లో సుమారు 2500, భవానీపురంలోని పున్నమిఘాట్ నిర్వాసితుల్లో 1500 మందికి గతంలో జక్కంపూడిలోని జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ఇళ్లు కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో మిగిలిన నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాల్సి ఉండగా టీడీపీ అనుచరులకు, కార్యకర్తలకు మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లోని జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో 300 మంది కూడా అసలైన నిర్వాసితులు లేరని వారు పేర్కొంటున్నారు.
వైఎస్సార్ పేరులేకుండా..
పేదవాడికి గూడు కల్పించాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని అధికారపార్టీ నాయకుల అండదండలతో కొంతమంది ఆకతా యిలు ధ్వంసం చేశారు. ఈనెల 15వ తేదీన జరిగే ప్రారంభోత్సవంలో కూడా జెఎన్‌ఎన్‌యూఆర్‌యూఎం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయటాని కి కృషిచేసిన వైఎస్సార్ తలంపులేకుండా జాగ్రత్తలు పాటించాలని పాలకులు అధికారులకు హు కుం జారీ చేశారు. ఎక్కడా వైఎస్సార్ ప్రస్తావన లేకుండా జరగాలని, తామే ప్రాజెక్టును పూర్తిచేశామనే ప్రచారాన్ని తీసుకురావాలని ఆదేశించారు.
కేటాయింపులు జరగలేదు
అజిత్‌సింగ్‌నగర్‌లోని జెఎన్‌ఎన్‌యూఆర్‌యూఎం హౌసింగ్ కాలనీలో ఇంతవరకు లబ్ధిదారులకు కేటాయింపులు జరగలేదు. కాల్వకట్టలు, రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేటాయింపులు జరుపుతున్నాం. మొదటి విడతగా 760మందికి అలా ట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మిగిలిన పనులను త్వరలోనే పూర్తిచేస్తాం.జె.వి.రామకృష్ణ, ప్రాజెక్టు ఎస్‌ఈ,కార్పొరేషన్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment