శంషాబాద్, న్యూస్‌లైన్: కనీస వేతనాలు పెంచాలంటూ శంషాబాద్ విమానాశ్రయంలోని ‘స్కై గవర్‌మెట్’ ఆహార సంస్థకు చెందిన సుమారు 180 మంది సిబ్బంది ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆందోళన దిగారు. పలు ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెందిన విమానాలకు ఆహారాన్ని సరఫరా చేసే ఈ సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని ఆదివారం సిబ్బంది యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం నిరాకరించడంతో అదే రోజు అర్ధరాత్రి సంస్థ గేటు ఎదుట బైఠాయించారు.
దీంతో పోలీసులు అక్కడి నుంచి వారిని పంపించేశారు. సోమవారం ఉదయం బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ నందకిశోర్, సీఐటీయూ రాజేంద్రనగర్ నాయకులు సత్యనారాయణరెడ్డి, మల్లేష్‌ల ఆధ్వర్యంలో కార్మికులు శంషాబాద్ తహసీల్దార్ లచ్చిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. విమానాశ్రయంలోని అనేక కాంట్రాక్టు సంస్థలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలను అమలు చేయకుండా సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని కార్మికులు తెలిపారు. అక్కడి నుంచి కార్మికులు యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఎయిర్‌పోర్టులోని స్కైగవర్‌మెట్ కార్యాలయానికి వెళ్లారు. తొలుత కార్మికులతో మాట్లాడడానికి యాజమాన్యం నిరాకరించడంతో గేటు ఎదుట బైఠాయించి తమ ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిలిచిపోయిన ఆహార సరఫరా
కార్మికులు స్కై గవర్‌మెట్ సంస్థ గేటులోంచి వాహనాల రాకపోకలకు అడ్డుకోవడంతో విమానాల్లోని ప్రయాణికుల కోసం సరఫరా చేసే ఆహారం నిలిచిపోయింది. దీంతో కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందస్తుగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేముందే ఆహారాన్ని డబుల్ పార్సిల్స్ తీసుకొచ్చే పరిస్థితి తలెత్తింది. కొన్ని విమానాలకు స్కైచెఫ్ సంస్థ నుంచి ఆహారాన్ని సరఫరా చేశారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుండడంతో శంషాబాద్ జోన్ ఇన్‌చార్జి డీసీపీ నారాయణ, ఏసీపీ భద్రేశ్వర్, సీఐ దుర్గాప్రసాద్‌లు కార్మికులతో మాట్లాడారు. సంస్థకు సంబంధించిన వాహనాల రాకపోకలకు పునరుద్ధరించారు. స్కై గవర్‌మెంట్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.
ఎయిర్‌పోర్టులో ప్రైవేట్ సంస్థ సిబ్బంది ఆందోళన
Published Tue, Dec 10 2013 6:59 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement