సాక్షి, గుంటూరు: నెల రోజుల్లోగా అగ్రిగోల్డ్ బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ములు చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయపోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు గుంటూరు విజ్ఞాన మందిరంలో కొనసాగుతున్న దీక్ష అర్ధాంతరంగా ముగిసింది. దీక్షతో పాటు బాధితులు చేపట్టిన ఆత్మఘోష పాదయాత్ర కూడా విరమించుకున్నట్లు నేతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుండా అర్ధాంతరంగా ఆందోళన విరమించడాన్ని బాధితులు తప్పుబట్టారు. నిర్దిష్ట హామీ లేకుండా పాదయాత్ర ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటో చెప్పాలని, రాష్ట్రం నలుమూలల నుంచి వస్తే మాకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. మంత్రి నక్కా ఆనందబాబు ఏం హామీ ఇచ్చి దీక్షను విరమింపచేశారని నేతలను బాధితులు ప్రశ్నించారు. దీక్షా శిబిరానికి ఓ మంత్రి వచ్చి హామి ఇవ్వటం గొప్పేకదా నేతలు చెప్పటం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా జరుగుతున్నదే మళ్లీ జరిగిందని, ఇందులో వింతేముందంటూ బాధితులు వాపోతున్నారు. అయితే నేతలు వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆందోళన విరమించండి: మంత్రి
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో మంత్రి నక్కా ఆనందబాబు విజ్ఞాన మందిరంలో గురువారం ఉదయం సమావేశం అయ్యారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఈరోజు జరిగే మంత్రివర్డ సమావేశంలో చర్చిస్తామని, ఆందోళన విరమించండని కోరారు. దీంతో మంత్రి ప్రసంగానికి బాధితులు అడ్డుపడ్డారు. డబ్బు ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. కేవలం ప్రకటనలకే పరిమితమై కాలయాపన చేస్తున్నారని నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి కొంత సమయం ఇవ్వమని బాధితులని కోరారు. అయితే తమకు డబ్బులు ఇచ్చేందుకు కచ్చితమైన సమయం చెప్పాలంటూ నినాదాలు చేయగా మంత్రి మాట దాటేశారు. ఈ రోజు సాయంత్రం ఐదుగురికి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పిస్తానని మంత్రి అన్నారు. ఆందోళన చేసిన ప్రతిసారి ప్రభుత్వం మోసపూరిత హామీలిస్తోందంటూ బాధితులు ఆగ్రహం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment