అల్‌ఖైదా ఉగ్రవాదుల విచారణ
నెల్లూరు (క్రైమ్): బాంబు పేలుళ్ల ఘటనలో అల్‌ఖైదా ఉగ్రవాదులను వీడియో కాన్ఫరెన్స్ (వీడియో లింకేజీ) గురువారం విచారించారు. నెల్లూరు కోర్టులో బాంబు పేలుడు ఘటనలో నిందితులైన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఎ.అబ్బాస్ అలీ, షంషూన్ కరీం రాజా, మహ్మద్ అయూబ్, దావూద్ సులేమాన్, షంషుద్దీన్ అలియాస్ కరువ షంషుద్దీన్‌ను చిత్తూరు జిల్లా జైలు నుంచి ఈ నెల 15న నెల్లూరు నాలుగో నగర పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారిని నెల్లూరు కోర్టులో హాజరు పర్చగా మార్చి 1 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసు కస్టడీకీ అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన కోర్టు ఉత్తర్వులు మేరకు ఈ నెల 18న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు.
కర్ణాటకలోని మైసూర్, కేరళలోని కొల్లాం, మలపురం, ఏపీలోని చిత్తూరు కోర్టులో బాంబు పేలుళ్లలకు వీరు పాల్పడ్డారు. దావూద్ సులేమాన్ ప్రధాన సూత్రధారిగా వారు అను మానిస్తున్నారు. ఆదివారం ప్రధాన నిందితుడిని కోర్టు ప్రాంగణంలోకి తీసుకెళ్లి బాంబు పేలుడు ఎలా చేశారనే వివరాలను విచారించారు. ఈ కేసులకు సంబంధించి గురువారం కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే నిందితులు నెల్లూరు పోలీసుల కస్టడీలో ఉండటంతో నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేలా ఎన్‌ఐఏ చర్యలు తీసుకుంది.