వ్యవసాయ రుణమాఫీ ఆచరణ సాధ్యం కాదు
లోక్‌సత్తా అధినేత జేపీ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణమాఫీ అనేది ఆచరణ సాధ్యం కాదని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల జీవన విధానం మ రింత గందరగోళం లో పడుతుందని, అంతేగాక వీటికి ఆర్‌బీఐ కూడా ఒ ప్పుకోదని ఆయన స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి హామీల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని జేపీ సూచించారు. అయితే ఇలాంటి హామీలను ప్రకటించే పార్టీల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలే తప్ప.. న్యాయస్థానాలకు వెళ్లినా ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే)ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో జేపీ మాట్లాడారు. రాష్ట్రంలోని కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ను ఇక్కడి అవసరాలకు కేటాయించాలని పట్టుబట్టడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను రిలయన్స్ గుజరాత్‌కు తరలించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. కేజీ బేసిన్ నుంచి వెలికితీసే గ్యాస్‌ను నిలువ చేసేందుకు రాష్ట్రంలో గ్రిడ్స్ లేనందునే రిలయన్స్ గుజరాత్‌కు తరలిస్తోందని, అక్కడ ఏడు గ్రిడ్లు ఉన్నాయని చెప్పారు. ఏపీలో లభించే గ్యాస్‌ను స్థానికంగా ఉపయోగించుకోవడంలో పాలకుల వైఫల్యముందన్నారు.
అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న విషయాన్ని విలేకరులు గుర్తుచేయగా.. అయితే బాబు ఒక్కరిదే వైఫల్యం ఉందని తాను చెప్పలేనని జేపీ బదులిచ్చారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో ఓట్లు చీలకూడదన్న భావనతోనే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడానికి, ప్రత్యర్థి పార్టీలపై దుష్ర్పచారం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు రూ.300 నుంచి 400 కోట్లదాకా ప్యాకేజీలు వసూలు చేశాయని జేపీ ఆరోపించారు.