నల్లమడ.. గుండె దడ
నల్లమడ.. గుండె దడ
Published Wed, Oct 5 2016 5:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
* అధికారుల లోపాలు.. అన్నదాతలకు శాపాలు
* డిజైన్‌లో లోపాల వల్లే వరదల్లో నాలుగుచోట్ల గండ్లు
* ఇప్పుడు శాశ్వత మరమ్మతులు చేపట్టాలంటే రూ.500 కోట్లు అవసరం
పంట పసిపాపలా పచ్చగా నవ్వుతున్న వేళ వరద ముంచెత్తి కాలువ కట్టలను తెంచుకుంటూ రైతు నుదుట దుఖాఃన్ని పులుముతోంది. ప్రకృతి ప్రకోపించినా, పాలకులు ఆదమరిచినా భూమాతకు పచ్చబొట్టు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకునే రైతు కష్టం.. అధికారుల అలసత్వానికి నిలువునా తుడిచిపెట్టుకు పోతోంది. కన్న తండ్రిలా పంటకు ప్రాణంపోసే కాలువలు.. డిజైన్ల నిర్మాణ లోపంతో గండ్లు పడి రైతుల పాలిట శాపాలై కన్నీటి సుడిగుండాలు మిగిలిస్తున్నాయి.
సాక్షి, అమరావతి బ్యూరో: నల్లమడ డ్రెయిన్ పొంగి పంట పొలాలను ముంచెత్తుతోంది. అధికారులు డిజైన్స్‌లో చేసిన లోపాలు అన్నదాతలకు శాపాలుగా మారాయి. కొండపాటూరు, గార్లపాడు, నాగులపాడులవద్ద వంతెనల నిర్మాణాలు 500 సీ డిజైన్‌తో రూపొందించడంతో అక్కడ నుంచి నీరు సరిగా వెళ్లక గండ్లు పడి పంట పొలాలను మునిగిపోతున్నాయి. కొన్ని చోట్ల మట్టి మేటలు వేసి, మరికొన్ని చోట్ల భూమి కోతకు గురవుతుంది. ఈ ఏడాది కాలువ పరిధిలో 25,000 ఎకరాలకుపైగా పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. తుఫానుకు 36 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. నల్లమడ డ్రెయిన్‌పై నిర్మిస్తున్న మూడు బ్రిడ్జిలు 500సీ మేర డిజైన్ చేశారు. అక్కడ వాగుకు 300సీకి మాత్రమే దాదాపు 20 వేల క్యూసెక్కుల నీరు వెళ్లే విధంగా డిజైన్ చేసి ఉండటంతో నీరు బయటకు వెళ్లలేక కాలువకు ఇరువైపులా గండ్లు పడుతున్నాయి. దీనికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ3.75 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతుల కోసం దాదాపు రూ.500 కోట్లలకుపైగా అవుతుందని, 1000 ఎకరాలకుపైగా భూసేకరణ చేయాల్సి వస్తుందని నిర్ధారించారు. అయితే ఇంకా తాత్కాలిక పనులు కూడా ప్రారంభం కాలేదు. వర్షం వస్తే డ్రెయిన్ నీటితో పంట పొలాలు కోతకు గురవుతాయని రైతులు హడలిపోతున్నారు.
కొమ్మూరు కెనాల్‌కు ముప్పు..
నల్లమడ డ్రెయిన్‌కు గండ్లు పడుతుండటంతో దాని ప్రభావం కొమ్మూరు కెనాల్‌పై పడుతోంది. నల్లమడ వాగు దిగువన పెదనందిపాడు బ్రిడ్జిపై నుంచి ఓగేరు, కుప్పగంజి వాగు, నక్కల వాగుతోడై కొమ్మూరు కెనాల్‌లోకి నీరు వస్తుంది. దీంతో అప్పాపురంపైన దిగువన నాలుగు చోట్ల పెద్ద గండ్లు పడటంతోపాటు మొత్తం 86 చోట్ల కొమ్మూరు కెనాల్ తెగిపోయింది. దీని తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.3.23 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించారు. కాలువ కింద వేసిన వరి పంట దెబ్బతినకుండా మరమ్మతులు చేస్తున్నారు. బాదులు, ఇసుక బస్తాలు వేస్తున్నారు.
చెరువులకు గండ్లు...
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు 12 మైనర్ ఇరిగేషన్ చెరువులు తెగిపోయాయి. తాడిపూడి చెరువు, మాదాల చెరువు, దామాయపాడు చెరువు, దాసబందం చెరువు, కల్లూరివాని చెరువు, జానపాడు చెరువు, పిన్నెల్లి చెరువు, ఎమడాల చెరువు, గణేష్ చెరువు, పంట చెరువుకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ 53.80 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తాత్కాలికంగా గండ్లు పూడ్చే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
అంచనాలు రూపొందించడంలో...
వర్షాలు వస్తే మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నదాతలు అందోళన చెందుతున్నారు. నీటి పారుదల శాఖ ఎస్‌ఈ కేవీఎల్‌ఎంపీ చౌదరి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ సిబ్బంది అంచనాలు రూపొందిస్తున్నారు. నల్లమడ డ్రెయిన్‌కు సంబంధించి ఇంకా తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం కాలేదు.
Advertisement
Advertisement