
‘పశ్చిమ’ ఏజెన్సీలో మళ్లీ మావోయిస్టుల అలికిడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒకప్పుడు అన్నల అడుగులు.. పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లిన ‘పశ్చిమ’ అటవీ ప్రాంతం కొన్నేళ్లుగా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఇటీవల మావోయిస్టుల సంచారం మొదలైనట్టు విశ్వసనీ యంగా తెలిసింది. పది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి ఐదుగురు సభ్యుల మావోరుుస్టు బృందం గోదావరి నది దాటి ‘పశ్చిమ’ ఏజెన్సీలోకి ప్రవేశించినట్లు సమాచారం.
వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్టు తెలిసింది. సాయుధులైన వీరంతా కిట్ బ్యాగులు, జంగిల్ దుస్తులు ధరించినట్టు చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన మావోలు తొలుత ఏనుగుల గండి ప్రాంతంలో సంచరించిట్టు తెలుస్తోంది. పరిసర ప్రాంతాల గిరిజ నులు అటవీ ప్రాంతంలోకి వెళ్లగా, అక్కడ వీరు తారసపడినట్టు సమాచారం. బుట్టాయగూడెం మండలంలోని గుబ్బలమంగమ్మ గుడిని కూడా మావోయిస్టులు సందర్శించినట్టు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ర్టంలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయ నిర్వహణను ఎవరు చూస్తున్నారంటూ మావోలు గిరిజనులను ఆరా తీయగా, వారు న్యూడెమోక్రసీ నిర్వహణలో ఉందని చెప్పినట్టు తెలిసింది. ఆలయం ఓ పార్టీ ఆధీనంలో ఉండటమేమిటి.. గిరిజనులు లేదా భక్తుల నిర్వహణలో ఉండాలి కదా అని మావోలు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వివరాలు సేకరించిన మావోలు ఆ తరువాత బుట్టాయగూడెం మండలం శివారు మోతుగూడెం తదితర ప్రాంతాల్లోనూ సంచరించి ఎగువ ప్రాంతానికి వెళ్లినట్టు తెలిసింది.
పూర్వం ఛత్తీస్‌గఢ్ ప్రాంతంతోపాటు ఖమ్మం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (ఏవోబీ) ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు జరిగితే మావోయిస్టులు ‘పశ్చిమ’ ఏజెన్సీకి వచ్చి తలదాచుకుని వెళుతుండేవారు. వారందరికీ ‘పశ్చిమ’ ఏజెన్సీ కేవలం షెల్టర్ జోన్‌గానే ఉండేది. కొన్నేళ్లుగా అలజడి లేకున్నా, తాజాగా మావోయిస్టులు ఈ ప్రాంత సమాచారం సేకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏజెన్సీపై మళ్లీ దృష్టి సారించారా?
ఇప్పటివరకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలోనే మావోల ప్రభావం ఉండేది. రాష్ట్రం విడిపోవడంతో ఖమ్మం జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలంలోని గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలో కలవడంతో మావోయిస్టులు ఇక్కడి ఏజెన్సీ ప్రాంతంపై దృష్టి సారించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలలో పర్యటించిన సమయంలోనూ మావోయిస్టులు ‘పశ్చిమ’ ఏజెన్సీలోనే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
అప్రమత్తంగానే ఉన్నాం : డీఎస్పీ
ఖమ్మం జిల్లాలోని మండలాలు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో కలవడంతో తలెత్తే పరిణామాలపై అప్రమత్తంగానే ఉన్నామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎంవీ సుబ్బారాజు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ మావోయిస్టులు ఇక్కడ సంచరించారన్న సమాచారం తమవద్ద లేదన్నారు. అయినా ముందుజాగ్రత్త చర్యగా పూర్తి వివరాలు సేకరించి మరింత అప్రమత్తంగా ఉంటామని చెప్పారు.