అశేష ప్రేక్షక హృదయాల్లో తన నటనతో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర్‌రావుకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది.
అశేష ప్రేక్షక హృదయాల్లో తన నటనతో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర్‌రావుకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణాన్ని అభిమానులు, ఆయనతో సాన్నిహిత్యం గల వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నటించిన సువర్ణ సుందరి, దసరాబుల్లోడు, ప్రేమ్‌నగర్, ప్రేమాభిషేకం, ఏడంతస్తుల మేడ, మాయబజార్, వంటి చిత్రాలు జిల్లాలో వంద రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి.
- న్యూస్‌లైన్, కరీంనగర్ కల్చరల్
జిల్లాకు మూడు పర్యాయాలు వచ్చిన అక్కినేని జిల్లా కేంద్రానికి రెండు సార్లు వచ్చారు. సువర్ణసుందరి చిత్రం వందరోజులు ప్రదర్శించబడిన సందర్భంలో ఒకసారి, త్యాగరాయ కల్చరల్ అకాడమీ తరఫున సన్మానానికి మరోసారి వచ్చారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి అక్కడికి వెళ్లారు.
తన నట జీవితం 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలలకు రూ.25 చొప్పున విరాళం అందజేశారు. అందులో మన ప్రభుత్వ జూనియర్ కళాశాల(సైన్స్) కూడా ఉంది. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక నటుడికి అభిమాన సంఘం ఏర్పాటు చేశారంటే అది అక్కినేనిదే. లతీఫోద్దీన్ అహ్మద్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ప్రముఖ న్యాయవాది. స్వర్గీయ డి.కన్నయ్య గౌరవ అధ్యక్షులుగా, ప్యాట దిల్‌బాబు, సిరికొండ వెంకటేశం, చల్లా భూమయ్య, జిల్లా రాములు, దారం రాజేశ్వర్, కె.వెంకటరత్నం, బోడ్ల విభీషణ్ కలిసి అక్కినేని అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు.
త్యాగరాయ కల్చరల్ అకాడమీ తరఫున 1993 డిసెంబర్ 15న నగరంలోని సీవీఆర్‌ఎన్ రోడ్‌లో గల ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో అక్కినేని నటజీవిత మహోత్సవాన్ని నిర్వహించి వజ్రస్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు. ఈ సన్మాన సభలో అప్పటి శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు, ప్రభు త్వ విప్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పాట రాజం నాగేశ్వర్‌రావు, అప్పటి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు పాల్గొన్నారు. అక్కినేనితో ఆయన అభిమానులకున్న అనుబంధం వారి మాటల్లోనే..
జిల్లాలో తొలి అభిమాన సంఘం మాది..
జిల్లాలోని సుల్తానాబాద్‌లో 1969లో ఆయన పేరున అభిమాన సంఘాన్ని ప్రారంభించాం. జిల్లాలోనే మాది మొదటి అభిమాన సంఘం. ఆయన జీవిత విశేషాలతో కళాస్రష్ట అనే ప్రత్యేక సంచిక కూడా రూపొందించాం. మొదటిసారి కరీంనగర్‌కు సువర్ణసుందరి వంద రోజుల వేడుకలకు వచ్చారు. ఆయనను కలిసి సన్మానించాం. ప్రతీ సంవత్సరం ఆయన పుట్టినరోజుకు హైదరాబాద్ వెళ్లి అభినందించేవాళ్లం. ఆయన లేరన్నది వాస్తవం కాకపోతే బాగుండు.
- లతీఫోద్దీన్ ఆహ్మద్
ప్రేక్షకులే నా దైవం...
-అక్కినేని
త్యాగరాయ కల్చరల్ అకాడమీ నిర్వహించి న నటజీవిత మహోత్సవంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రేక్షకులే నాకు దేవుళ్లు, వారి కోరిక మేరకే నేను సినీరంగంలో ఉన్నాను. నా కళ ను అంతగా అభిమానించిన ప్రేక్షకుల్లో నేనే దైవాన్ని చూసుకుంటున్నాను’ అన్నారు. తాను చనిపోయిన తర్వాత కూడా అభిమానుల గుండెల్లో బతకాలని ఉందని గద్గద స్వరంతో అన్నారు.
ప్రేమ్‌నగర్‌తో అభిమానినైనా..
ఎనిమిదో తరగతిలో ఉన్నప్పు డు రోజ్ టాకీస్‌లో ప్రేమ్‌నగర్ సినిమా చూసిన. ఆ తర్వాత ఆయన అభిమానినయ్యా. ఆ తర్వాత సుల్తానాబాద్ ఏఎన్‌ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లతీఫోద్దీన్ ప్రో త్సాహంతో అభిమాన సంఘం ఏర్పాటు చేశాను. ప్రతీ చిత్రం చూడడం, బ్యానర్లు కట్టడం చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చే శాం. ఆయన ప్రతీ పుట్టిన రోజుకు వెళ్లి అభినందించడం, ఫొటోలు దిగడం చేసేవాళ్లం. ఆయన మరణం జీర్ణించుకోవడం కష్టమే. - పసుపులేటి రాజేశ్వర్‌రావు,
అసిస్టెంట్ అకౌంటెంట్ ట్రాన్స్‌కో
అభిమానం పెరిగింది..
నాగార్జున అంటే అభిమానం. ఆయనపై అభిమానంతో రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలోని సమాఖ్యలో చేరాను. దీంతో పాటే నాగేశ్వర్‌రావు సినిమాలు చూడడంతో ఆయనపై అభిమానం పెరిగింది. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజుకు వెళ్లడం పరిపాటి అయింది. ఆయనతో ఉండే ఆ కాసేపు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన మరణం సినీ పరిశ్రమకు, నాలాంటి అభిమానులకు తీరని లోటు. - తూము నారాయణ,
నాగార్జున ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు
అనుబంధం మరవరానిది..
అక్కినేని నాగేశ్వర్‌రావుతో అనుబంధం ఇప్పటిది కాదు. ఆయన అభిమానిగా ఆయన పేరున 1976 జనవరి 14న కరీంనగర్‌లో అభిమాన సంఘం ప్రారంభించాం. ఆయన నటించిన ప్రతీ చిత్రాన్ని ఐదు నుంచి ఆరు సార్లు చూసేవాళ్లం. కరీంనగర్‌కు రావడం చాలా సంతోషంగా అనిపించింది. మా చేతుల మీదుగా ఆయనను ఘనంగా సన్మానించాం.
- సిరికొండ వెంకటేశం
అరుదైన అవకాశం దక్కింది..
నా జీవితంలో మరవలేని అవకాశం, త్యాగరాయ కల్చరల్ అకాడమీ ద్వారా ఆయనను సన్మానించడానికి ఒప్పించడానికి ఏడాది పట్టింది. ఆరోగ్యం సహకరించదని చెప్పినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాం. చివరకు కరీంనగర్ వచ్చి మా సన్మానాన్ని అందుకున్నారు. కార్యక్రమం తర్వాత తరచూ ఆయనను కలిసే వాడిని.
- రఘువీర్‌సింగ్