
ప్రొద్దుటూరు క్రైం : అగ్రిగోల్డ్.. ఒకప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. తక్కువ కాలంలో రెట్టింపు మొత్తం వస్తుందనే ఆశతో జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది రూ.లక్షల్లో ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. ఇప్పుడు ఆ సంస్థ చేతులెత్తేయడంతో అటు డిపాజిట్ దారులు.. ఇటు ఏజెంట్లు నిలువునా మోసపోయి లబోదిబో మంటున్నారు. న్యాయం చేయండంటూ అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి.
జిల్లాలో 2.5 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు ఉన్నట్లు తెలుస్తోంది. 1995లో కడప, ప్రొద్దుటూరులలో అగ్రిగోల్డ్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. తర్వాత కొంత కాలానికి మరో ఐదు ప్రాంతాల్లో బ్రాంచీలు వెలిశాయి. తక్కువ కాలంలో రెట్టింపు మొత్తం వస్తుందనే ఆశతో జిల్లా వ్యాప్తంగా రూ. లక్షల్లో డిజిపాట్‌లు చేశారు. ఇందులో రోజు వారి కలెక్షన్, నెలకు ఒక సారి చెల్లించే డిపాజిట్లు ఉన్నాయి.
ఇవే గాక ఎస్‌ఎస్‌పీ–1, ఎస్‌ఎస్‌పీ–2 ఒకే సారి చెల్లించే డిపాజిట్లు, రెండు రూపాయల వడ్డీతో చెల్లించే పీఎస్‌పీ స్కీంతో పాటు ఆర్‌ఎఫ్‌పీ, ఎఫ్‌సీ 36, జీఎఫ్‌పీ లాంటి స్కీములు ఉన్నాయి. సీఐడీ లెక్కల ప్రకారం జిల్లాలో లక్షా 18 వేల మంది డిపాజిట్ దారులు ఉన్నారు. వీరికి రూ. 125 కోట్లు రావాల్సి ఉంది. అయితే సీఐడీ అధికారుల లెక్కలు తప్పుల తడక అని పలువురు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది డిపాజిట్‌దారులు ఉన్నారని, సుమారు రూ.500 కోట్లకు పైగా వారికి డబ్బు రావాల్సి ఉందని అంటున్నారు.
మా డబ్బు ఎవరు ఇస్తారు..
అగ్రిగోల్డ్ సంస్థ మూత పడినప్పుడు ఒత్తిళ్లు అధికం కావడంతో చాలా మంది ఏజెంట్లు సొంతంగా డబ్బు చెల్లించారు. వడ్డీకి తెచ్చి కొందరు, ఆస్తులు విక్రయించి ఇంకొందరు ఏజెంట్లు డిపాజిట్ దార్లకు డబ్బు కట్టారు. అయితే డబ్బు చెల్లించిన ఖాతాదారులు బాండ్ల పరిశీలనకు రావడం లేదని ఏజెంట్లు వాపోతున్నారు. కొందరైతే బాండ్లు, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్కులు ఇస్తున్నారని, అయితే డబ్బులు వారి అకౌంట్‌లో పడితే తమకు ఎలా వస్తాయని ఏజెంట్లు ఆవేదన చెందుతున్నారు. ఇలా జిల్లాలో చాలా మంది ఏజెంట్లు చేతి నుంచి డబ్బు చెల్లించారని, వారికి న్యాయం చేయాలని పలువురు ఏజెంట్లు కోరుతున్నారు.
రశీదులు లేవు.. బాండ్లు కనిపించలేదు..
అగ్రిగోల్డ్ మూత పడి దాదాపు మూడేళ్లు దాటింది. డబ్బు వస్తుందో రాదో అనే అనుమానంతో చాలా మంది రశీదులను పక్కన పడేశారు. కొందరైతే బాండ్లను కూడా చిత్తు కాగితాల్లో కలిపేశారు. అయితే ఇప్పుడు సీఐడీ బాండ్ల పరిశీలన చేస్తుండటంతో అవి కనిపించక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. రశీదులు ఉన్న మేరకే మొత్తాన్ని పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. దీంతో డబ్బులు వస్తాయో రావోనని కొందరు మహిళలు రోదిస్తున్నారు. తక్కువ రోజుల్లో రెండింతలు ఇస్తామనడంతో కూడబెట్టిన డబ్బును కట్టగా నిలువునా ముంచేశారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేసినా నేటికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆందోళన చెందుతున్నారు.
అప్‌లోడ్ చేయడంలో ఎన్నెన్నో కష్టాలు
డిపాజిట్‌దారులు వెబ్‌సైట్‌లో 10 శాతం మంది మాత్రమే అప్‌లోడ్ చేసుకున్నారు. కేవలం 12 వేల మంది మాత్రమే ఏడాది క్రితం తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు పోలీసు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతంలో చాలా మందికి తెలియకపోవడంతో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసుకోలేదు. బాండ్ల పరిశీలన చేస్తూనే మిగిలిన డిపాజిట్‌దారుల పేర్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్‌లో పేర్ల నమోదు చేపట్టలేదు. దీంతో ఖాతాదారులు నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నెట్ సెంటర్లలో అప్‌లోడ్ చేసినందుకు గాను రూ.50 వసూలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో పేర్ల నమోదుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఉండదని అగ్రిగోల్డ్ ఖాతాదారులు కోరుతున్నారు.
పోలీస్‌స్టేషన్లలోనే అప్‌లోడ్ చేయాలి
అన్ని జిల్లాల్లో పోలీస్‌స్టేషన్లలోనే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. నెట్ సెంటర్లకు వెళ్లాలంటే మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా స్టేషన్లలోనే పేర్లను నమోదు చేయాలి. కంప్యూటర్లను, సిబ్బందిని పెంచితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. – మాకం నాగేశ్వరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి.
అగ్రిగోల్డ్ కస్టమర్ ఐడీని పరిగణనలోకి తీసుకోవాలి
చాలా మంది వద్ద రశీదులు, బాండ్లు లేవు. రశీదులు ఉన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటామంటే ఎలా. అగ్రిగోల్డ్ కస్టమర్ ఐడీలో చూస్తే ఎంత మొత్తం చెల్లించారో çస్పష్టంగా తెలుస్తుంది. బాధితులకు న్యాయం చేయాలంటే అగ్రిగోల్డ్ కంపెనీ డేటా ఆధారంగా వివరాలు సేకరించాలి.
– జహీర్, డిపాజిటర్, ప్రొద్దుటూరు.
మేం కట్టిన డబ్బు ఎవరు ఇస్తారు..?
ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో చేతి నుంచి రూ.5 లక్షలు దాకా డిపాజిటర్లకు చెల్లించాను. బాండ్ల పరిశీలనకు రమ్మని చెబితే చాలా మంది రాలేమని చెబుతున్నారు. కొందరైతే బాండ్లు, బ్యాంకు అకౌంట్ బుక్కులు ఇస్తున్నారు. డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అయితే మాకు ఎలా వస్తుంది. అధికారులు మాకు న్యాయం జరిగేలా చూడాలి.
– వీరవనజ, ఏజెంటు, వీరపునాయునిపల్లి.
ఆన్‌లైన్‌లో 12 వేల మందికి పైగా నమోదు
సాక్షి, కడప: జిల్లాలోని అన్ని మండలాల నుంచి అగ్రిగోల్డ్‌లో పెట్టుబడి పెట్టిన బాధితులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, కడప, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల నుంచి సుమారు 12 వేల మందికి పైగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. జిల్లాలోని మీ–సేవ సెంటర్లతోపాటు ఆన్‌లైన్ కేంద్రాల్లో అగ్రిగోల్డ్ బాధితుల నమోదు ప్రక్రియ సాగుతోంది. అయితే చాలాచోట్ల ఆన్‌లైన్ ప్రక్రియకు సంబంధించి సర్వర్లు పనిచేయక, సంబంధిత వెబ్‌సైట్ ఓపెన్ కాక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సబ్ డివిజన్లలో పరిశీలన
జిల్లాలోని ఆరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో పరిశీలన ప్రక్రియ సజావుగా సాగుతోంది. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ ఇప్పటికే అగ్రిగోల్డ్ బా«ధితులు తమ వద్ద ఉన్న రశీదులు, బాండ్లను తీసుకొచ్చి ఆధారాలు చూపించాని కోరిన నేపథ్యంలో అన్నిచోట్ల బారులు తీరుతున్నారు. కొన్నిచోట్ల రోజుకు కొన్ని మండలాలకు సంబంధించిన బాధితులు రావాల్సిందిగా ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసులు చార్టులు వేయడంతో....అందరూ ఒకేసారి వచ్చి తోసుకోకుండా క్రమ పద్ధతి ›ప్రకారం పరిశీలన చేస్తున్నారు. శనివారం నాటికి 1600 మందికి పైగా పరిశీలన పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment