vizinagaram district
-
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నప్పలనాయుడు పేరు ఖరారు
-
అశోక్ గజపతిరాజు హుందాగా వ్యవహరించాలి:మంత్రి వెల్లంపల్లి
-
దేవుడి ఆలయాన్ని సర్కస్ కంపెనీ అంటారా..?: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు వీరంగం సృష్టించడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్‌గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం) -
కలువరాయి పోస్టాఫీస్‌లో నిధుల స్వాహా...?
బొబ్బిలి రూరల్: మండలంలోని కలువరాయి పోస్టాఫీసు లో వివిధ ఖాతాల్లో జమచేసిన మొత్తం స్వాహా అయినట్టు తెలుస్తోంది. దీనికి బీపీఎం లక్ష్మణరావే బాధ్యుడని గుర్తించి ఈ నెల 8న సస్పెండ్ చేశారు. ఇప్పటికే రూ. 54వేలు రికవరీ చేయగా... ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కలువరాయి పోస్టాఫీసు పరిధిలో కలువరాయి, వాకాడవలస, ముత్తాయవలస, కుమందానపేటలున్నాయి. 256 ఎస్బీ ఖాతాలు, 88 సుకన్య సమృద్ధి యోజన, 408 రికరింగ్ డిపాజిట్లు, 30 వరకూ గ్రామీణ తపాలా ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీన సుకన్య సమృద్ధి యోజ న లబ్ధిదారు ఒకరు బొబ్బిలిలో తన ఖాతా అప్డేట్ చేసినపుడు తేడా రావడంతో బీపీఎం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ ఆదేశాల మేర కు బొబ్బిలి మెయిన్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.గౌతంకుమార్ విచారణ చేపట్టారు. ఆయన పలు ఖాతాలు చెక్‌చేయగా, పాస్‌పుస్తకాల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు గుర్తించారు. మరోవైపు ఖాతాదారులు డిపాజిట్ చేయడానికి వేసిన సొమ్ము ఆలస్యంగా జమ అయినట్లు గుర్తించారు. ఇంకా కొన్ని ఖాతాలు చెక్ చేయాల్సి ఉంది. ముత్తాయవలసలో సుమా రు 30ఖాతాలు ఇంకా పరిశీలించలేదు. బీపీఎం లక్ష్మణరావు గతంలోనే కొన్ని ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ప్రస్తు తం పోస్టాïఫీసులో ఇన్‌ఛార్జ్‌గా మరో బీపీఎంను పోస్టల్ అధికారులు నియమించారు. గ్రామస్తులు లక్ష్మణరావుకు అనుకూలంగా ఉండడంతో విషయం బయటకు పొక్కడంలేదు. దీనిపై లక్ష్మణరావు సాక్షితో మాట్లాడుతూ అక్రమాలు ఏవీ లేవని, రాజకీయ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తు అధికారి, బొబ్బిలి పోస్టల్ ఇన్స్పెక్టర్ టి.గౌతంకుమార్ సాక్షితో మాట్లాడుతూ బీపీఎంపై ఆరోపణలు రావడం వాస్తవమేనని, ఆతనిని ఈ నెల 8న సస్పెండ్ చేశామని, రూ. 54వేలు రికవరీ చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
ఏకే 47 లభ్యం..
విజయనగరం టౌన్: చోరీకి గురైన ఏకే 47 గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని హైదరాబాద్ నుంచి ఒడిశా తరలిస్తున్న వాహనంలో ఈవీఎంలకు రక్షణగా ఉన్న ఒడిశా కానిస్టేబుల్‌కు చెందిన ఏకే 47 గన్ అక్టోబర్ 12వ తేదీ రాత్రి పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విజయనగరం పోలీసులు నిందితులు సంజూరాం సిందూ, నగేష్ సిందూలను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఏకే 47 గన్, ఆరు తూటాలు, రాయికట్టిన ఒక జంగిల్ షూ, నాలుగు సెల్‌ఫోన్స్, కాల్చిన ఒక షెల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ జి.పాలరాజు శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది... హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ నుంచి ఎన్నికల మెటీరీయల్‌ను ఒడిశా తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్రంలోని డెంకనాల్ జిల్లా నుంచి అభిమన్యు సాహు అనే రిజర్వ్ కానిస్టేబుల్, తదితరులు వాహనాలకు బందోబస్తుగా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరందరూ ఏకే 47 గన్లతో సామగ్రికి రక్షణగా ఉన్నారు. ఆరు కంటైనర్లలో సరుకు తీసుకువస్తూ అక్టోబర్ 11న డెంకాడ మండలం నాతవలస జంక్షన్‌కు చేరుకున్నారు. రాత్రి 1.30 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్‌లో బ్యాగ్‌తో ఉన్న ఏకే 47 వాహనం దొంగిలించుకుపోయారు. దీంతో బాధితుడు అభిమన్యు సాహు ఫిర్యాదుతో మేరకు డెంకాడ పోలీసులు అక్టోబర్ 13న కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మిగతా బుల్లెట్లేవీ..? బ్యాగ్‌లో ఏకే 47 రైఫిల్ బట్ నంబర్ 2తో మ్యాగ్జైన్ విత్ 30 రౌండ్స్ బుల్లెట్స్, మొబైల్ ఫోన్, పెయిర్ జంగిల్ షూ, సివిల్ షూ, టీషర్ట్, ప్యాంట్స్, తదితర వస్తువులున్నాయి. అయితే ప్రస్తుతం ఏకే 47 గన్ బట్ నంబర్ 2 దొరికింది. మ్యాగజైన్ కనబడలేదు. 30 రౌండ్ల బుల్లెట్లకు గాను కేవలం 6 రౌండ్లు బుల్లెట్లు మాత్రమే దొరికాయి. ఒక జంగిల్ షూ రాయికి కట్టిఉంది. నాలుగు సెల్ఫోన్లు, కాలిపోయిన మరో సెల్‌ఫోన్ దొరికాయి. ఇలా ఛేదించారు.... ఏకె 47 కనిపించకుండా పోయిందన్న విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో అనేకమందిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో తమకు లభించిన కీలక సమాచారం మేరకు నాతవలస జంక్షన్ వద్ద ఇటీవల వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మహరాష్ట్ర, గుజరాత్‌కు చెందిన సంజురాం సిందూ, నగేష్ సిందూలుగా గుర్తించారు. తాము బతుకుదెరువు కోసం విజయనగరం వచ్చామని, ఎ.రావివలస వద్ద టెంట్లు వేసుకుని ఉంటున్నట్లు నిందితులు తెలిపారు. అక్టోబర్ 12న నాతవలస జంక్షన్ వద్ద ఆగిఉన్న కంటైనర్ లారీలో చోరీకి పాల్పడినట్లుగా అంగీకరించారు. దీంతో వారి నుంచి ఏకే 47 గన్, ఆరు తుటాలు, రాయి కట్టిన ఒక జంగిల్ షూ, నాలుగు సెల్ ఫోన్లతో పాటు కాల్చిన మరో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నేరస్తుల గత చరిత్ర... నేరస్తులలో ఏ1గా ఉన్న మహారాష్ట్రకు చెందిన సంజూరాం సిందూ, గుజరాత్‌కి చెందిన ఏ2గా ఎరంర నగేష్ సిందూ ఇద్దరూ పార్థీ కులానికి చెందిన వారు. వీరిద్దరూ బంధువులు. జాతీయ రహదారిపై ఆగిఉన్న వాహనాలలో బ్యాగులు, సామాగ్రి దొంగలిస్తుంటారు. సుమారు పదేళ్ల కిందట వీరి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చి శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడ, చిలకపాలెం, కోష్ట... విజయనగరం జిల్లాలో నాతవలస, ఎ.రావివలస వద్ద... విశాఖ జిల్లాలో తగరపువలస, ఆనందపురం వద్ద టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీస్తుంటారు. ఆగిఉన్న వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతూ, తరచూ తమ నివాసాలు మారుస్తుంటారు. నగదు రివార్డు ఈ కేసులో త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ పాలరాజు అభినందించారు. అలాగే 25 వేల రూపాయల నగదు రివార్డు కూడా ప్రకటించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు, విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రావణ్‌కుమార్, భోగాపురం సీఐ రఘువీర్‌విష్ణు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు వైవీ శేషు, జి.రామకృష్ణ, డెంకాడ ఎస్సై జీఏవీ రమణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తిత్లీ విధ్వంసం
అంతా అనుకున్నట్టే తిత్లీ తీవ్రంగానే విధ్వంసం సృష్టించింది. తీరం దాటేముందు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలను నేలకూల్చింది. పలు ఇళ్లపై ప్రభావం చూపింది. వర్షప్రభావం అంతగా లేకపోయినా... వీచిన ఈదురు గాలులే కొంపముంచాయి. ముఖ్యంగా అరటి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక పత్తి, వరి పంటలూ అక్కడక్కడ దెబ్బతిన్నాయి. విద్యుత్‌సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి జనం అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాలకు బస్సులు, రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయనగరం గంటస్తంభం: తిత్లీ తుఫాన్ గడచిన మూడురోజులుగా జిల్లాపై ప్రభావం చూపుతోంది. దీనిపై అధికార యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ పంటల నష్టాన్ని నివా రించడంలో విఫలమయ్యారు. తుఫాన్ కేవలం చినుకులకే పరిమితమైనా ఈదురుగాలులు మాత్రంగా బలంగా వీయడంతో రైతులు ఆందోళన చెందారు. వారి ఆందోళనకు తగ్గట్టుగానే నష్టాలు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి సముద్ర తీరప్రాంతంలో అలల తాకిడి తగ్గి సముద్రం వెనక్కి వెళ్లింది. గురువారం అంతలోనే తెల్లారి ఝామున 3గంటల సమయంలో తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో తీరందాటింది. ఈ ప్రభావం జిల్లాలో తీవ్ర నష్టానికి కారణమైంది. 30.6మిల్లీమీటర్లు వర్షపాతం తుఫాన్ ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం 3గంటల వరకు జిల్లాలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి. మొత్తం గా అన్ని మండలాల్లో కలిపి సగటున 30.6మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఆనుకుని ఉన్నవి, ఒడిశాకు సమీపంలో ఉన్న ఏజెన్సీ మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి. కురుపాంలో అత్యధికంగా 112.8మిల్లీమీటర్లు, బలిజిపేటలో 99.6, కొమరాడలో 92.4, పార్వతీపురంలో 44.3, తెర్లాంలో 61.3, గుమ్మలక్ష్మీపురంలో 62.1, జియ్యమ్మవలసలో 51.6, గరుగుబిల్లిలో 46.3, మెరకముడిదాంవలో 55.4, బొబ్బిలిలో 35.3, సీతానగరంలో 33.3 మిల్లీమీటర్లు పడింది. మిగతా మండలాల్లో అన్ని చోట్లా వర్షాలు పడగా 10 నుంచి 30మిల్లీమీటర్లు లోపే నమోదైంది. వర్షం బాగా పడిన మండలాల్లో వరిపంటకు వారంరోజులపాటు ఊపిరి వచ్చినట్లే. తుఫాన్ మూలంగా అయినా భారీ వర్షాలు, ఎక్కువ రోజులు పడతాయని, ప్రస్తుతానికి నీరు పంటపొలాల్లో చేరి పంటకు జీవం రావడమేకాకుండా నీటివనరుల్లో నీరు చేరి పంటకు పూర్తి భరోసా వస్తుందని ఆశించిన రైతులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఈ వర్షం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, పంట చేతికందుతుందన్న నమ్మకం పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం రూ. 31.30కోట్లు తుఫాన్ తీరందాటే సమయంలో గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు వీచాయి. ఈ ప్రభావం పంటలపై పూర్తిగా పడింది. అరటి, చెరకుతోపాటు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి మండలం దేవరపొదిలాం గ్రామంలో 50 ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. 20 ఎకరాల్లో చెరకుకు నష్టం వాటిల్లింది. కురుపాం మండలంలో 750 ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. పత్తి పంటకు కూడా భారీ నష్టం వాటిల్లింది. గరుగుబిల్లి మండలంలో ఇప్పలమట్ట, సంతోషపురం, గిజబ, చిలకాం, తోటపల్లి, పారివలస, రావివలస తదితర గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది. పారివలస, బత్తివలస, తోటపల్లి, పెద్దూరు, కొత్తపల్లి, రావుపల్లి గ్రామాల్లో వరి మూడు వేల ఎకరాల్లో నీట మునిగింది. పార్వతీపురంలో సంగం వలస గ్రామంలో చీకటి సత్యనారాయణకు చెందిన ఎకరన్నర అరటి తోట నేలకొరిగింది. ఈ విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా 2500హెక్టార్లులో అరటిపంట విరిగి నేలమట్టమైంది. 308 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న నేలకొరిగి దెబ్బతింది. ఈ పంటల నష్టం విలువ రూ.31.30కోట్లు ఉంటుంది. మత్స్యకారులు గల్లంతు తుఫాన్ కారణంగా వచ్చిన సముద్రపు అలలు తాకిడికి జిల్లా తీరప్రాంతంలో ఎటువంటి ముప్పు వాటిల్లకపోయినా 15 రోజుల క్రితం విశాఖ నుంచి పూసపాటిరేగ మండలానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు ఒడిశాలోని రామయ్యపట్నం సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్లగా బోటు బోల్తా పడి అందులో ముగ్గురు గల్లంతు కాగా మిగిలిన ముగ్గురు సురక్షితంగా ఇంటికి చేరారు. గల్లంతైనే వారిలో పూసపాటిరేగ మండలంలోని పతివాడ బర్రిపేటకు చెందిన సారి రాము(23), మైలపల్లి లక్ష్మణరావు(45) తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తెయ్య(22) ఉన్నారు. ఏజెన్సీలో గాలులకు 50 ఇళ్ల పైకప్పులు ఎరిగి పడ్డాయి. కచ్చాఇళ్లతోపాటు రేకుల షెడ్లు పాడయ్యాయి. పరిస్థితి గమనించి ముందే అధికారులు ఖాళీ చేయించినా ప్రస్తుతం వారంతా అవాసం లేక ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు పలు చోట్ల నేలకొరిగాయి. వైర్లు తెగిపడ్డాయి. దీనివల్ల విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కొన్ని మండలాల్లో దెబ్బతిని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కురుపాం మండలంలో విద్యుత్ సరఫరా మూడు రోజులుగా నిలిచిపోయింది. జియ్యమ్మవలస, కొమరాడలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడక్కడ చెట్లు పడిపోవడంతో పార్వతీపురం మండలంలో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. -
యువకుడి దారుణ హత్య..?
ప్రశాంతంగా ఉండే డెంకాడ మండలం ఉలిక్కిపడింది. పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేట సమీపంలో ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. మృతుడి తలపై తీవ్రగాయాలు ఉండడంతో ఎవరో హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగకపోవడం.. ఒక్కసారిగా హత్య జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజయనగరం / డెంకాడ: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ ఊడికిలపేట గ్రామ సమీపంలో విజయనగరం–కుమిలి ఆర్అండ్బీ రహదారికి ఆనుకుని ఉన్న ఒక లే అవుట్‌కు వెళ్లే దారిలో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉంది. దీంతో సమీప గ్రామప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ మృతదేహాన్ని నెల్లిమర్ల మండలం సతివాడ పంచాయతీ పరిధిలోని ముల్లుపేట గ్రామానికి చెందిన ఆబోతుల శ్రీరామ్(32)దిగా గుర్తిం చారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సతివాడ పంచాయతీ ముల్లుపేట గ్రామానికి చెందిన ఆబోతుల శ్రీరామ్ ఈనెల 12వ తేదీ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సతివాడ కూడలిలో స్నేహితులతో కలిసి ఉన్నారు. అక్కడకు కొద్ది సేపటికి బయటకు వెళ్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిపోయాడు. సమయం మించినా భర్త ఇంటికి చేరుకోకపోవడంతో శ్రీరామ్ భార్య కాంతమ్మ రాత్రి పది గంటల సమయంలో ఫోన్ చేయగా, పనిపై విజయనగరానికి వచ్చానని శ్రీరామ్ బదులిచ్చాడు. అయితే ఫోన్ చేసి గంట దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో భార్య కాంతమ్మ శ్రీరామ్‌కు మళ్లీ ఫోన్ చేసింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీరామ్ లిఫ్ట్ చేయలేదు. మరుచటి రోజు పోలీసులు ఫోన్ చేసి పెదతాడివాడలోని ఊడికిలపేట సమీపంలో శ్రీరామ్ శవమై పడి ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భా ర్య తోపాటు ఇద్దరు పిల్లలు చందన (5), ప్రమీల (3) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు.. శ్రీరామ్ మృతదేహాన్ని విజయనగరం డీఎస్పీ డి. సూర్యశ్రవణ్‌కుమార్, భోగాపురం సీఐ రఘువీర్‌విష్ణు, డెంకాడ ఇన్చార్జ్ ఎస్సై ఉపేంద్ర పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించి వివరాలు ఆరా తీశారు. మృతుడి తలపై తీవ్ర గాయం ఉండడం.. ద్విచక్ర వాహనానికి దూరంగా మృతదేహం పడి ఉండడాన్ని చూస్తుంటే ఎవరో కావాలనే హత్యచేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఆటో డ్రైవర్ మృతుడు శ్రీరామ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ పైడిభీమవరం ప్రాంతంలో ఉన్న కెమికల్ కంపెనీలకు కూలీలను తీసుకువెళ్తుంటాడు. అలాగే ఆయా కంపెనీల్లోని కాంట్రాక్టర్లకు లేబర్ మేస్త్రీగా కూడా వ్యవహరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఎవరితోనైనా విబేధాలు చోటుచేసుకోవడం వల్ల హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
పచ్చగా... ఇసుక దందా!
నారాయణపట్నం కేంద్రంగా ఇసుక అక్రమరవాణా రాత్రివేళలో వందలాది ట్రాక్టర్లు, లారీలతో తరలింపు ఇప్పటికే కొల్లగొట్టిన రూ కోటిన్నర విలువైన ఇసుక ఉచితం ముసుగులో అక్రమాల దందా... కనీసం స్పందించని అధికారులు చీకటిపడితే చాలు అక్కడ వందలాది వాహనాలు సిద్ధమైపోతాయి. ఇసుకను నింపుకుని యథేచ్ఛగా తరలిపోతుంటాయి. అధికారులంటే భయం లేదు... తనిఖీలంటే బెదురు లేదు. ఉచితం అనేసరికి అక్రమానికి లెసైన్స్ ఇచ్చినట్టయింది. తమ్ముళ్ల దందాకు అడ్డూ అదుపు లేకపోతోంది. తాగునీటి పథకాలకు ముప్పువాటిల్లుతున్నా... మనకెందుకులే అనే ధోరణి. నీటి ఊటలకు విఘాతం కలుగుతున్నా... ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య వైఖరి. ఇదీ నెల్లిమర్ల మండలం నారాయణ పట్నంలో సాగుతున్న ఇసుక దందా తీరు... తెన్ను. నెల్లిమర్ల: ‘ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రిస్తాం... ప్రభుత్వం గుర్తించిన రీచ్లనుంచే ఇసుక రవాణాకు అనుమతిస్తాం. తాగునీటి పథకాలున్న ప్రాంతాల్లో ఇసుకను అస్సలు తవ్వనివ్వం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.’ ఇదీ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం చెబుతున్న మాటలు. ఇవేవీ అధికార పార్టీ నేతలకు వర్తించడంలేదు. దీనికి ఉదాహరణ నెల్లిమర్ల మండలంలోని నారాయణపట్నం పరిధిలో సాగుతున్న ఇసుక దందానే. చీకటిపడితే చాలు ఇక్కడ ఇసుక అక్రమరవాణా మొదలవుతుంది. రాత్రివేళల్లో వందలాది ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను రవాణా చేస్తున్నారు. రెండు నెలలుగా సాగుతున్న దందా... నారాయణపట్నం గ్రామపరిధిలోని చంపావతి నదినుంచి రోజూ రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. శ్మశానంలోని ఇసుకను పెద్ద ఎత్తున తవ్వుతున్నారు. ముందుగా తమ ట్రాక్లర్లతో గ్రామంలో పోగులు వేస్తున్నారు. అక్కడినుంచి రాత్రివేళల్లో లారీలు, ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. విశాఖపట్నంనుంచి కూడా పెద్ద ఎత్తున లారీలు ఇక్కడికి ఇసుక కోసం వస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో రాత్రికి సుమారు వంద వాహనాల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తమ్మీద రోజుకు రూ. 2లక్షల విలువ చేసే ఇసుక ఇక్కడి నుంచి తరలిపోతోంది. రెండు నెలలుగానే ఈ దందా సాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తాగునీటి పథకాలకు ముప్పు ప్రస్తుతం ఇసుక అక్రమంగా తవ్వుతున్న ప్రాంతంలోనే రామతీర్ధం మెగా మంచినీటి పథకముంది. ఈ పథకంనుంచే నెల్లిమర్ల, గుర్ల మండలాలతో పాటు గరివిడి మండలానికీ తాగునీరు సరఫరా అవుతోంది. ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగితే ఈ పథకాలు పూర్తిగా పడకేసే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో అధికారులు కల్పించుకుని నారాయణపట్నం ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా నిరోధించాలని పలువురు కోరుతున్నారు. అధికారం అండగా... గ్రామానికి చెందిన అధికారపార్టీ నేతలే ఈ దందాకు పాల్పడుతున్నారు. గతంలోనూ వీరు ఇసుక రవాణాతో కోట్లు గడించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే వారికి వార్నింగ్ ఇస్తారు. ట్రాక్టరుతో గుద్దేస్తామని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వం తమదని, ఎవరైనా ఎదురు తిరిగితే తిప్పలు తప్పవని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. ఒకరిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫిర్యాదు చేసినవారి పేర్లు బయటకు లీకవ్వడంతో వారు కూడా వెనక్కుతగ్గారు. వేరే వాళ్ళకు నో ఛాన్స్ ఇక్కడ ఇసుక తవ్వుకునేందుకు వేరే వాళ్లకు అక్కడి అక్రమార్కులు అనుమతివ్వట్లేదు. తాము మాత్రమే రాత్రివేళల్లో రవాణా చేసుకుంటారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల, గుర్ల మండలాల సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదు. చివరికి విజిలెన్స్ అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడటంలేదని స్థానికులు వాపోతున్నారు. -
చెట్టును ఢీకొన్న లారీ..ఒకరి మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ఓ లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి రూర్కెలాకు లారీలో అమ్మోనియం నైట్రేట్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.