పచ్చటి పొలాల్లో జెండాలు పాతడం.. యాభై, అరవై మంది మూకుమ్మడిగా వచ్చి పంటను ధ్వంసం చేయడం.. అమాయక గిరిజనులను, రైతులను భయభ్రాంతులకు గురిచేయడం.. ఆనక భూమిని ఆక్రమించడం.. ఇవేవో ఆర్.నారాయణమూర్తి మార్కు సినిమాల్లోని విలనోచిత సన్నివేశాలు కావు. పశ్చిమ ఏజెన్సీలో భూ వివాదాలను అడ్డంపెట్టుకుని ఓ సంస్థ పేరిట ఓ ముఠా నాయకుడు సాగిస్తున్న నిత్యకృత్యాలివి. నిజానికి ఏజెన్సీలో భూ వివాదాలు కొన్నాళ్ల కిందటే తగ్గుముఖం పట్టాయి. కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకు.. అడ్డంగా డబ్బు సంపాదించేందుకు అనుచర ముఠాతో అరాచకాలు చేస్తూ భూ వివాదాలు సృష్టిస్తూ ఆ నేత పబ్బం గడుపుకుంటున్నాడు. అతడి ఆగడాలు తట్టుకోలేక గిరిజనేతర రైతులు ఎంతోకొంత ముట్టజెప్పి సేద్యానికి ఉపక్రమించే పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా అతగాడు జీలుగుమిల్లి మండలం దిబ్బగూడేనికి చెందిన ఓ రైతు పొలంలోకి సుమారు 60 అనుచరులను పంపి ఆయిల్‌పామ్ తోటను ధ్వంసం చేయించాడు. ఆనక రూ.6 లక్షలు డిమాండ్ చేశాడు. రాచన్నగూడెం, లంకాలపల్లి గ్రామాల్లోని గిరిజనేతర రైతుల పొలాల్లోనూ ఇదే మాదిరి అలజడి సృష్టించాడు.
గిరిజనుల భూముల్లోనూ..
గిరిజనుల భూముల పరిరక్షణకు ఉద్దేశించిన 1/70 యాక్ట్ ఆధారంగా వారి తరఫున పోరాడుతున్నట్టు నటిస్తూ గిరిజనేతరులను భయభ్రాంతులకు గురిచేయడం ఇప్పటివరకు అతను ఎంచుకున్న విధానం. తాజాగా సదరు నేత దృష్టి గిరిజనుల పొలాలపైనా పడింది. గిరిజన భూముల్లోకి గిరిజనులనే రెచ్చగొట్టి పంపి సొమ్ము చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నాడు. ఆర్థికంగా కొద్దిగా బాగున్న గిరిజన రైతుల భూములు ఎంచుకుని వారిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడు. దీంతో ఆదివాసీల్లోనే భూ వివాదాలు నెలకొంటున్నాయి. అమాయకులైన అడవి బిడ్డలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొం టోంది. ఇక గతంలో భూ ఉద్యమాల్లో భాగంగా ఆదివాసీలు సాధించుకున్న భూమిని కూడా ఆ నాయకుడే అనుభవిస్తుండగా, దీనిపై గిరిజనులు జిల్లా అధికార యంత్రాగానికి ఫిర్యాదు చేశారు. అరాచకవాదులపై ఉక్కుపాదం మోపుతామని బీరాలు పోతున్న పోలీసు అధికారులు కనీసం ఇతనిపై వస్తున్న ఫిర్యాదులపైనైనా సీరియస్‌గా దృష్టి సారిస్తారేమో చూడాలి.
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
ఏజెన్సీలో భూ మంత్రకాళి
Published Sun, Sep 13 2015 12:47 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement