అధికారుల సామూహిక సెలవు
బదిలీలపై ట్రిబ్యునల్ స్టే?
కమిషనర్‌ను కలిసిన ప్రతినిధులు
వరంగల్, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల బదిలీలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తొలిసారి ఈ శాఖలోని ఐదవజోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 61 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మంది ఏడీఎలు, 52 మంది ఏవోలు ఉన్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులు శుక్రవారం సామూహిక సెలవుపెట్టారు. సంఘాల ప్రతినిధులు వ్యవసాయశాఖ కమిషనర్‌ను కలిసేందుకు హెదరాబాద్‌కు వెళ్లారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను వ్యవసాయశాఖకు వర్తింపచేయడం చర్చనీయాంశంగా మారింది.
ట్రిబ్యునల్ స్టే?
సీమాంధ్ర అధికారుల తీరు వల్లనే తెలంగాణ ప్రాంతంలోనే ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. దీనిపై కొందరు అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో శుక్రవారం బదిలీలను నిలిపివేస్తూ స్టే ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఈ బదిలీలపై వ్యవసాయశాఖకు సంబంధించిన మూడు సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌కు వెళ్లి వ్యవశాయశాఖ కమిషనర్ మధుసూదన్‌రావును శుక్రవారం కలిశారు. బదిలీల తీరుపై కమిషనర్‌కు వివరించారు. తెలంగాణ పరిధిలోని ఒక్క ఐదవజోన్ పరిధిలోనే బదిలీలు చేయడం ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.
ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చి బదిలీల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. కమిషనర్ మధుసూదన్‌రావును కలిసిన వారిలో తెలంగాణ వ్యవసాయశాఖ డాక్టర్ల సంఘం ప్రతినిధులు నర్సింగం, శ్రీనాథ్, ప్రదీప్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ప్రతినిధులు సురేష్, శ్రీనివాస్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ప్రతినిధులు అనురాధ, కృష్ణారెడ్డి, భద్రయ్యతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.