Nallamada canal
-
బాపట్ల బీచ్‌లో హైదరాబాదీల గల్లంతు
బాపట్ల జిల్లా: బాపట్ల శివారు నల్లమడ వాగులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉద్ధృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతైనట్లు తెలిపారు.వారంతా కూకట్‌పల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన సన్నీ ,కిరణ్ , నందులుగా గుర్తించారు. రెండు మృతదేహాలు లభించగా, గల్లంతైన మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్‌కు వచ్చినట్లు యువకుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పాపం ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎలాగైనా రక్షించాలని పోలీసులను ప్రాధేయపడుతున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. -
నల్లమడ.. గుండె దడ
* అధికారుల లోపాలు.. అన్నదాతలకు శాపాలు * డిజైన్‌లో లోపాల వల్లే వరదల్లో నాలుగుచోట్ల గండ్లు * ఇప్పుడు శాశ్వత మరమ్మతులు చేపట్టాలంటే రూ.500 కోట్లు అవసరం పంట పసిపాపలా పచ్చగా నవ్వుతున్న వేళ వరద ముంచెత్తి కాలువ కట్టలను తెంచుకుంటూ రైతు నుదుట దుఖాఃన్ని పులుముతోంది. ప్రకృతి ప్రకోపించినా, పాలకులు ఆదమరిచినా భూమాతకు పచ్చబొట్టు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకునే రైతు కష్టం.. అధికారుల అలసత్వానికి నిలువునా తుడిచిపెట్టుకు పోతోంది. కన్న తండ్రిలా పంటకు ప్రాణంపోసే కాలువలు.. డిజైన్ల నిర్మాణ లోపంతో గండ్లు పడి రైతుల పాలిట శాపాలై కన్నీటి సుడిగుండాలు మిగిలిస్తున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో: నల్లమడ డ్రెయిన్ పొంగి పంట పొలాలను ముంచెత్తుతోంది. అధికారులు డిజైన్స్‌లో చేసిన లోపాలు అన్నదాతలకు శాపాలుగా మారాయి. కొండపాటూరు, గార్లపాడు, నాగులపాడులవద్ద వంతెనల నిర్మాణాలు 500 సీ డిజైన్‌తో రూపొందించడంతో అక్కడ నుంచి నీరు సరిగా వెళ్లక గండ్లు పడి పంట పొలాలను మునిగిపోతున్నాయి. కొన్ని చోట్ల మట్టి మేటలు వేసి, మరికొన్ని చోట్ల భూమి కోతకు గురవుతుంది. ఈ ఏడాది కాలువ పరిధిలో 25,000 ఎకరాలకుపైగా పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. తుఫానుకు 36 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. నల్లమడ డ్రెయిన్‌పై నిర్మిస్తున్న మూడు బ్రిడ్జిలు 500సీ మేర డిజైన్ చేశారు. అక్కడ వాగుకు 300సీకి మాత్రమే దాదాపు 20 వేల క్యూసెక్కుల నీరు వెళ్లే విధంగా డిజైన్ చేసి ఉండటంతో నీరు బయటకు వెళ్లలేక కాలువకు ఇరువైపులా గండ్లు పడుతున్నాయి. దీనికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ3.75 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతుల కోసం దాదాపు రూ.500 కోట్లలకుపైగా అవుతుందని, 1000 ఎకరాలకుపైగా భూసేకరణ చేయాల్సి వస్తుందని నిర్ధారించారు. అయితే ఇంకా తాత్కాలిక పనులు కూడా ప్రారంభం కాలేదు. వర్షం వస్తే డ్రెయిన్ నీటితో పంట పొలాలు కోతకు గురవుతాయని రైతులు హడలిపోతున్నారు. కొమ్మూరు కెనాల్‌కు ముప్పు.. నల్లమడ డ్రెయిన్‌కు గండ్లు పడుతుండటంతో దాని ప్రభావం కొమ్మూరు కెనాల్‌పై పడుతోంది. నల్లమడ వాగు దిగువన పెదనందిపాడు బ్రిడ్జిపై నుంచి ఓగేరు, కుప్పగంజి వాగు, నక్కల వాగుతోడై కొమ్మూరు కెనాల్లోకి నీరు వస్తుంది. దీంతో అప్పాపురంపైన దిగువన నాలుగు చోట్ల పెద్ద గండ్లు పడటంతోపాటు మొత్తం 86 చోట్ల కొమ్మూరు కెనాల్ తెగిపోయింది. దీని తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.3.23 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించారు. కాలువ కింద వేసిన వరి పంట దెబ్బతినకుండా మరమ్మతులు చేస్తున్నారు. బాదులు, ఇసుక బస్తాలు వేస్తున్నారు. చెరువులకు గండ్లు... జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు 12 మైనర్ ఇరిగేషన్ చెరువులు తెగిపోయాయి. తాడిపూడి చెరువు, మాదాల చెరువు, దామాయపాడు చెరువు, దాసబందం చెరువు, కల్లూరివాని చెరువు, జానపాడు చెరువు, పిన్నెల్లి చెరువు, ఎమడాల చెరువు, గణేష్ చెరువు, పంట చెరువుకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ 53.80 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తాత్కాలికంగా గండ్లు పూడ్చే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అంచనాలు రూపొందించడంలో... వర్షాలు వస్తే మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నదాతలు అందోళన చెందుతున్నారు. నీటి పారుదల శాఖ ఎస్ఈ కేవీఎల్ఎంపీ చౌదరి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ సిబ్బంది అంచనాలు రూపొందిస్తున్నారు. నల్లమడ డ్రెయిన్‌కు సంబంధించి ఇంకా తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం కాలేదు. -
పొంగి పొర్లుతున్న ‘నిర్లక్ష్యం’
* ఆరు దశాబ్దాలుగా పంట నష్టం * వచ్చి చూసి వెళ్లేవారే తప్ప చర్యలు శూన్యం * నల్లమడ శాశ్వత ముంపు నివారణ చర్యలకు వెనకడుగు * మాటలతో కాలం గడుపుతున్న ప్రభుత్వం పెదనందిపాడు/ చిలకలూరిపేట టౌన్: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నల్లమడ వాగు కింద సుమారు 3లక్షల ఎకరాల వ్యవసాయ భూమి సాగవుతోంది. గుంటూరు జిల్లాలో చిలకలూరి పేట, ప్రత్తిపాడు, పొన్నూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో పర్చూరు, చీరాల నియోజవర్గాల రైతులు ఈ వాగుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఆరు నియోజకవర్గాల్లో ఈ వాగుపై చాలా చోట్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకాల వలన రైతులకు ఉపయోగం ఉన్నా, వరదలు వచ్చిన ప్రతిసారీ రైతులు నష్టపోతూనే ఉన్నారు. పాలకులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప నల్లమడ వాగు శాశ్వత ముంపు నివారణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. వాగుకు పడిన గండ్లను పటిష్టంగా పూడ్చకపోవడం వలన పడిన చోటే మళ్లీ మళ్లీ గండ్లు పడుతున్నాయి. 2013లో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నల్లమడ వాగును శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపడతామని ప్రకటించారు. తీరా గెలిచిన తర్వాత నల్లమడ వాగు గురించి మరిచి పోయారు. 60 ఏళ్లలో 8 కమిటీలు.. నల్లమడ వాగుకు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఈ 60 ఏళ్లలో 8 కమిటీలు సూచనలు చేశాయి. ఏ ఒక్క సూచన అమలు చేసిన దాఖలాలు లేవని నల్లమడ రైతు సంఘం నాయకులు వాపోతున్నారు. 1964లో మిత్రా కమిటీ,1980లో సెంట్రల్ వాటర్ కమిషన్, 1982లో శాసనసభ అంచనాల కమిటీ, 1987లో డాక్టర్ శ్రీరామకృష్ణయ్య కమిటీ, 1991లో టెక్నికల్ మానిటరింగ్ కమిటీ, 1998లో సీహెచ్ రాధాకృష్ణమూర్తి కమిటీ, 2000లో ఎ.కృష్ణారావు కమిటీ, 2005లో చీఫ్ ఇంజినీర్ రోశయ్య కమిటీ ఈ ప్రాంతానికి వచ్చి నల్లమడ వాగును పరిశీలించాయి. వాగును 300 సి వాల్యూగా మార్చి, నల్లమడ వాగుకు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని సూచించాయి. నల్లమడ వాగు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని నల్లమడ రైతు సంఘం ఆధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహనరావు నాయత్వంలో అనేక సంవత్సరాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.211 కోట్లతో నల్లమడ వాగును శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టడానికి ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. కానీ నేటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. రైతులకు కష్టాలు తప్పడం లేదు. నల్లమడ వాగును అభివృధ్ధి చేసి ముంపు బారిన పడకుండా శాశ్వత నివారణ చర్యలు చేపడితే ఆరు నియోజకవర్గాలు సస్యశ్యామలంగా మారతాయి. శాశ్వత ముంపు చర్యలు వెంటనే చేపట్టాలి.. నల్లమడ వాగును అభివృద్ధి చేసి, శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే నల్లమడ వాగు శాశ్వత ముంపు నివారణ చర్యలకు గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వెంటనే అమలు చేయాలి. రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడంలోని మర్మం ఆయనకే తెలియాలి. వాగులకు కరకట్టలు వేసినపుడు రైతులు కోల్పోయే భూమికి తగిన పరిహారం చెల్లిస్తే రైతులు మాత్రం ఎందుకు సహకరించరు. – డాక్టర్ కొల్లా రాజమోహనరావు, నల్లమడ రైతు సంఘం ఆధ్యక్షుడు రైతుల సమస్యలు పట్టని ప్రజా ప్రతినిధులు.. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఆధికారులు పట్టించుకోకపోడం వలన నల్లమడ శాశ్వత ముంపు నివారణకు ప్రతిపాదనలు తయారైనా అవి ముందుకు సాగడం లేదు.ఇకనైనా ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి నల్లమడ శాశ్వత ముంపు నివారణ చర్యలు అమలయ్యేలా చూడాలి. – యార్లగడ్డ అంకమ్మ చౌదరి, నల్లమడ రైతు సంఘం కార్యదర్శి రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే అందజేయాలి.. ప్రస్తుతం వచ్చిన వరదల వలన పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారం అందజేయాలి. నల్లమడ వాగుకు పడిన గండ్లను వెంటనే పటిష్టంగా పూడ్చాలి. – బెల్లం సీతారామయ్య, రైతు -
అడ్రస్ లేని ఆధునికీకరణ
చీరాల, న్యూస్‌లైన్ : చేతిలో ‘మంత్రి’దండం ఉంటే చాలు.. అనుకూలంగా నిర్ణయాలు మార్చుకోవచ్చు.. గడువులోపు పనులు చేయనందుకు అధికారులు విధించిన జరిమానాను రద్దు చేయించుకోవచ్చు. కొమ్మమూరు కాలువ ఆధునికీకరణలో అదే నిజమైంది. వివరాల్లోకి వెళితే... మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కృష్ణా, పశ్చిమ డెల్టాను ఆధునికీకరించి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని తలపోశారు. డెల్టాలో భాగమైన గుంటూరు జిల్లా నరసాయపాలెం వద్ద ఉన్న నల్లమడ కాలువ నుంచి పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువ ప్రవహిస్తుంది. దీని ఆధునికీకరణకు రూ.196 కోట్లు కేటాయిం చారు. 2008లో టెండర్లు పూర్తయ్యాయి. పనులను కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన పీసీఎల్ (ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్) సంస్థ దక్కించుకుంది. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.19.6కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ డబ్బుతో ప్రకాశం, గుంటూరు జిల్లాలో చిన్నపాటి బ్రిడ్జిలు మినహా కాలువలో ఒక్క బుట్ట మట్టి కూడా తీయలేదు. మొత్తమ్మీద రూ.15 కోట్లు ఖర్చు చేశారు. అంటే అడ్వాన్స్ కింద తీసుకున్న వాటిల్లో ఇంకా రూ.4.6 కోట్లు సంస్థ వద్దే ఉండిపోయాయన్న మాట. ఆధునికీకరణ ఇలా... కొమ్మమూరు కాలువ 47 కిలోమీటర్ల మొత్తాన్ని ఆధునికీకరించాలి. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న మరో 50 చిన్న కాలువలకూ మరమ్మతులు చేపట్టాలి. ప్రధాన కాలువను 5 లక్షల క్యూబిక్ మీటర్ల లోతు చేయడంతో పాటు కాలువ పొడవునా నడిచి వెళ్లేందుకు వీలుగా 34 ర్యాంపులు, 35,500 క్యూబిక్ మీటర్లు సీసీ లైనింగ్, ఇసుక ప్రాంతంలో 4.92 లక్షల చదరపు మీటర్ల పొడవున రాతితో లైనింగ్ ఏర్పాటు, 11 రెండు లైన్ల బ్రిడ్జిలు, 26 ఒక లైన్ బ్రిడ్జిలు, 64 బాక్స్ కల్వర్టులు, 15 అండర్ టన్నెళ్లను హైడ్రాలిక్ పర్టిక్యులర్స్ సిస్టమ్ ప్రకారం ఆధునికీకరించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి ఇలా... కొమ్మమూరు కాలువ కింద అధికార, అనధికారికంగా లక్ష ఎకరాలు సాగవుతుంది. ఓగ్ని, లైలా, జల్ వంటి తుఫాన్ల తాకిడికి కాలువ రూపురేఖలు మారిపోయాయి. కాలువ ఎక్కువభాగం పూడిపోయింది. నీరు వదిలినా అవి చివరి వరకు రావడం లేదు. కరకట్టలు బలహీనంగా ఉన్నచోట, గండ్లు పడిన చోట చుట్టు పక్కల పొలాలు మునిగిపోతున్నాయి. ఏటా పరిస్థితి ఇలానే ఉండడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వేటపాలెం, చినగంజాం మండలాలతో పాటు పలుచోట్ల రైతులు పంటలు కూడా వేయడం మానేశారు. జరిమానా రూ.15 కోట్లు రద్దు చేయించుకున్న కాంట్రాక్టు సంస్థ: ఆధునికీకరణ 2012 ఆగస్టులోపు పూర్తి చేయాలి. గడువు ముగిసినా నామమాత్రపు పనులు కూడా చేపట్టలేదు. ఇరిగేషన్ అధికారులు రూ.15 కోట్లు జరిమానా విధించారు. ఆ తర్వాత కావూరి కేంద్రమంత్రి కావడంతో తన పలుకుబడి ఉపయోగించి జరిమానాను రద్దు చేయించుకున్నారు. అంతేగాక ఏడాది పాటు గడువు పెంచేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ గడువులోపూ పనులు పూర్తి చేయలేదు. 2015 వరకు సమయం కావాలని కోరడంతో ప్రభుత్వం మరోసారి అనుమతించడం గమనార్హం. మొదటిసారి గడువు పెంచిన సమయంలో రూ.196 కోట్ల పనుల్లో కేవలం రూ.15 కోట్లు మాత్రమే చేశారంటే ఆ సంస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారీ అనుమానమే?... కొమ్మమూరు కాలువకు ఏటా మార్చి 31వ తేదీ నాటికి సాగు నీటిని పూర్తిగా నిలిపివేస్తారు. ఏప్రిల్ 15 నుంచి ఆధునికీకరణ పనులు మొదలు పెట్టి జూలై నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు మూడు నెలల పాటు పనులు జరగాలి. ఈ పనులను చేపట్టాలంటే ఇప్పటికే అందుకు సంబంధించిన సామగ్రి, ఇతర పరికరాలు వచ్చి ఉండాలి. అటువంటి ప్రక్రియ ఏమీ మొదలు కాలేదు. దీన్నిబట్టి చూస్తే ఆధునికీకరణ ఈ ఏడాదీ అనుమానమేనని, ఆయకట్టు రైతులకు ఈ ఏడాది క‘న్నీటి’ కష్టాలు తప్పేలా లేవ ని వాపోతున్నారు.