రగిలిన ‘చైతన్య’ం | all are fire on telangana | Sakshi
Sakshi News home page

రగిలిన ‘చైతన్య’ం

Published Fri, Aug 30 2013 3:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

all are fire on telangana

 కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ‘‘ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలువాసుల త్యాగఫలమే నేటి హైదరాబాద్ అభివృద్ధి. 56 ఏళ్ల పాటు సీమాంధ్ర వాసుల రక్తమాంసాలు కరిగించి నిర్మించిన మహా నగరం అది. దేశంలో ఎక్కడా రాష్ట్రాల విభజన రాజధానితో ముడిపడలేదు. ఒక్క మన రాష్ట్రం విషయంలోనే స్వార్థరాజకీయాలతో సీమాంధ్రను పీకల్లోతు కష్టాల్లో ముంచే ప్రయత్నం జరిగింది. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా విభజన నిర్ణయానికి పూనుకోవడం తగదు. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి నాయకుడు ఉన్నట్లయితే విభజన అంశం తెరపైకి వచ్చేది కాదు’’ అంటూ సమైక్యవాదులు ముక్తకంఠంతో తెలిపారు
 
 . సాక్షి టీవీ, సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో గురువారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక్షన్ హాలులోనాగరాజు  వ్యాఖ్యాతగా ‘ఎవరెటు?’ అనే అంశంపై చైతన్యపథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు నేతల చేతగాని తనంపై కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడారు. విదేశీయురాలైన సోనియాగాంధీకి రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేదని.. ఆమెతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు కూర్చుని తరతరాలుగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి జీవిస్తున్న తెలుగు ప్రజలను విడదీయాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భావితరాల భవిష్యత్ కోసమే సీమాంధ్ర ప్రజలు జీతాలు, జీవితాలను ఫణంగా పెట్టి ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన నాయకులు తమ పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారని.. వారికి తగిన బుద్ధి చెబుతామని తేల్చి చెప్పారు. విభజన వల్ల తెలంగాణలో మళ్లీ నక్సలిజం, మతతత్వం, తీవ్రవాదం పెరిగిపోతుందని నిఘా సంస్థలు నివేదించినా సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానిని చేయాలనే స్వార్థంతో పెడచెవిన పెట్టారని విమర్శించారు.
 
 రాష్ట్ర విభజనతో విద్యార్థులకు ఉన్నత చదువు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సగం సగం తెలుగు వచ్చిన వారు రాష్ట్రాన్ని విభజించాలని అడిగితే.. తెలుగు రాని వారు విభజించాలని చూస్తున్నారని, తెలుగు రాని ప్రాంతంలో మన ప్రజాప్రతినిదులు దాక్కున్నారని ఓ గృహిణి తీవ్ర ఆవేదనతో దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను తరిమేస్తామని చెప్పే తెలంగాణ నేతలు భవిష్యత్‌లో ఐటీ ఉద్యోగులనూ వెళ్లగొడతారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వార్డు మెంబర్‌గా కూడా ఎన్నిక కాని ప్రధాన మంత్రి ఉండటం వల్లే దేశానికి ఈ పరిస్థితి దాపురించిందని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కో కన్వీనర్ విజయభాస్కర్‌యాదవ్ విమర్శించారు. చిన్న రాష్ట్రాల వల్ల సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవన్నారు. జిల్లా విద్యాసంస్థల జేఏసీ వైస్ చైర్మన్ జి.పుల్లయ్య మాట్లాడుతూ  తమ శాంతియుత ఉద్యమానికి  కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఇకపై పంథా మారుస్తామని అన్నప్పుడు సదస్సు మొత్తం చప్పట్లతో ఆయనకు మద్దతు పలికింది.
 
  జిల్లా జూనియర్ కళాశాలల అధ్యాపకుల జేఏసీ చైర్మన్ డాక్టర్ కె.చెన్నయ్య  ఉద్యమంలో కొన్ని  విద్యార్థి సంఘాలు కలిసి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే, ఉద్యమ కవరేజీ జాతీయ మీడియా దృష్టికి రాకపోడం విచారమని చెప్పినప్పుడు సభికులు పెద్ద ఎత్తున స్పందించారు. దేశంలో అన్ని వర్గాల కంటే ముస్లింలు పేదరికంలో మగ్గుతున్నారని విభజన వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందని ఉస్మానియా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ హుసేన్ అన్న మాటలు ఆలోచింపచేశాయి. రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు సంపత్‌కుమార్ సాగునీటి ఇబ్బందుల ప్రస్తావన తెచ్చినప్పుడూ సభలో స్పందన లభించింది. ఒక యువతి మాట్లాడుతూ తన పేరు అనవసరమని ‘సమైక్యవాది’ అని పరిచయం చేసుకుంటానన్న మాటలు ఉద్యమ తీవ్రతను తెలియ జెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement