సాక్షి విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నా, బాధితులకు ఇప్పటివరకూ పరిహారం ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆదేశాలతో నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సందరర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏజెంట్లు, డిపాజిట్‌దారుల ఆత్మహత్యలు తదితర అంశాలపై ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారన్నారు.
‘బాధితులు, ప్రతినిధుల మనోభావాలను కూడా తెలుసుకున్నాం. దేశవ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలు అగ్రిగోల్డ్ బాధితులుగా ఉన్నారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు అసెంబ్లీ సమావేశాలకు ముందు పెద్ద ఎత్తున
ఆందోళనలు చేశారు. వైఎస్ జగన్ కూడా బాధితులకు అండగా నిలిచారు. ఇప్పటికే 170మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల మేరకు నష్టపరిహారం చెల్లించాలి. అలాగే బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలి. జీవో ఇచ్చి ఏడు నెలలు గడుస్తున్నా కేవలం రెండు కుటుంబాలకే పరిహారం ఇవ్వడం బాధాకరం. మిగిలిన కుటుంబాల గోడు ప్రభుత్వానికి పట్టదా?. చెల్లింపుల కన్నా అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కువ అని సీఐడీ ప్రకటించింది. చెల్లింపులు రూ.7వేల కోట్లు ఉంటే, ఆస్తులు 35వేల కోట్లు అని సీఐడీ ప్రకటించింది. ప్రభుత్వం ఆస్తులను గ్యారెంటీగా తీసుకుని ముందస్తు చెల్లింపులు చేయాలి. కోర్టులు కూడా అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది.
ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులకు అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్ను ఉండటం వల్లే ఆస్తుల వేలం ప్రక్రియ వేగంగా జరగడం లేదు. రాష్ట్రంలోని 20 లక్షలమందికి న్యాయం జరగాలి. ప్రతి జిల్లాకు వైఎస్‌ఆర్ సీపీ ప్రతినిధి బృందం వెళుతుంది. అందరినీ కలుస్తాం. ధైర్యం చెబుతాం. ప్రభుత్వం మెడలు వంచి న్యాయం చేసే వరకూ పోరాడతాం. చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు పోస్ట్‌మార్టం నివేదిక కావాలని వేధిస్తున్నారు. డబ్బు కోసం ఎవరైనా తమ వారి చావును తప్పుగా చెబుతారా? ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి. అగ్రిగోల్డ్ ఆస్తులను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం ఆ పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే, సమస్యను పరిష్కరిస్తుంది.
న్యాయస్థానం పరిధిలో జరుగుతున్న ఆస్తుల వేలంతో పాటు దర్యాప్తును కూడా కోర్టు పరిధిలోకి తేవాలి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయ సహాయాన్ని కూడా అందిస్తాం. అవసరం అయితే కోర్టులో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. అగ్రిగోల్డ్ బాధితుల కోసం పనిచేసే అన్ని సంఘాలతో కలిసి పోరాడతాం.’ అని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డి, సభ్యులు కె.పార్థసారధి, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, కొట్టముడి సురేష్ బాబు, గౌరు వెంకటరెడ్డి, కురసాల కన్నబాబు, టీజేఆర్ సుధాకర్ బాబు, ముదునూరు ప్రసాదరాజు, మజ్జి శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా బొత్స సత్యనారాయణ, వెన్నపూస వేణుగోపాలరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment