పాలకొండ: పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో సహకరిస్తూ రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్జీవంగా మారాయి. సిబ్బంది కొరత కారణంగా చెక్‌పోస్టులు మూతపడుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా దూరం చేస్తున్నాయి. పాలకవర్గాలు లేకపోవడంతో ఇన్‌చార్జి కార్యదర్శుల ఏలుబడిలో మార్కెట్ కమిటీల పాలన పూర్తిగా కుంటుపడింది. జిల్లాలో 14 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీలో 14 మంది వరకు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒకరిద్దరితోనే కాలక్షేపం చేస్తున్నారు. పొందూరు, రాజాం, పాలకొండ తదితర మార్కెట్ కమిటీల్లో ఇద్దరు చొప్పున సిబ్బంది ఉన్నారు. అలాగే ఎచ్చెర్ల, హిరమండలం, ఇచ్ఛాపురం మార్కెట్ కమిటీలకు మాత్రమే పూర్తిస్థాయి కార్యదర్శులున్నారు. మిగతా 11 కమిటీలకు సూపర్‌వైజర్లే కార్యదర్శులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మూతపడుతున్న చెక్‌పోస్టులు
మార్కెట్ కమిటీల పరిధిలో జిల్లాలో 28 చెక్‌పోస్టులు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ. 25 లక్షల నుంచి రూ. 45 లక్షల ఆదాయం లభించాల్సి ఉంది. ఇతర ప్రాంతాలకు తరలించే వ్యవసాయ ఉత్పత్తులకు ఈ చెక్‌పోస్టులు రుసుం వసూలు చేస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో సిబ్బంది కొరతతో చెక్‌పోస్టులు మూతపడుతున్నాయి. ఇటీవల భామిని చెక్‌పోస్టు మూతపడగా అక్రమంగా సరుకు తరులుతున్న విషయం వెలుగు చూసింది. సరిపడినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బంది పగటిపూట మాత్రమే విధులు నిర్వహించి రాత్రి సమయాల్లో వీటిని మూసివేస్తున్నారు. అందులోనూ రసీదు ఇచ్చే అధికారం గార్డులకు లేకపోవడంతో వాచ్‌మెన్‌లే ఆ పని చేస్తున్నారు. ఈ కారణాలతో లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది.
మందగించిన సేవలు
మార్కెట్ కమిటీల్లో రైతులకు అన్ని రకాల సేవలు అందించాల్సి ఉంది. పండిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోతే రైతు బంధ పథకం ద్వారా ఉత్పత్తులను నిల్వ చేసి, రుణ సాయం అందించి ఆదుకోవాలి. అలాగే మార్కెట్‌లో ఉన్న ధరల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందించాలి. మార్కెట్ కమిటీ పరిధిలో పండిన పంటలు, వాటి కొనుగోళ్లు తదితర వివరాలను నమోదు చేయాలి. ప్రస్తుతం ఇవేవీ రైతులకు కనిపించడం లేదు. రైతు బంధు పథకం వినియోగించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు.
పాలకవర్గాల ఎంపిక లో జాప్యం
మార్కెట్ కమిటీలకు చైర్మన్లతో పాటు పాలకవర్గ సభ్యులను ఎంపిక చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇటీవల కమిటీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించి ఆశావహులను సంతృప్తిపరిచే చర్యలు చేపట్టినా అధికార పార్టీ నేతల నుంచి తీవ్రమైన పోటీ తప్పడం లేదు. ఈ పదవులు దక్కించుకొనేందుకు వర్గాల వారీగా అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు వర్గాల పేరుతో పలువురు నాయకులు పదవుల కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వీటి నియామకాలు జరిపితే వర్గ రాజకీయాలు గుప్పుమంటాయన్న భయంతో ముఖ్యమంత్రి ఈ నియామకాల్లో జాప్యం చేస్తున్నారు.
పాలకులు సిబ్బందీ లేరు
Published Thu, Feb 26 2015 12:42 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
Advertisement
Advertisement