సీమాంధ్ర తొలి సీఎస్‌గా ఐవైఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు నియమితులు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు సీఎస్ ఎంపికపై కసరత్తును పూర్తి చేశారు. ఐవైఆర్ కృష్ణారావును సీఎస్‌గా నియమించాల్సిందిగా శనివారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి కోరారు. ఈ మేరకు ఆయన ఐవైఆర్ కృష్ణారావును వెంటతీసుకుని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం సీఎస్‌గా పనిచేస్తున్న మహంతి జూన్1వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తరువాత 1979 బ్యాచ్‌కు చెందిన వారిలో ఐ.వి.సుబ్బారావు సీనియర్‌గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం యునెస్కోలో పనిచేస్తున్నారు. సీఎస్ పదవి ఇస్తానంటే యునెస్కోలో బాధ్యతలను వదిలి రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయినా ఎందుకో చంద్రబాబు ప్రస్తుతం సీసీఎల్‌ఏ బాధ్యతలు నిర్వహిస్తున్న ఐవైఆర్ కృష్ణారావువైపు మొగ్గారు.
గతంలో ఆర్థిక, పంచాయతీరాజ్ బాధ్యతలు
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఐవైఆర్ ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలు నిర్వహించారు. జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఐవైఆర్ బాధ్యతలు స్వీకరిస్తే 2016 జనవరి వరకు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర సర్వీసులో ఉన్న తననుకాదని కేంద్ర సర్వీసులో ఉన్న మహంతిని తీసుకువచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడం పట్ల ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
పేషీ అధికారులూ ఖరారు: చంద్రబాబు తన పేషీలో అధికారుల నియామకాలను కూడా ఖరారు చేశారు. తన పేషీలో నియమించుకునే అధికారుల వివరాలను గవర్నర్ నరసింహన్‌కు తెలియజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల్లో ఎవరు తెలంగాణకు, ఎవరు ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ అవుతారో తేలాల్సి ఉంది. 1984 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ ప్రకాశ్ సహానీని సీఎం పేషీ ముఖ్యకార్యదర్శిగా, 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎ. గిరిధర్‌ను, 1991 బ్యాచ్‌కు చెందిన జి.సాయిప్రసాద్‌ను సీఎం పేషీ కార్యదర్శులుగా నియమించుకోవాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న కె. మధుసూదన్‌రావును సీఎం పేషీలో అదనపు కార్యదర్శిగా నియమించుకోవాలని అనుకుంటున్నారు. వీరి పేర్లను చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నెల 31వ తేదీ గానీ లేదా జూన్ 1వ తేదీ గానీ వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు దగ్గర పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను సీఎం పేషీలో ఓఎస్‌డీగా నియమించుకోవాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.