మాఫీ ఆట..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వ్యవసాయ రుణమాఫీలో ఇప్పటి వరకు పలు రకాల కారణాలు, నిబంధనలతో కాలయాపన చేసిన ప్రభుత్వం..తాజాగా మరో మెలిక పెట్టింది. పంట రుణపరిమితికి మించి రుణాలు ఎలా ఇచ్చారంటూ బ్యాంకర్లను ప్రశ్నించింది. వరిపంట వేస్తే ఎకరాకు గరిష్టంగా రూ.22 వేలు ఇవ్వాల్సి ఉండగా లక్షల రూపాయలు ఎలా ఇచ్చారని బ్యాంకులను నిలదీస్తోంది.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు మించి బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, రుణమాఫీ అర్హత జాబితాను సరిచేసి పంపాలని, ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకర్లు అర్హతకు మించి రుణాలు ఇచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కేందుకు రకరకాల ఎత్తు లు వేస్తున్నారు.
అమలు చేస్తున్నామని చెప్పుకునేందుకు రకరకాల నిబంధనలతో రైతులను అనర్హులుగా పరిగణించి మొక్కుబడిగా కొందరికి మాత్రం చేతులు దులుపుకునేందుకు సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే రకరకాల కొర్రీలతో వేలాది మంది రైతులను అనర్హుల జాబితాలో చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో మరో కొత్త నిబంధనకు తెరతీసి మరి కొందరిని ఏరివేసే పనిలో పడింది. అదే విధంగా బంగారు కుదువ పెట్టిన రైతులకు కొందరు బ్యాంకర్లు బంగారం విలువ ఆధారంగా లక్ష వరకు రుణాన్ని మంజూరు చేశాయి. అయితే అంత రుణం మంజూరు చేసినా రుణమాఫీ పరిధిలోకి తీసుకోబోమని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంత రుణం ఇవ్వాలో అంతకే తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులన్నీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన కింద ఎంత మందికి ఇచ్చారో తెలిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అర్హతకు మించి ఇచ్చి ఉంటే అనర్హులే:
అర్హుల జాబితాను కుదించటమే లక్ష్యంగా ప్రభుత్వం రకరకాల నిబంధనలు విధిస్తోంది. ఇందులో భాగంగా నాలుగో సారి స్కేల్ ఆఫ్ పైనాన్స్ పద్ధతిని తెరమీదుకు తెచ్చింది. అర్హతకు మించి రుణాలు ఇచ్చి ఉంటే.. వారందరినీ అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అదే జరిగితే జిల్లా వ్యాప్తంగా 25శాతం మంది రైతులు అనర్హులుగా తేలే అవకాశం ఉందని అధికారలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ధర్నాలకు పిలుపు ఇవ్వటంతో టీడీపీ సర్కారు రుణమాఫీ అర్హుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రకటిస్తే అనర్హులంతా ఒక్కటవుతారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాకు మరింత బలం పెరుగుతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.