మిర్యాలగూడ, న్యూస్‌లైన్: జిల్లాలో మద్యం దందా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల డిస్టిలరీల నుంచి వచ్చే మద్యం మిర్యాలగూడలో లభిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో తయారైన మద్యం యానాం నుంచి భారీగా దిగుమతి అవుతోంది. లారీల ద్వారానే దిగుమతి చేసుకుంటున్న మద్యం దళారులు నేరుగా బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం రాకెట్ ఎంతోకాలంగా సాగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉన్నందున యానాం నుంచి ఎన్‌డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) మద్యం భారీగా దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. ఒక్కొక్క ఫుల్ బాటిల్ మద్యానికి ఇక్కడి కంటే అక్కడ 200 రూపాయలు తక్కువకు లభించడం వల్ల ఈ దందా జోరుగా సాగుతుంది. ఎక్కువగా ఏసీ ప్రీమియం, రాయల్‌స్టాగ్ మద్యం బాటిళ్లు దిగుమతి అవుతున్నట్లు తెలిసింది. మిర్యాలగూడ నుంచి కాకినాడకు బియ్యం రవాణా చేస్తున్న లారీల్లో కూడా ఎన్‌డీపీ మద్యం దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. దిగుమతి అయిన మద్యాన్ని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. అయితే, రెండు రోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో సుమారు *1.20 లక్షల విలువైన్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఇంకా, మిర్యాలగూడ పట్టణంలోనే మరో ముగ్గురు ఎన్‌డీపీ మద్యం దందా చేస్తున్నట్లు సమాచారం.
నకిలీ మద్యం దిగుమతి
మిర్యాలగూడ పట్టణానికి హైదరాబాద్‌లోని ఉప్పల్, విజయపురి, ఘట్‌కేసర్ ప్రాంతాల నుంచి నకిలీ మద్యం దిగుమతి అవుతోంది. ఈ మద్యం కూడా నేరుగా బెల్ట్‌షాపులకు సరఫరా కావడం వలన దందా జోరుగా సాగుతుంది. ఆరు మాసాల క్రితం త్రిపురారం, మిర్యాలగూడ, నిడమనూరు మండలాల్లో నకిలీ మద్యం బాటిళ్లు తరలిస్తున్న, విక్రయిస్తున్న ముఠాలను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. త్రిపురారం మండలం గజలాపురం ఎక్స్‌రోడ్ సమీపంలో, నిడమనూరు మండలంలో బెల్ట్ షాపుల వద్ద విక్రయించేందుకు తీసుకెళ్తున్న నకిలీ మద్యంతో పాటు మిర్యాలగూడలో సహకరిస్తున్న వారిని మొత్తం 16మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారీగా నకిలీ మద్యాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.
సమాచారం వస్తే దాడులు చేస్తాం : కృష్ణాగౌడ్, ఎక్సైజ్ సీఐ మిర్యాలగూడ
నకిలీ మద్యం, ఎన్‌డీపీ మద్యం మిర్యాలగూడలో ఉన్నట్లు తమకు సమాచారం వస్తే దాడులు నిర్వహిస్తాం. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఎన్‌డీపీ మద్యం, నకిలీ మద్యం వచ్చే అవకాశాలున్నాయని తెలిసి నిఘా ఏర్పాటు చేశాం. వినియోగదారులు స్థానిక దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేయాలి. బయట లభించే మద్యం కొనుగోలు చేయవద్దు.
మందుచూపు
Published Sat, Dec 28 2013 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement