
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల్లో నానాటికి సహనం సన్నగిల్లుతోందని అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడేళ్లగా అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర కష్టాలను భరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎస్సెల్ గ్రూప్ అఫిడవిట్ తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లాలో కోటేశ్వరరావు అనే కస్టమర్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన వెల్లడించారు. రేపు (శనివారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవబోతున్నట్లు చెప్పారు. బాధితల కోసం తక్షణమే రూ.3965 కోట్ల రూపాయలు విడుదల చేయాలన్నారు.
ఈ నెల 25న కోర్టులో సమర్పించే అఫిడవిట్‌లో, కోర్టు అనుమతించిన విధానంలోనే ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేయాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కోర్టు నుంచి అనుమతి తీసుకొని ఆస్తుల విక్రయ బాద్యతను ప్రభుత్వమే స్వీకరిస్తామని అఫిడవిట్ వేయాలంటూ సూచించారు. హైకోర్టు సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి సత్వర న్యాయం జరిగేలా చూడాలంటూ కోరారు. పరివార్, టేకు చెట్ల పథకాల్లోని ఆస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. నేటికి కూడా చాలా మంది బాధితులు ఇంకా ఆన్‌లైన్ చేయించుకోలేదని వారికోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. లక్షల కుటుంబాలకు అన్యాయం చేసి అరెస్టుకాకుండా బయట తిరుగుతున్న అవ్వా కుటుంబ సభ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితుల న్యాయం కోసం 16నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 16న ఎమ్మార్వోలకు వినతిపత్రాలు, 23న ధర్నాలు, ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. 25న కోర్టులో బాధితులకు అనుకూలంగా అఫిడవిట్ వేయాలని, లేని పక్షంలో మే మొదటి వారంలో ఛలో సెక్రటేరియట్ చేపడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకూ శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపామని చెప్పిన ఆయన, న్యాయం జరగకపోతే ఉద్యమం మరో రూపం దాల్చుతుందంటూ హెచ్చరించారు. ఎస్సెల్ గ్రూప్ చైర్మెన్‌పై వత్తడి తెచ్చి వెనక్కి వెళ్లేలా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అప్పుల కన్నా ఆస్తులు తక్కువ అనేది అవాస్తవమని నాగేశ్వరరావు అన్నారు.