అందరికీ పింఛన్ | All of them penision | Sakshi
Sakshi News home page

అందరికీ పింఛన్

Published Mon, Dec 22 2014 2:26 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

All of them penision

 పింఛన్..పింఛన్.. రెండు నెలలుగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. పింఛన్ల పంపిణీలో కొత్త నిబంధనల కారణంగా లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేలి ముద్రలు పడక చాలా చోట్ల వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వీఐపీ రిపోర్టర్ హోదాలో డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం తెలుసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయా? పంపిణీ ప్రక్రియలో ఎక్కడ లోపం ఉందో తెలుసుకున్నారు. శనివారం అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ జనశక్తినగర్‌కు వెళ్లి లబ్ధిదారుల సమస్యలను సావదానంగా విన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అర్హులందరికీ పింఛన్ ఇప్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.      
 
 
 వెంకటేశం : ఏం పెద్దాయన. పింఛన్ సక్రమంగా అందుతోందా?
 ఫకృద్దీన్ : మూన్నెళ్లనుంచి అందలేదయ్యా!
 వెంకటేశం : ఏం ఆందోళన పడొద్దు. మాన్నెళ్లది ఒకే సారి వస్తుంది.
 వెంకటేశం : ఏమ్మా..నువ్వు పింఛన్ తీసుకున్నావా?
 పెద్దక్క : నాకు ముప్పై ఏళ్ల నుంచి పింఛన్ వస్తోంది సారూ. చంద్రబాబు వెయ్యి రూపాయలు చేసినప్పటి నుంచి రాలేదు. మూన్నెళ్లు అయితాంది. కంప్యూటర్‌లో వేలిముద్రలు పడలేదని సెపుతున్నారు.
 వెంకటేశం : వేలిముద్రలు పడకపోయినా మీకు పింఛన్ జాబితా పంపించాం. దాంట్లో నీ పేరుంటే చాలు. అధికారులు నిర్ధారించి పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు.
 వెంకటేశం : ఏమ్మా నీ పేరేమి.? నీ సమస్య ఏంటి?
 దస్తగిరమ్మ: మాయన పోయి ఐదేళ్లు అవుతాంది. అప్పట్నుంచి  పింఛన్‌పైనే ఆదారపడుతున్నా. ఇప్పుడు ఎప్పుడిత్తారో.. ఎక్కడిత్తారో సెప్పే నాథుడు లేరు. కుటుంబం గడిచేది కష్టంగా ఉంది. మా సమస్య ఎవరితో సెప్పుకోవాలి.
 వెంకటేశం : ఆధార్ నంబర్ ఇచ్చావా?
 దస్తగిరమ్మ: మూడు సార్లు ఇచ్చినాం సామీ!
 వెంకటేశం : ఆధార్ నంబర్ ఇచ్చింటే తప్పకుండా వస్తుంది. ఏం బెంగ పెట్టుకోవద్దు.
 వెంకటేశం : ఏంటమ్మా అలా ఉన్నావు.? పింఛన్ అందలేదా?
 ముంతాజ్ : పింఛన్ కోసం కళ్లు కాచేలా చూస్తున్నాం సారూ. రోజుకు 5 నుంచి 10 మందికి ఇస్తున్నారు.  దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. రెండు రోజులు ఇచ్చారు. మళ్లీ ఇటు వైపు రాలేదు. ఇట్లైతే ఇంకెప్పుడిత్తారో?
 వెంకటేశం : కొత్తగా మిషన్‌లు వచ్చాయ్. రోజూ 100 మందికి ఇచ్చేందుకు వెసులుబాటు ఉంటుంది. మీరు సహకరిస్తే ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
 వెంకటేశం : ఏం పెద్దాయమ్మ. దిగాలుగా ఉన్నావే.?
 రాములమ్మ : ఏం సెప్పేది సారూ. పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసినట్లుంది. రోజూ కాలనీలో విచారించుకునేందుకు సరిపోతాంది. మాకంతకూ పింఛన్ ఇస్తారా? ఎప్పుడిస్తారో చెప్పండి సారు.
 
