బేరం కుదిరింది!
► మద్యం మాఫియా,
► ఎక్సైజ్ అధికారుల మధ్య ఒప్పందం
► సయోధ్య కుదిర్చిన అధికార పార్టీ నేత
► పెరిగిన మద్యం ధరలు
► సాక్షి-సాక్షి టీవీ జాయింట్ ఆపరేషన్‌లో వెల్లడి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మద్యం సిండికేట్ హవా మళ్లీ మొదలైంది. ఉన్నతాధికారుల మధ్య విభేదాలు సద్దుమణగడంతో బాటిల్ ధర పెరిగింది. బాటిల్‌పై రూ.5 పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అటు మద్యం సిండికేట్‌కు, ఇటు అధికారులకు మధ్య అంగీకారం నేపథ్యంలోనూ బాటిల్ ధర పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం షాపుల యజమానులు అందరూ కలిసి ధర పెంచినట్టు స్వయంగా షాపులో పనిచేసే సిబ్బందే చెబుతున్నారు. సాక్షి- సాక్షి టీవీ నిఘాలో ఈ అంశం స్పష్టంగా వెల్లడయ్యింది. మొన్నటివరకు ధర పెంచుకునేందుకు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు అడ్డొచ్చాయి. అధికార పార్టీ నేతలు సర్దిచెప్పడంతో బేరం కుదిరి... బాటిల్ ధర పెరిగింది.
జిల్లావ్యాప్తంగానూ ఇదే తీరు
జిల్లావ్యాప్తంగా మద్యం సిండికేట్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌లలో ఏకంగా బాటిల్‌పై రూ. 10 పెంచి మరీ విక్రయిస్తున్నారు. అక్కడి అధికార పార్టీ నేతల అండదండలతో దీనికి అడ్డులేకుండా పోయింది. తాజాగా కర్నూలులో బాటిల్‌పై రూ. 5 పెంచుకునేందుకు మొదట్లో జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇద్దరు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలతో రచ్చ అయ్యింది. ఏకంగా ఒక షాపును మరో అధికారి పట్టించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత సోదరుడు రంగప్రవేశం చేసి..సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా బాటిల్‌పై రూ.5 పెరిగింది. ఎంఆర్‌పీ ఉల్లంఘన షురూ అయ్యింది.
మరోవైపు సీజ్ అయిన షాపునకు వేసిన పెనాల్టీని..మద్యం సిండికేట్లు అందరూ కలిసి కట్టినట్టు సమాచారం. ఫలితంగా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చి షాపును సీజ్ చేసినప్పటికీ కేవలం పెనాల్టీతో సరిపుచ్చుకుని.. షాపు యథావిధిగాా ప్రారంభమయ్యింది. విచిత్రమేమిటంటే.. ఈ షాపులో కూడా యథావిధిగా ఎంఆర్‌పీ ఉల్లంఘన జరగడం.
సాక్షి నిఘాతో బట్టబయలు
మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని బయటపెట్టేందుకు సాక్షి-సాక్షి టీవీ నిఘా పెట్టింది. జిల్లాలో పలు షాపులను బుధవారం రాత్రి సాక్షి బృందం స్వయంగా వెళ్లి బాటిల్ ధర ఎంత అంటూ వాకబు చేసింది. ఈ సందర్భంగా యజమానులందరూ కలిసి ధర పెంచారని షాపులో పనిచేస్తున్న సిబ్బంది కుండబద్దలు కొట్టారు. ఒక షాపులో పనిచేసే సిబ్బంది ఏకంగా ధరలు పెంచకపోతే ఓనర్ కథ ముగుస్తుందంటూ మాట్లాడటం గమనార్హం.
‘సాక్షి’ టీంకు, మద్యం షాపు సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ..
షాపు నెంబరు 1:
సాక్షి: రాయల్ స్టాగ్ క్వార్టర్ ఎంత అన్న?
షాపు బాయ్: రూ. 155 అన్న.
సాక్షి: ఎంఆర్‌పీ ఎంత అన్న
బాయ్: రూ. 150.
సాక్షి: ఎందుకు రూ. 5 ఎక్కువన్న. ఎవరు డిసైడ్ చేశారు.
బాయ్: ఎక్సైజ్ వాళ్లు, సిండికేట్ వాళ్లు....వైన్‌షాపు ఓనర్స్ అందరూ మాట్లాడుకుని బాటిల్‌పై రూ.5 పెంచినారు.
షాపు నెంబరు 2:
సాక్షి: రాయల్ స్టాగ్ హాఫ్ ఎంత?
బాయ్: రూ. 310 అన్న. ఎంఆర్‌పీ కన్న ఎక్కువ.
సాక్షి: ధర ఎవరు పెంచారు.
బాయ్: ప్రభుత్వమే ఎక్కువ చేసింది. మాదేమీ ఇది సొంత షాపు కాదు. మేం పనిచేసే వాళ్లమే.
ఏదైనా రూ. 5 ఎక్కువే.