- సంప్రదాయబద్ధంగా గిరిజన పండగ
- ఏటా ఖరీఫ్ నాట్ల తర్వాత ఆచారం
- పంటల్ని చీడపీడల నుంచి రక్షించేందుకే
హుకుంపేట/పాడేరు: గిరిజనుల సంప్రదాయ పండగ ‘జోల్టా’ ఏజెన్సీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. సాధారణంగా ఖరీఫ్ నాట్లు పూర్తయ్యాక గిరిజనులు ఈ పండుగ నిర్వహిస్తారు. మైదాన ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా వర్షాలు కురిసినా ఏజెన్సీలో సకాలంలో వర్షాలు పడడంతో చాలాచోట్ల నా ట్లు పడ్డాయి. దీంతో గిరిజనులు పండగ ఏర్పాట్లలో ముని గిపోయారు. పలు గ్రామాల్లోని గిరి రైతులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఏ గిరిజన గ్రామా న్ని సందర్శించినా పండగ హడావుడే కనిపిస్తోంది. పాడే రు, హుకుంపేట మండలాల్లోని పలు ప్రాంతాల రైతులు బుధవారం పండగను వేడుకగా నిర్వహించి సహపంక్తి భో జనాలు చేశారు. కొత్తపాడేరు, పాతపాడేరు, సుండ్రుపు ట్టు, గుడివాడ, తుంపాడ, వనుగుపల్లి, కుజ్జెలి, వంతాడప ల్లి ప్రాంతాల్లో రైతులు అట్టహాసంగా పండగ నిర్వహిం చారు. కేవలం సంప్రదాయమే కాకుండా గిరిజనుల ఐకమత్యానికి కూడా ఈ పండగ తార్కాణంగా నిలుస్తుంది.
జోల్టా పండగ అంటే?
జోల్టా కొమ్మలతో చేసే పండుగ. వాస్తవానికి దీన్ని చిత్తపండుగ అని గిరిజనులు పిలుస్తారు. తాము సాగుచేసే పంటలు మంచి దిగుబడులు ఇవ్వాలని, చీడపీడల బారిన పడకూడదని కోరుకుంటూ దేవత ముందు పెట్టి పూజచేసిన కొమ్మల్ని పొలాల్లో నాటుతారు. వరినాట్లు పూర్తయ్యాక గిరిజనులంతా సంప్రదాయబద్ధంగా ఈ పండుగ చేసుకుంటారు.
ముందు కొర్రా కొత్త పండుగ నిర్వహించి అక్కడికి వారం రోజుల తర్వాత జోల్టా పండుగ నిర్వహిస్తారు. రైతులంతా తెల్లవారు జామున నిద్రలేచి స్నానం చేశాక ప్రతి ఇంటి నుంచి బియ్యం, కొద్ది మొత్తం డబ్బులు సేకరిస్తారు. డబ్బుల్తో కోడిని కొనుగోలుచేసి శంఖుదేవుడి గుడి వద్దకు తీసుకువస్తారు. పొలాల్లో పాతేందుకు అడవిలో సేకరించిన కస్మింద, పెద్దజొల్టా, జీలుగు, సీతమ్మజెడ పూల కొమ్మలను కూడా తెచ్చి శంఖుదేవుని ముందుంచుతారు.
గొరవగాడు గ్రామస్తులు తెచ్చిన కోడిని కోసి దాని రక్తాన్ని బియ్యంలో కలిపి దేవునికి అర్పించి పూజలు చేస్తారు. ఇలా పూజించిన బియ్యాన్ని మంత్రించి గొరవగాడు పొట్లాంలా కట్టి కటి కొమ్మలకు కడతాడు. మంత్రించిన కొమ్మలను గిరిజనులు తమ ఇళ్లకు తీసుకువెళ్లి కోడికోసి పూజలు చేస్తారు. పలు పదార్థాలు తయారుచేసి పొలాల వద్దకు తీసుకువెళ్లి అక్కడ కూడా పూజలు చేస్తారు. అనంతరం తెచ్చిన కొమ్మలను పంటపొలాల్లోను, గత్తంకొట్టెవద్ద పాతుతారు. ఆ తర్వాత అంతా సహపంక్తి భోజనం చేస్తారు.