 వెంకటేశం : రెండు రోజుల్లో మీ కాలనీలో అందరికీ పింఛన్‌లు అందించే ఏర్పాటు చేస్తా (తపాల ఎస్పీతో మాట్లాడిన తరువాత).
 వెంకటేశం : ఏం బాబు (వికలాంగున్ని చూస్తూ) నువ్వ కూడా తీసుకోలేదా.?
 మహబూబ్‌బాషా: సార్, చాలా ఇబ్బంది అవుతోంది. రెండు నెలలుగా తీసుకోలేదు.  టౌన్‌లో అంతా పంచుతున్నారు. మా కాలనీకి మాత్రం రాలేదు. పింఛన్ వస్తుందో రాదోనని దిగులు పట్టుకుంది.
 
 వెంకటేశం : తప్పకుండా వస్తుంది. మీలాంటి వాళ్లు అనవసరంగా తిరిగి ఇబ్బందులు పడొద్దు.
 వెంకటేశం : ఏమ్మా పింఛన్ వచ్చిందా? లిస్టులో చూసుకున్నావా?
 గంగమ్మ : లిస్టులో పేరు ఉందా లేదా అని సెప్పెవాళ్లు ఎవరూ లేరు.  ఇంత వరకూ లిస్టే రాలేదంటున్నారు. మా పేరు ఎవరు సెప్తారో తెలియడం లేదు. ఒకప్పుడు బాగుండే. ఇళ్ల వద్దకు వచ్చి ఇచ్చే వాళ్లు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు.
 వెంకటేశం : ఇప్పటికే  పింఛన్ జాబితాను పంపించాం. కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్లి జాబితా తెచ్చుకుని లిస్ట్‌లో పేర్లున్నాయో లేదో చూసుకోండి.
 వెంకటేశం : ఏమ్మా నువ్వ పింఛన్ ఎంత తీసుకుంటున్నావు?
 సుబ్బమ్మ : సార్.. మూడు నెలల నుంచి పింఛన్ తీసుకోలేదు. రేపుమాపు అంటున్నారు. అప్పట్లో రూ. 200 ఉండేది. ఇప్పుడు వెయ్యి రూపాయాలు అంటున్నారు. కానీ మా కాలనీలో ఎప్పుడిస్తారో తెలియడం లేదు.
 
 వెంకటేశం : పోస్టల్ వాళ్లతో మాట్లాడి మీ కాలనీకి త్వరగా ఇప్పించేలా చూస్తా.
 వెంకటేశం : అన్నా నీ సమస్య చెప్పు.  పింఛన్ అందలేదా?
 హనుమన్న : సారూ.. వికలాంగ పింఛన్ కింద రూ.1500 వస్తుందని అంటున్నారు. కానీ ఇచ్చింది లేదు. చాలా ఇబ్బంది అవుతాంది. దీనిపై ఆధారపడేటోళ్లం. మాపై కరుణ చూపండి. వెంటనే మాకు పింఛన్ ఇప్పించండి.
 
 సమస్యలపై పోస్టల్ అధికారులతో మాట్లాడిన పీడీ
 ప్రతి నెలా పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సమస్యలను విన్న పీడీ వెంకటేశం చలించారు. అక్కడ నుంచే ఫోన్‌లో తపాలశాఖ సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. ‘జనశక్తినగర్ పెద్ద కాలనీ. కాలనీలో పింఛన్‌లు పంచేందుకు అధికారులు ఒక రోజు మాత్రమే వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికి 5 మందికి మాత్రమే పింఛన్ ఇచ్చారంట.
 
 అదనపు సిబ్బందిని కేటాయించైనా కాలనీలో త్వరగా పింఛన్‌లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోండి. రేపటి నుంచే కౌంటర్ ఏర్పాటు చేయండి’ అని   కోరారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ‘పింఛన్ పంపిణీపై కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.  ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఏడు మున్సిపాల్టీల పరిధిలో 61 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల పింఛన్ మంజూరైంది. 54 స్పాట్ మిషన్‌ల ద్వారా పంపిణీ చేపడుతున్నాం. అందువల్ల పింఛన్‌దారులకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అందరికీ పెన్షన్ తప్పక అందుతుంది. వేలిముద్రలు సరిపోకపోయినా జాబితాలో పేరుంటే చాలు బిల్ కలెక్టర్ పేరు మీద పెన్షన్ మంజూరు చేయమని ఆదేశాలు జారీ చేశాం’’ అని చెప్పారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement