సీఎం అధ్యక్షతన వ్యవసాయ మిషన్‌ | Agricultural mission chaired by CM Jagan | Sakshi
Sakshi News home page

సీఎం అధ్యక్షతన వ్యవసాయ మిషన్‌

Published Tue, Jul 2 2019 4:37 AM | Last Updated on Tue, Jul 2 2019 11:45 AM

Agricultural mission chaired by CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలు కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. విధాన సలహా మండలిగా అగ్రికల్చరల్‌ (వ్యవసాయ) మిషన్‌ను ఏర్పాటు చేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉత్తమ సమన్వయానికి ఈ మిషన్‌ దోహదపడుతుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఎప్పటి కప్పుడు ఉత్తమమైన సేవలు అందించడం, ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ధరలు సహా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తుంది. అలాగే వ్యవసాయ సంస్థలకు, రైతాంగానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకత్వం వహిస్తుంది. రైతులు సాధికారిత సాధించేలా విధానపరమైన ప్రాథమిక వేదికగా ఉంటుంది.

ఈ మిషన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌గా, రైతు నాయకుడు ఎంవీ ఎస్‌ నాగిరెడ్డి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయ, సహకారం, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖల మంత్రులు, ఆ శాఖల కార్యదర్శులు, అధిపతులు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.రాఘవరెడ్డి, వ్యవసాయ ఆర్థిక వేత్త డాక్టర్‌ చంద్రశే ఖర్‌రెడ్డి, రైతు ప్రతినిధులుగా బోయ నరేంద్ర, జిన్నూరి రామారావు, గొంతు రఘురామ్, అనంతపురంలోని గ్రామీణాభివృద్ధి ట్రస్ట్‌ జీవావరణ విభాగం డైరెక్టర్‌ ప్రతిపాదించే వ్యక్తి, డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి, సీనియర్‌ జర్నలిస్టు పి.సాయినాథ్, వ్యవసాయ ఇన్‌పుట్‌ సరఫరాదారులు నిర్ణయించే ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి పేరిట సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైస్‌ చైర్మన్‌తో సంప్రదింపుల అనంతరం మెంబర్‌ సెక్రటరీ దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యాలయం, సిబ్బంది తదితరాలను సమకూర్చుతారు. మిషన్‌ రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌ వ్యవహారాలను కూడా ఆయనే చూస్తారు. అవసరాన్ని బట్టి ఏర్పాటయ్యే జోనల్, జిల్లా స్థాయి మిషన్లతో అగ్రికల్చరల్‌ మిషన్‌ సమన్వయం చేస్తుంది. పనితీరు ఎలా ఉండాలనే దానిపై వేరుగా మార్గదర్శకాలను జారీ చేస్తారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఇందుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను తీసుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement