విజయనగరం టౌన్: చోరీకి గురైన ఏకే 47 గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని హైదరాబాద్ నుంచి ఒడిశా తరలిస్తున్న వాహనంలో ఈవీఎంలకు రక్షణగా ఉన్న ఒడిశా కానిస్టేబుల్‌కు చెందిన ఏకే 47 గన్ అక్టోబర్ 12వ తేదీ రాత్రి పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విజయనగరం పోలీసులు నిందితులు సంజూరాం సిందూ, నగేష్ సిందూలను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఏకే 47 గన్, ఆరు తూటాలు, రాయికట్టిన ఒక జంగిల్ షూ, నాలుగు సెల్‌ఫోన్స్, కాల్చిన ఒక షెల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ జి.పాలరాజు శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
అసలేం జరిగింది...
హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ నుంచి ఎన్నికల మెటీరీయల్‌ను ఒడిశా తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్రంలోని డెంకనాల్ జిల్లా నుంచి అభిమన్యు సాహు అనే రిజర్వ్ కానిస్టేబుల్, తదితరులు వాహనాలకు బందోబస్తుగా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరందరూ ఏకే 47 గన్‌లతో సామగ్రికి రక్షణగా ఉన్నారు. ఆరు కంటైనర్లలో సరుకు తీసుకువస్తూ అక్టోబర్ 11న డెంకాడ మండలం నాతవలస జంక్షన్‌కు చేరుకున్నారు. రాత్రి 1.30 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్‌లో బ్యాగ్‌తో ఉన్న ఏకే 47 వాహనం దొంగిలించుకుపోయారు. దీంతో బాధితుడు అభిమన్యు సాహు ఫిర్యాదుతో మేరకు డెంకాడ పోలీసులు అక్టోబర్ 13న కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
మిగతా బుల్లెట్లేవీ..?
బ్యాగ్‌లో ఏకే 47 రైఫిల్ బట్ నంబర్ 2తో మ్యాగ్‌జైన్ విత్ 30 రౌండ్స్ బుల్లెట్స్, మొబైల్ ఫోన్, పెయిర్ జంగిల్ షూ, సివిల్ షూ, టీషర్ట్, ప్యాంట్స్, తదితర వస్తువులున్నాయి. అయితే ప్రస్తుతం ఏకే 47 గన్ బట్ నంబర్ 2 దొరికింది. మ్యాగజైన్ కనబడలేదు. 30 రౌండ్ల బుల్లెట్లకు గాను కేవలం 6 రౌండ్లు బుల్లెట్లు మాత్రమే దొరికాయి. ఒక జంగిల్ షూ రాయికి కట్టిఉంది. నాలుగు సెల్‌ఫోన్‌లు, కాలిపోయిన మరో సెల్‌ఫోన్ దొరికాయి.
ఇలా ఛేదించారు....
ఏకె 47 కనిపించకుండా పోయిందన్న విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో అనేకమందిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో తమకు లభించిన కీలక సమాచారం మేరకు నాతవలస జంక్షన్ వద్ద ఇటీవల వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మహరాష్ట్ర, గుజరాత్‌కు చెందిన సంజురాం సిందూ, నగేష్ సిందూలుగా గుర్తించారు. తాము బతుకుదెరువు కోసం విజయనగరం వచ్చామని, ఎ.రావివలస వద్ద టెంట్లు వేసుకుని ఉంటున్నట్లు నిందితులు తెలిపారు. అక్టోబర్ 12న నాతవలస జంక్షన్ వద్ద ఆగిఉన్న కంటైనర్ లారీలో చోరీకి పాల్పడినట్లుగా అంగీకరించారు. దీంతో వారి నుంచి ఏకే 47 గన్, ఆరు తుటాలు, రాయి కట్టిన ఒక జంగిల్ షూ, నాలుగు సెల్ ఫోన్‌లతో పాటు కాల్చిన మరో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
నేరస్తుల గత చరిత్ర...
నేరస్తులలో ఏ1గా ఉన్న మహారాష్ట్రకు చెందిన సంజూరాం సిందూ, గుజరాత్‌కి చెందిన ఏ2గా ఎరంర నగేష్ సిందూ ఇద్దరూ పార్థీ కులానికి చెందిన వారు. వీరిద్దరూ బంధువులు. జాతీయ రహదారిపై ఆగిఉన్న వాహనాలలో బ్యాగులు, సామాగ్రి దొంగలిస్తుంటారు. సుమారు పదేళ్ల కిందట వీరి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చి శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడ, చిలకపాలెం, కోష్ట... విజయనగరం జిల్లాలో నాతవలస, ఎ.రావివలస వద్ద... విశాఖ జిల్లాలో తగరపువలస, ఆనందపురం వద్ద టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీస్తుంటారు. ఆగిఉన్న వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతూ, తరచూ తమ నివాసాలు మారుస్తుంటారు.
నగదు రివార్డు
ఈ కేసులో త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ పాలరాజు అభినందించారు. అలాగే 25 వేల రూపాయల నగదు రివార్డు కూడా ప్రకటించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు, విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రావణ్‌కుమార్, భోగాపురం సీఐ రఘువీర్‌విష్ణు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు వైవీ శేషు, జి.రామకృష్ణ, డెంకాడ ఎస్సై జీఏవీ రమణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment