పోలాకి: థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలపరిశీలన జరుపుతున్న జపాన్ బృందానికి మృతి చెందిన ఆలివ్ రిడ్లే తాబేలు అపశకునం పలికింది. దాన్ని గమనించిన సభ్యులు దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్రిటికల్(ఇది అత్యంత సున్నిత ప్రాంతం) అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిల్లాలో 4వేల మెగావాట్ల ఆల్ట్రామెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి స్ధల పరిశీలన చేస్తున్న జపాన్‌కు చెందిన సుమిటొమొ సంస్థ ప్రతినిధుల బృందం రెండో రోజైన బుధవారం పోలాకి మండలంలో పర్యటించింది. ఈ బృందానికి ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులతో పాటు స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఇక్కడి భూముల వివరాలు, స్ధితిగతుల గూర్చి వివరించారు.
ముందుగా చీడివలస, ఓదిపాడు, గవరంపేట, చెల్లాయివలసల్లోని మెట్టు భూములను పరిశీలించిన బృందం సభ్యులు అనంతరం కొత్తరేవు పంచాయతీలోని కొవిరిపేట సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడ నీటి సాంధ్రత, ఉప్పు శాతంతో పాటు ప్రతిపాదిత ప్లాంట్ స్థలానికి గల దూరంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తీరంలో పడి ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు కళేబరాన్ని గమనించి ‘దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్రిటికల్’ అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక జాతికి చెందిన ఈ తాబేళ్ల మనుగడపై అంతర్జాతీయస్ధాయిలో ఒత్తిడి ఉంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
అనంతరం తోటాడ సమీపంలోని సన్యాసిరాజుపేట గుట్టలను పరిశీలించారు. అక్కడి ఉష్ణోగ్రత, సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తులో ఉందన్న సమాచారం సేకరించారు. రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీ, నీటి వసతి బాగున్నాయని రెవెన్యూ, జెన్‌కో అధికారులు మ్యాప్ ఆధారంగా జపాన్ బృందానికి వివరించారు. అక్కడి నుంచి జోగంపేట తీరానికి వెళ్లారు. అక్కడి సౌకర్యాలు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. వీరి వెంట ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఈఈలు కె.మూర్తి, సీవీ రంగనాగన్, రాజకుమార్, రామక్రిష్ణ, తహశీల్దార్ జె.రామారావు, తదితరులు ఉన్నారు.
గట్టి బందోబస్తు
జపాన్ బృందం పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు ఆధ్వర్యంలో నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, పోలాకి ఎస్‌ఐ సత్యనారాయణలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలాకి పోలీస్ సిబ్బందితో పాటు మరో 50 మంది బలగాలను ఈదులవలస జంక్షన్‌లో మోహరించారు.
అమ్మో.. ఇది కష్టాల తీరం!
Published Thu, Mar 5 2015 1:00 AM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM
Advertisement
Advertisement