అంతా అనుకున్నట్టే తిత్లీ తీవ్రంగానే విధ్వంసం సృష్టించింది. తీరం దాటేముందు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలను నేలకూల్చింది. పలు ఇళ్లపై ప్రభావం చూపింది. వర్షప్రభావం అంతగా లేకపోయినా... వీచిన ఈదురు గాలులే కొంపముంచాయి. ముఖ్యంగా అరటి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక పత్తి, వరి పంటలూ అక్కడక్కడ దెబ్బతిన్నాయి. విద్యుత్‌సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి జనం అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాలకు బస్సులు, రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విజయనగరం గంటస్తంభం: తిత్లీ తుఫాన్ గడచిన మూడురోజులుగా జిల్లాపై ప్రభావం చూపుతోంది. దీనిపై అధికార యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ పంటల నష్టాన్ని నివా రించడంలో విఫలమయ్యారు. తుఫాన్ కేవలం చినుకులకే పరిమితమైనా ఈదురుగాలులు మాత్రంగా బలంగా వీయడంతో రైతులు ఆందోళన చెందారు. వారి ఆందోళనకు తగ్గట్టుగానే నష్టాలు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి సముద్ర తీరప్రాంతంలో అలల తాకిడి తగ్గి సముద్రం వెనక్కి వెళ్లింది. గురువారం అంతలోనే తెల్లారి ఝామున 3గంటల సమయంలో తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో తీరందాటింది. ఈ ప్రభావం జిల్లాలో తీవ్ర నష్టానికి కారణమైంది.
30.6మిల్లీమీటర్లు వర్షపాతం
తుఫాన్ ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం 3గంటల వరకు జిల్లాలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి. మొత్తం గా అన్ని మండలాల్లో కలిపి సగటున 30.6మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఆనుకుని ఉన్నవి, ఒడిశాకు సమీపంలో ఉన్న ఏజెన్సీ మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి.
కురుపాంలో అత్యధికంగా 112.8మిల్లీమీటర్లు, బలిజిపేటలో 99.6, కొమరాడలో 92.4, పార్వతీపురంలో 44.3, తెర్లాంలో 61.3, గుమ్మలక్ష్మీపురంలో 62.1, జియ్యమ్మవలసలో 51.6, గరుగుబిల్లిలో 46.3, మెరకముడిదాంవలో 55.4, బొబ్బిలిలో 35.3, సీతానగరంలో 33.3 మిల్లీమీటర్లు పడింది. మిగతా మండలాల్లో అన్ని చోట్లా వర్షాలు పడగా 10 నుంచి 30మిల్లీమీటర్లు లోపే నమోదైంది. వర్షం బాగా పడిన మండలాల్లో వరిపంటకు వారంరోజులపాటు ఊపిరి వచ్చినట్లే. తుఫాన్ మూలంగా అయినా భారీ వర్షాలు, ఎక్కువ రోజులు పడతాయని, ప్రస్తుతానికి నీరు పంటపొలాల్లో చేరి పంటకు జీవం రావడమేకాకుండా నీటివనరుల్లో నీరు చేరి పంటకు పూర్తి భరోసా వస్తుందని ఆశించిన రైతులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఈ వర్షం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, పంట చేతికందుతుందన్న నమ్మకం పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట నష్టం రూ. 31.30కోట్లు
తుఫాన్ తీరందాటే సమయంలో గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు వీచాయి. ఈ ప్రభావం పంటలపై పూర్తిగా పడింది. అరటి, చెరకుతోపాటు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి మండలం దేవరపొదిలాం గ్రామంలో 50 ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. 20 ఎకరాల్లో చెరకుకు నష్టం వాటిల్లింది. కురుపాం మండలంలో 750 ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. పత్తి పంటకు కూడా భారీ నష్టం వాటిల్లింది.
గరుగుబిల్లి మండలంలో ఇప్పలమట్ట, సంతోషపురం, గిజబ, చిలకాం, తోటపల్లి, పారివలస, రావివలస తదితర గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది. పారివలస, బత్తివలస, తోటపల్లి, పెద్దూరు, కొత్తపల్లి, రావుపల్లి గ్రామాల్లో వరి మూడు వేల ఎకరాల్లో నీట మునిగింది. పార్వతీపురంలో సంగం వలస గ్రామంలో చీకటి సత్యనారాయణకు చెందిన ఎకరన్నర అరటి తోట నేలకొరిగింది. ఈ విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా 2500హెక్టార్లులో అరటిపంట విరిగి నేలమట్టమైంది. 308 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న నేలకొరిగి దెబ్బతింది. ఈ పంటల నష్టం విలువ రూ.31.30కోట్లు ఉంటుంది.
మత్స్యకారులు గల్లంతు
తుఫాన్ కారణంగా వచ్చిన సముద్రపు అలలు తాకిడికి జిల్లా తీరప్రాంతంలో ఎటువంటి ముప్పు వాటిల్లకపోయినా 15 రోజుల క్రితం విశాఖ నుంచి పూసపాటిరేగ మండలానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు ఒడిశాలోని రామయ్యపట్నం సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్లగా బోటు బోల్తా పడి అందులో ముగ్గురు గల్లంతు కాగా మిగిలిన ముగ్గురు సురక్షితంగా ఇంటికి చేరారు. గల్లంతైనే వారిలో పూసపాటిరేగ మండలంలోని పతివాడ బర్రిపేటకు చెందిన సారి రాము(23), మైలపల్లి లక్ష్మణరావు(45) తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తెయ్య(22) ఉన్నారు. ఏజెన్సీలో గాలులకు 50 ఇళ్ల పైకప్పులు ఎరిగి పడ్డాయి. కచ్చాఇళ్లతోపాటు రేకుల షెడ్లు పాడయ్యాయి. పరిస్థితి గమనించి ముందే అధికారులు ఖాళీ చేయించినా ప్రస్తుతం వారంతా అవాసం లేక ఇబ్బంది పడుతున్నారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు పలు చోట్ల నేలకొరిగాయి. వైర్లు తెగిపడ్డాయి. దీనివల్ల విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కొన్ని మండలాల్లో దెబ్బతిని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కురుపాం మండలంలో విద్యుత్ సరఫరా మూడు రోజులుగా నిలిచిపోయింది. జియ్యమ్మవలస, కొమరాడలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడక్కడ చెట్లు పడిపోవడంతో పార్వతీపురం మండలంలో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment