రెండున్నర శతాబ్దాలకుపైగా నమ్మకానికి, మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండగకు నెల్లూరు నగరం ముస్తాబైంది. ఏటా మొహర్రం పండగ రోజు రొట్టెల పండగ ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, సౌదీ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న క్రమంలో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరుగుతున్న మొదటి పండగ కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 10న ప్రారంభమయ్యే రొట్టెల పండగ 14వ తేదీ వరకు జరగనుంది. నెల్లూరు నగరపాలక సంస్థ, జిల్లా పోలీసు యంత్రాంగం, నీటి పారుదల శాఖ, పలు శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గా ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వరాల రొట్టెల పండగ వచ్చేసింది. కోరుకున్న కోర్కెలు తీరి వదిలే వరాల రొట్టెను.. కోర్కెలతో ఒడిసి పట్టుకునేందుకు భక్తులు వచ్చేశారు. హిందూ, ముస్లిం మతాల సామరస్యానికి ప్రతీకగా జరిగే పండగ మంగళవారం షహదాత్‌తో ప్రారంభమవుతుంది. 11న గంధం మహోత్సవం, 12న రొట్టెల పండగ 13న తహలీల్ ఫాతేహా, 14న ముగింపు సభతో రొట్టెల పండగ ముగియనుంది. గతేడాది ఉత్సవాలకు 10 లక్షల మంది హజరయ్యారు. దానిని ప్రామాణికంగా తీసుకొని అధికారులు ఈ ఏడాది కూడా ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ.1.57 కోట్లతో దర్గా ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య, ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి దర్గాలో భక్తు రద్దీ బాగా పెరిగింది.
విద్యుత్ వెలుగులో బారాషహీద్ దర్గా ప్రాంగణం
ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తుల రాక
ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రొట్టెల పండగకు రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, రాష్ట్రాలతో పాటు దుబాయ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువులో నీటి నిల్వలను ఉండేలా చర్యలు తీసుకున్నారు. ముందుగానే సోమశిల నుంచి నీరు విడుదల చేసి 11.5 అడుగుల మేర నీటి మట్టం తగ్గకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మరో వైపు భక్తుల రద్దీ దృష్ట్యా నీటి శుద్ధి కోసం మంగళవారం నుంచి 300 క్యూసెక్‌ల నీటిని విడుదల చేసేలా అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు నీటిని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు.
రాష్ట్ర నీటిపారదుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, నెల్లూరు నగర కమిషనర్ మూర్తి నిరంతరం దర్గా ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రొట్టెల పండగలో 11, 12 తేదీలో భారీగా భక్తులు తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ముందస్తుగా చేపట్టారు. వర్షాల వల్ల ఇబ్బంది వస్తే ప్రాంగణంలో ఉండే భక్తుల కోసం అందుబాటులో ఉన్న రెండు కల్యాణ మండలపాలను బస కోసం సిద్ధం చేసి ఉంచారు. అన్ని విభాగాల అధికారులు మంగళవారం నుంచి రొట్టెల పండగ విధుల్లో ఉంటారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ
దర్గా ప్రాంగణంలో 48 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని దర్గా ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. 1,891 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు రొట్టెల పండగకు వచ్చే వారి సంఖ్యను గుర్తించటానికి ప్రత్యేకంగా సాప్ట్‌వేర్ సిద్దం చేశారు. అలాగే నగరంకు అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలకు వీలుగా 14 చోట్ల పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
మూడు షిప్టుల్లో 4,500 మంది కార్మికులు
రొట్టెల పండగ నేపథ్యంలో మూడు షిప్టుల్లో 4,500 మంది పారిశుధ్య కార్మికులు దర్గాలో, నగరంలో పని చేయనున్నారు. నీటిని శుభ్ర చేయడం మొదలుకొని దర్గా పరిశుభ్రంగా ఉంచడం వరకు అన్ని పనులు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరయ్యే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది 63 మందిని విధులకు కేటాయించారు.
అప్రమత్తంగా ఉండాలి
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సూచించారు. మంగళవారం రొట్టెల పండగ ప్రారంభం కానుంది. జిల్లాతోపాటు ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 2,500 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్పీ బారాషహీద్ దర్గాను పరిశీలించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. అనంతరం పోలీసు కవాతు మైదానంలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 11వ తేదీ రాత్రి గంధ మహోత్సవం, 12వ తేదీ ప్రధానమైన రోజులన్నారు. ఆ రోజుల్లో పెద్దసంఖ్యలో భక్తులు దర్గాను దర్శించుకుంటారన్నారు.
దర్గాలోకి ప్రవేశించే ద్వారం వద్ద, దర్శనం అయ్యాక బయటకు వచ్చేద్వారాల వద్ద ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వర్ణాల ఘాట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రైమ్ పార్టీలు విస్తృతంగా తిరుగుతూ నేరాలు జరగకుడా చూడాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులందరూ ఇతర జిల్లాల నుంచి బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందిని సమన్వయం చేసుకుని పండగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. ట్రాఫిక్ సిబ్బంది విధిగా రేడియం జాకెట్లు, హ్యాండ్‌సిగ్నల్ బ్యాట్‌లు వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment