మందు జాతర
- జిల్లాలో 406 మద్యం షాపులకు నోటిఫికేషన్
- ప్రభుత్వ ఆధ్వర్యంలో 39 షాపులు
- ఏడాదికి రూ.175 కోట్ల ఆదాయం
- ఆదాయ పన్ను చెల్లించిన వారే దరఖాస్తుకు అర్హులు
- ఈ నెల 29న లాటరీ
సాక్షి, విశాఖపట్నం: మద్యం వ్యాపారులు.. మందు బాబులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2015-17 ఎక్సైజ్ పాలసీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలో 406 మద్యం షాపులకు ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు లాటరీ నిర్వహిస్తారు.
వీటిలో 39 షాపులను పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మిగతా 367 షాపులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తారు. రెండేళ్ల కాలానికి కేటాయించే ఈ షాపులకు వచ్చే నెల 1 నుంచి 2017 జూన్ 30వ తేదీ వరకూ లెసైన్స్ చెల్లుబాటులో ఉంటుంది. మద్యం షాపులు పొందాలంటే గత నిబంధనలతో పాటు ఈసారి కొత్తగా రెండేళ్ల కాలానికి సంబంధించిన ఆదాయ పన్ను ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. వాట్ పరిధిలో ఉంటే సంబంధిత పత్రం చెల్లించవచ్చు. గతంలో ఉన్న షాపులనే ఇక మీదట కూడా కొనసాగించనున్నారు. గతంలో
అబ్కారీ శాఖ నిర్వహణలో 53 మద్యం దుకాణాలు ఉండేవి. వాటిని ఇప్పుడు 39 చేసి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో నిర్వహించిన వేలం ప్రకారం మద్యం షాపుల రుసుం ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.147 కోట్ల ఆదాయం వస్తే ఈ సారి ఏడాదికి రూ.175 కోట్ల ఆదాయం రానుంది. వెనక్కు రాని దరఖాస్తు ఫీజుగా నగరపాలక సంస్థ సరిధిలో రూ.50 వేలు, పురపాలక సంస్థ పరిధిలో రూ.40వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30వేలు నిర్ణయించారు. బెల్టు షాపుల నియంత్రణకు ప్రత్యేక ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు.