ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు! | Seemandhra does not meet norms for special category status | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు!

Published Sat, Jun 14 2014 1:31 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు! - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు!

కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికా సంఘం నివేదిక- పీటీఐ కథనం
విభజన బిల్లు ఆమోదం సందర్భంగా ఏపీకి ఐదేళ్లు
‘స్పెషల్ స్టేటస్’ హామీ ఇచ్చిన నాటి ప్రధాని మన్మోహన్
ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ ఆమోదం
హామీని అమలు చేయాలని ప్రణాళికా సంఘానికీ నిర్దేశం
జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం అవసరం లేదన్న జైరాం
రాష్ట్ర విభజన అమలైన నేపథ్యంలో ప్రత్యేక హోదాపై చర్చ
ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రణాళికా సంఘం వివరణ
 
 సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ప్రస్తుతం నిర్దేశిస్తున్న నిబంధనల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పించటం సాధ్యం కాదని పేర్కొంటూ కేంద్ర ప్రణాళికా సంఘం కేంద్ర ప్రణాళికాశాఖ మంత్రి ఇందర్‌జిత్‌సింగ్‌కు నివేదిక సమర్పించినట్టు పీటీఐ వార్తా సంస్థ శుక్రవారం ఒక కథనం ప్రచురించింది. ప్రత్యేక హోదా కల్పించేందుకు ఎన్‌డీసీ నిర్దేశించిన విధివిధానాలు.. ఆంధ్రప్రదేశ్‌కు వర్తించవని, ఆ నిబంధనలను ఆంధ్రప్రదేశ్ సంతృప్తిపరచటం లేదని ప్రణాళికా సంఘం తన నివేదికలో చెప్పిందనేది ఆ కథనం సారాంశం. అయితే.. ప్రణాళికాసంఘం నివేదిక నేపథ్యంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రణాళికామంత్రి ఇందర్‌జిత్‌సింగ్‌తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించారు.

 

దీంతో శుక్రవారం రాత్రి ప్రణాళికాసంఘం ఒక ప్రకటన చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పరిశీలనలోనే ఉందని.. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చింది.


 రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు గత ఫిబ్రవరి 21న రాజ్యసభలో ఆమోదం పొందే సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్.. రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2014 మార్చి 2న జరిగిన కేంద్ర మంత్రివర్గం కూడా దీనిని ఆమోదించింది. ప్రణాళిక సంఘం చైర్మన్ హోదాలో స్వయంగా ప్రధానమంత్రి సభలో చేసిన వాగ్దానమైనందున అమలుపరచాలని ప్రణాళికాసంఘాన్ని ఆదేశించింది. అయితే.. ‘రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలంటే అందుకు జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించాల్సి ఉంటుంది కదా?’ అన్న ప్రశ్నకు ఆనాటి కేంద్రమంత్రి జైరాంరమేశ్.. ఎన్‌డీసీ అనుమతి అవసరం లేదని, కేవలం ఆమోదించాలని, స్వయంగా ప్రధానమంత్రి సభలో హామీ ఇచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఉండవని బదులిచ్చారు.

 

కానీ ఏపీకి స్పెషల్ స్టేటస్‌పై ఆనాటి కేబినెట్ తీర్మానం జరిగిన రెండు రోజులకే కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు జారీచేయడంతో ఆ తీర్మానం ముందుకు సాగలేదు. తరువాత పాత ప్రభుత్వం రద్దయి కొత్త ప్రభుత్వం రావడం, ఎన్‌డీఏ సర్కారు తొలి మంత్రివర్గ సమావేశంలోనే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించడం, రాష్ట్రపతి సంబంధిత ఆర్డినెన్స్ జారీచేయడం వంటి పరిణామాలు చకచకా సంభవించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ అంశంపై మాత్రం కదలిక రాలేదు. ఇటీవల మాజీ మంత్రి జైరాంరమేశ్ ఓ విలేకరుల సమావేశంలో దీనిపై స్పందిస్తూ ‘‘ఒకవేళ కేంద్రం ఆ హామీ నెరవేర్చకుంటే ఎన్‌డీఏ ప్రభుత్వం విఫలమైనట్టే లెక్క. స్వయంగా నాటి ప్రధానమంత్రి, ప్రణాళిక సంఘం చైర్మన్ అయిన మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటన అది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటవుతున్న జూన్ 8 నాటికే ప్రణాళికాసంఘం నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుంది...’’ అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ‘‘బిల్లు పాసయిన సందర్భంలోనే అప్పటి ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ అహ్లూవాలియాను నేను సంప్రదించాను. ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటన అయినందువల్ల అమలు సులభసాధ్యమేనని ఆయన చెప్పారు. అందువల్ల స్పెషల్ స్టేటస్ రావడంలో ఎలాంటి అవాంతరాలు లేవని నేను నమ్ముతున్నా. ఒకవేళ ఉన్నా.. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎన్‌డీసీలో ఆమోదింపజేసుకోవాల్సి వస్తే.. అందులో అటు యూపీఏ పాలిత, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు ఉన్నందున అది పెద్ద కష్టమైన పనేం కాదు..’’ అని పేర్కొన్నారు.
 
 ఎన్‌డీసీ నిబంధనలేమిటంటే...
 
 సాధారణ రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో 30 శాతం గ్రాంటుగా, 70 శాతం రుణంగా లభిస్తుండగా.. స్పెషల్ కేటగిరీ స్టేటస్ జాబితాలో ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంటుగా, 10 శాతం రుణం రూపంలో కేంద్ర సాయం లభిస్తుంది. ప్రస్తుతం కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఉండటమే కాకుండా.. రాష్ట్రానికి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్టేటస్ హోదా ఇస్తామని నాటి కేంద్ర సర్కారు విభజనకు ముందే ప్రకటించింది.
 
 ఈ నెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ విభజన అధికారికంగా అమలులోకి వచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా అంశం చర్చనీయాంశంగా మారింది. 13 జిల్లాలతో మిగిలిన కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పెషల్ స్టేటస్‌కు అర్హత పొందాలంటే ఎన్‌డీసీ నిబంధనలను సంతృప్తి పరచాలని, అయితే ఆ రాష్ట్రం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలేవీ సంతృప్తిపరచగలిగేలా లేదని కేంద్ర ప్రణాళికాసంఘం కేంద్ర ప్రణాళికా మంత్రికి ఇచ్చిన నివేదికలో చెప్పినట్టు పీటీఐ తాజా కథనంలో పేర్కొంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల మేరకు స్పెషల్ స్టేటస్‌కు అర్హత సాధించాలంటే.. 1. పర్వత, క్లిష్టతరమైన ప్రాంతమై ఉండాలి. 2. జనసాంద్రత తక్కువగా ఉండాలి. 3. గిరిజన జనాభా ఎక్కువగా ఉండాలి. 3. ఇతర దేశాల సరిహద్దులను పంచుకునేవిగా ఉండాలి. 4. ఆర్థిక, మౌలిక వనరుల్లో వెనకబడి ఉండాలి. 5. ఆర్థిక వనరులను సమీకరించుకోలేనివిగా ఉండాలి. అయితే ఈ నిబంధనలను సంతృప్తిపరుస్తున్న 11 రాష్ట్రాలు ప్రస్తుతం స్పెషల్  కేటగిరీ స్టేటస్‌ను పొందాయి. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే.. బీహార్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక తరగతి హోదా కోసం డిమాండ్లు ఉన్నాయి.
 
 
 ‘ప్రత్యేక హోదా’ పరిగణనలో ఉంది: ప్రణాళికా సంఘం
 
 ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పొందేందుకు ఎన్‌డీసీ నిబంధనలను సంతృప్తిపరచడం లేదంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రణాళికా సంఘం శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చే అంశంపై తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ప్రసార సాధనాల్లో వస్తున్న వార్తల కారణంగా ఈ విషయం తెలియపరుస్తున్నాం. ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ప్రణాళికాసంఘం పరిగణనలో ఉంది’’ అని ఆ ప్రకటనలో వివరించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రణాళికాసంఘం మంత్రితో చర్చించాక ఈ ప్రకటన వెలువడటం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement