
మద్యంపై ఆగని పోరు
నిత్యం ప్రయాణికులు ఎక్కే బస్టాండ్ సెంటర్లో మద్యం షాపు ఏర్పాటుచేస్తే ఊరుకోబోమని మహిళలు, ఆటోయూనియన్
ఉలవపాడు : నిత్యం ప్రయాణికులు ఎక్కే బస్టాండ్ సెంటర్లో మద్యం షాపు ఏర్పాటుచేస్తే ఊరుకోబోమని మహిళలు, ఆటోయూనియన్ నాయకులు, స్థానికులు హెచ్చరించారు. ఈ మేరకు ఉలవపాడు బస్టాండ్ వద్ద ఉన్న స్థలంలో ప్రారంభం కానున్న నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఉలవపాడులో రెండు మద్యం షాపులుండేవి. అదనంగా మరోషాపు ఇవ్వడంతో అది ఎక్కడ పెట్టాలని నిర్వాహకులు బస్టాండ్ దగ్గరున్న ఓ స్థలంలో నిర్మించడానికి నిర్ణయించుకున్నారు. ఉలవపాడు నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు అక్కడ నిలబడాల్సిందే. ఇలాంటి చోట మద్యం దుకాణం ఏర్పాటుచేస్తే మందుబాబుల ఆకృత్యాలు మితిమీరుతారని ఆందోళనకారులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మద్యం దుకాణాన్ని మార్చాలి
గుడ్లూరు: స్థానిక బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న మద్యం దుకాణాన్ని, దాని పక్కనున్న బెల్ట్ షాపులను అక్కడ నుంచి మార్చి వేయాలని గుడ్లూరు గ్రామస్తులు తహశీల్దార్ మెర్సీ కుమారికి గురువారం వినతిపత్రం అందజేశారు. మద్యం దుకాణం బస్టాండ్‌లో నిర్వహించడం వల్ల మందు బాబుల ఆగడాలు ఎక్కువయ్యాయిని, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు కాంతమ్మ, చెంచులమ్మ, సుబ్బారావు, తిరుమల తదితరులు తహశీల్దార్ దృష్టికి తీసుకు వచ్చారు. ఒక పక్క మద్యం కారణంగా కాపురాలు గుల్లవుతుంటే మరింత విచ్చలవిడి చేయడం మంచి పద్దతి కాదన్నారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ మెర్సీకుమారి హామీ ఇచ్చారు.
నాంచారమ్మ కాలనీలో...
కందుకూరు: పట్టణంలోని నాంచారమ్మకాలనీలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు ఆందోళను కొనసాగిస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను మద్యం షాపును ఇక్కడ నిర్వహించడానికి అంగీకరించేది లేదని హెచ్చరించారు. వీరికి స్థానిక నాయకులతోపాటు, వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకుడు వలేటి రాఘవులు, సిపిఎం నాయకుడు ఎస్‌ఎ గౌస్‌లు మహిళలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఇలాగే మొండి వైఖరి అవలంబిస్తే మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.